ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని పక్కాగా అమలు చేసేందుకు రాష్ట్ర సర్కారు కొత్త మార్గ దర్శకాలను జారీ చేసింది. పరిశుభ్రమైన వాతావరణంలో నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని ఆదేశాలిచ్చింది. ఇప్పటికే పోషకాలు కలిగిన బియ్యాన్ని సరఫరా చేయగా, ఇక వారంలో మూడు రోజులు ఉడికించిన కోడిగుడ్లు విధిగా అందించాలని, రాతపూర్వక ఒప్పందం చేసుకోవాలని స్పష్టం చేసింది. ఎండీఎం యాప్లో నమోదు చేసిన వివరాల ఆధారంగా ఎప్పటికప్పుడు బిల్లులు జమ చేయనుండగా, సదరు ఏజెన్సీలకు ఊరట కలుగనున్నది.
మంచిర్యాల (నమస్తే తెలంగాణ)/మంచిర్యాల అర్బన్, ఆగస్టు 14 : రాష్ట్ర సర్కారు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం పక్కాగా అమలు చేసేందుకు కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. పరిశుభ్రమైన వాతావరణంలో పౌష్టికాహారం అందించి, రోజూ వారి వివరాలను గోడలపై రాయించాలని హెచ్ఎంలకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో జిల్లాలోని 510 ప్రాథమిక, 96 ప్రాథమికోన్నత, 113 మోడల్, ఉన్నత పాఠశాలల్లోని 42 వేల మంది విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందుతుంది.
వారంలో మూడు రోజులు కోడిగుడ్లు
పౌష్టికాహారాన్ని అందించే లక్ష్యంతో ఇప్పటికే విటమిన్లు(పోషకాలు) కలిపిన బియ్యాన్ని పాఠశాలలకు సరఫరా చేస్తున్నది. అలాగే వారంలో మూడు రోజులు ఉడికించిన కోడిగుడ్లను విధిగా అందించేలా చర్యలు చేపట్టింది. ఇందుకోసం వంట ఏజెన్సీల నుంచి రాతపూర్వకంగా ఒప్పంద పత్రం తీసుకోవాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అంతేగాకుండా భోజనాన్ని ముందుగా హెచ్ఎం, లేదంటే ఉపాధ్యాయుడు రుచి చూసిన తర్వాతే పిల్లలకు వడ్డించాలని ఆదేశాలు జారీ చేసింది.
నిబంధనలు ఇలా..
నిర్వాహకులకు ఊరట
సింగిల్ నోడల్ ఏజెన్సీ అకౌంట్ విధానం ద్వారా నేరుగా ఏజెన్సీల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. ఈ విధానంతో ట్రెజరీతో సంబంధం లేకుండా నిర్వాహకుల బ్యాంకు ఖాతాల్లోనే బిల్లులు జమకానున్నాయి. ఇకపై నిర్వాహకులకు సకాలంలో వేతనాలు, వంట ఖర్చులు అందనున్నాయి. అంతేగాకుండా నిధుల విడుదల ఎవరి వద్ద పెండింగ్లో ఉందనే విషయాన్ని పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టం ద్వారా తెలుసుకోవచ్చు. దీంతో జిల్లాలోని మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీలకు ఊరట కలుగనున్నది.
ఎండీఎం యాప్లో వివరాలు నమోదు
మిడ్ డే మీల్స్ (ఎండీఎం) పథకం సక్రమంగా నడిచేందుకు యాప్లో వివరాలు నమోదు చేయాలి. హెచ్ఎం, ఉపాధ్యాయుడు ఈ ఎండీఎం యాప్ను మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని పాఠశాల పేరు, వివరాలు నమోదు చేసుకోవాలి. రోజూ ఉదయం 12 గంటల కంటే ముందే ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ విభాగాలవారీగా విద్యార్థుల వివరాలు సేకరించి యాప్లో అప్లోడ్ చేయాలి. నెట్వర్క్ సమస్యతో ఏ రోజైనా వివరాలు నమోదు చేయకుంటే ఎంఈవోకు సమాచారం ఇవ్వాలి. యాప్లో నమోదు చేసిన విద్యార్థుల సంఖ్య ఆధారంగానే విద్యాశాఖ బిల్లులు చెల్లిస్తుంది.
లోపాలు వెలుగు చూస్తే చర్యలు
విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సక్రమంగా పెట్టేందుకు మెనూ పక్కాగా అమలు చేయాల్సిందే. ఈ విషయంలో తాజా మార్గదర్శకాలను పాటించాలి. ఇందుకోసం బడుల్లో మధ్యాహ్న భోజన నిర్వహణపై ఆకస్మిక తనిఖీలు చేపడుతాం. ప్రతి రోజూ పాఠశాల హెచ్ఎం లేదా ఉపాధ్యాయుడు భోజనం తిని నాణ్యత పరిశీలించాలి. మెనూ అమలులో ఏమైనా లోపాలు బయటపడితే తగిన చర్యలు తీసుకుంటాం.
– వెంకటేశ్వర్లు, జిల్లా విద్యాశాఖాధికారి, మంచిర్యాల