ఉట్నూర్, ఆగస్టు 22 : గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని ఐటీడీఏ పీవో వరుణ్‌రెడ్డి అన్నారు. ఉట్నూర్‌లోని ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్‌లో అర్జీలు స్వీకరించారు. అర్జీదారులతో ఆయన మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఉట్నూర్ మండలం నాగాపూర్ గ్రామానికి చెందిన సిడాం కన్నీబాయి ఎడ్లజత ఇప్పించాలని, హస్నాపూర్ గ్రామానికి చెందిన భీంరావ్ కోడి పిల్లల మంజూరు నిధులు, గుడిహత్నూర్ మండలం తోషం గ్రామానికి చెందిన రాయిసిడాం సుమన్ గొర్రెల పెంపకానికి సహాయం చేయాలని, ఆదిలాబాద్ మండలం తంతోలి గ్రామానికి చెందిన పెంటమ్మ పట్టామార్పిడి చేయాలని, తలమడుగు మండలం షేకుగూడకు చెందిన నిర్మల ఎడ్లజత ఇప్పించాలని, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం కోపగూడ గ్రామానికి చెందిన అనిల్ కుమార్ కిరాణ దుకాణానికి నిధులు మంజూరు చేయాలని అర్జీ పెట్టుకున్నారు. కార్యక్రమంలో ఏపీవో భీంరావ్, డీడీ దిలీప్, అధికారులు పాల్గొన్నారు.
గురుకులాలను శుభ్రంగా ఉంచండి
ఉట్నూర్, ఆగస్టు 22 : ఏజెన్సీలోని గురుకులాలు, ఆశ్రమ పాఠశాలను శుభ్రంగా ఉంచాలని గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సూచించారు. ఐటీడీఏ పీవో వరుణ్‌రెడ్డి, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు, సిబ్బంది గురుకులాలను శుభ్రంగా ఉంచాలని, విద్యార్థుల ఆరోగ్య సమస్యలు ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు తెలుపాలన్నారు.
విద్యార్థులకు వ్యక్తిగత శుభ్రత నేర్పాలన్నారు. పీవో మాట్లాడుతూ గురుకులాలు, ఆశ్రమాల్లో శుభ్రత పాటిస్తున్నామని, హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయిస్తున్నామని, నాణ్యమైన భోజనం, ఆర్వో ప్లాంట్ల ద్వారా నీరు అందిస్తున్నామని తెలిపారు. కొన్ని ఆశ్రమాల్లో ఖాళీ స్థలాల్లో పెంచిన కూరగాయలతో వంటలు చేస్తున్నారని వివరించారు. కార్యక్రమంలో డీడీ దిలీప్, ఆర్సీవో గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.