ఆదిలాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి);స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శనివారం ఫ్రీడం ర్యాలీ నిర్వహించారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, యువతీయువకులు, విద్యార్థులు, క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వందలాది మంది జాతీయ జెండాలు పట్టుకొని ర్యాలీలో పాల్గొని ‘భారత్ మాతాకీ జై’ నినాదాలతో హోరెత్తించారు. ఆదిలాబాద్‌లో నిర్వహించిన ర్యాలీలో కలెక్టర్ సిక్తాపట్నాయక్, ఎస్పీ ఉదయ్‌కుమార్ రెడ్డి, బోథ్‌లో ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్, ఖానాపూర్‌లో ఎమ్మెల్యే రేఖానాయక్, నార్నూర్‌లో ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, ముథోల్‌లో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, నిర్మల్‌లో కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ పాల్గొన్నారు. ఆదిలాబాద్‌లో ఎమ్మెల్యే జోగు రామన్న ఆయన ఇంటిపై జెండా ఎగురవేశారు.
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో శనివారం స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. పల్లెలు, పట్టణాల్లో ప్రతి ఇంటిపై జాతీయ జెండాలు ఎగురవేశారు. పతాకాలు చేతబూని వేలాది మంది ఫ్రీడం ర్యాలీలో పాల్గొని దేశభక్తిని చాటారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న తన ఇంటిపై జెండాను ఎగురవేశారు. బోథ్‌లో నిర్వహించిన ఫ్రీడం ర్యాలీకి ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు హాజరయ్యారు. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ ఖానాపూర్‌లో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ నార్నూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు.
నిర్మల్‌లో ఐఎంఏ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీల్లో ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ శాఖల అధికారులు, ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు. గ్రామాల్లో అధికారులు, స్థానికులతో కలిసి భారీ ర్యాలీలు నిర్వహించారు. కొన్ని చోట్ల పురుషులు, మహిళలు వాలీబాల్ ఆడారు. చిన్నారులు భరతమాత వేషధారణలో ఆకట్టుకున్నారు. నాయకులు బెలూన్లు ఎగుర వేశారు. రిమ్స్, ట్రిపుల్ ఐటీ విద్యార్థులు వేడుకల్లో పాల్గొన్నారు.
– ఆదిలాబాద్, ఆగస్టు 13(నమస్తే తెలంగాణ ప్రతినిధి)