నిర్మల్ అర్బన్, ఆగస్టు 25 : రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలను ప్రైవేట్‌కు దీటుగా తీర్చిదిద్దుతున్నది. ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమంతో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేయడంతో పాటు ఆంగ్ల మాధ్యమంలో బోధన ప్రారంభించడంతో అడ్మిషన్లు భారీగా పెరిగాయి. ఒకటి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులు ప్రైవేట్ నుంచి సర్కారు బడుల్లో చేరేందుకు పోటీపడుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పెద్ద ఎత్తున పాఠ్యపుస్తకాల ముద్రణ పూర్తయ్యింది. నిర్మల్ జిల్లాలో మొత్తం 834 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా ఇందులో 576 ప్రాథమిక, 90 ప్రాథమికోన్నత, 168 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. 70 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు 100శాతం సరఫరా..
నూతన పాఠ్యపుస్తకాలు రెండు దశల్లో ఆర్టీసీ కార్గో సర్వీసుల ద్వారా జిల్లాలోని ఆయా బుక్ డిపో కేంద్రాలకు చేరాయి. అక్కడి నుంచి నేరుగా పాఠశాలలకు సరఫరా చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలకు ప్రభుత్వం పాఠ్యపుస్తకాలు కేటాయించింది. యూడైస్‌లో వివరాల ఆధారంగా విద్యార్థుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని పాఠ్యపుస్తకాలు ముద్రించింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 17,37,739 పుస్తకాలు అవసరం కాగా ఆ మేరకు సరఫరా పూర్తయ్యింది.
బార్‌కోడింగ్ ఆధారంగా పంపిణీ
ప్రభుత్వం కోట్లాది రూపాయల ఖర్చుతో ముద్రించిన పాఠ్యపుస్తకాలు ప్రైవేట్ పరం కాకుండా పకడ్బందీగా చర్యలు తీసుకున్నారు. స్కాన్, బార్‌కోడింగ్ ఆధారంగా ప్రభుత్వం పాఠ్యపుస్తకాలు ముద్రించింది. పుస్తకాలపై ఉన్న బార్కోడ్ ఆధారంగా అవి ఏ జిల్లాకు కేటాయించినవో సులువుగా తెలుసుకోవచ్చు. ప్రైవేట్ వ్యక్తులు విక్రయించినట్లయితే బార్కోడ్ ఆధారంగా కేసులు నమోదు చేసే అవకాశం ఉంది.
ఒకే పుస్తకంలో రెండు భాషల్లో ముద్రణ
సర్కారు పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం అమలు చేయడంతో దీనికి అనుగుణంగా పుస్తకాలు ముద్రించింది. ఓ పేజీలో తెలుగు ఉంటే పక్క పేజీకి అదే పాఠానికి సంబంధించి ఆంగ్లంలో ముద్రించారు. విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలో చదివేందుకు పుస్తకాలు ముద్రించింది. పాఠ్యపుస్తకాల ముద్రణ నిర్ణయంపై విద్యార్థులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.