ఎదులాపురం,ఆగస్టు 25: ఈ నెల 28న నిర్వహించనున్న కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేశామని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ సమావేశ మందిరంలో పరీక్షల సూపరింటెండెంట్స్, అబ్జర్వర్లు, బయోమెట్రిక్ అధికారులతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 49 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.
ఆదిలాబాద్‌లో 29 సెంటర్లు, ఉట్నూర్‌లో 20 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 16,477 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు. హాల్ టికెట్, ఫొటో, పెన్ తప్ప మరే ఇతర పత్రాలను వెంట తీసుకు రావద్దని స్పష్టం చేశారు. ఎలక్ట్రానిక్ పరికరాలు, ఫోన్లు, ఎగ్జామ్ ప్యాడ్లను వాటిని పరీక్షా కేంద్రంలోనికి అనుమతించబోమని తెలిపారు.
ప్రతి ఒక్కరూ బయోమెట్రిక్ ద్వారా హాజరు తీసుకోనున్నట్లు వివరించారు. చేతులకు గోరింటాకు, మెహంది పెట్టకోవడం వలన బయోమెట్రిక్‌లో వేలిముద్రలు సరిగ్గా వచ్చే అవకాశం ఉండదన్నారు. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలని సూచించారు. అభ్యర్థులను గంట ముందు నుంచే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తామని చెప్పారు. నిర్ణీత సమయానికి నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోనికి అనుమతించబోమని స్పష్టం చేశారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీలు ఎస్.శ్రీనివాస రావు, సీ సమయ్జాన్ రావు, రీజినల్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ జాకీర్ హుస్సేన్, ఏఆర్ డీఎస్పీ ఎం విజయ్ కుమార్, ఆర్ఐ డీ వెంకటి, కమ్యూనికేషన్ సిబ్బంది ఉన్నారు.
28న ప్రత్యేక బస్సులు
భైంసా, ఆగస్టు 25 : పోలీస్, ఎక్సైజ్ కానిస్టేబుల్ పరీక్షలు రాసే అభ్యర్థుల కోసం భైంసా బస్టాండ్ నుంచి 28 వ ఉదయం 5 గంటల నుంచి ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్‌కు ప్రత్యేక బస్సులు కేటాయించామని ఆర్టీసీ డిపో మేనేజర్ అమృత ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని అభ్యర్థులు వినియోగించుకోవాలని కోరారు.