ఆదిలాబాద్, (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ ఇచ్చోడ, ఆగస్టు 22 : పల్లె ప్రగతిలో ఒక ట్రాక్టర్ ముక్రా(కే) గ్రామ రూపురేఖలను మార్చేసి, చెత్త ద్వారా ఆర్థిక వనరులు సమకూర్చుకోవడం ఎంతో గర్వకారణమని కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కపిల్ పాటిల్ అన్నారు. పంజాబ్రాష్ట్రంలోని చండీగఢ్‌లో సోమవారం నిర్వహించిన జాతీయ స్థాయి వర్క్‌షాప్‌లో ముక్రా(కే) సర్పంచ్ గాడ్గె మీనాక్షి, ఎంపీటీసీ సుభాష్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ చెత్త ద్వారా సేంద్రియ ఎరువులు తయారు చేస్తూ ఆదాయాన్ని సమకూర్చుకుంటున్న తొలి గ్రామ పంచాయతీ ముక్రా(కే) గ్రామమని అన్నారు. ఇటీవల కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ బృందం సభ్యులు ముక్రా(కే)లో పర్యటించారని, చేసిన అభివృద్ధి పనులు ఎంతో అభినందనీయమని కొనియాడారు. కార్యక్రమంలో ఆదిలాబాద్జడ్పీచైర్మన్ రాథోడ్ జనార్దన్ పాల్గొన్నారు.