ఆదిలాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఆదిలాబాద్ జిల్లాలో వానకాలం ప్రబలే వ్యాధుల నివారణకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకున్నది. వైద్యశాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే జూలై 1 నుంచి ఫీవర్ సర్వే చేపట్టగా, ఈనెల 31 వరకు కొనసాగనున్నది. ఈ సీజన్లో ప్రభావిత ప్రాంతాలను గుర్తించి మలేరియా, టైఫాయిడ్, డెంగీ లాంటి వ్యాధుల కట్టడిలో సంబంధిత శాఖ అధికారులు నిమగ్నమయ్యారు. నిత్యం ఆయా గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. సీజనల్ వ్యాధులు, పరిసరాల పరిశుభ్రత, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు 665 గ్రామాల్లో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపుల్లో 27,336 మందికి అవసరమైన వైద్య సేవలందించారు.
వానకాలంలో సీజనల్ వ్యాధుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మలేరియా, టైఫాయిడ్, డెంగీ, డయేరియా లాంటి వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటారు. ఉమ్మడి రాష్ట్రంలో వివిధ రకాల వ్యాధులతో జిల్లాలో గ్రామాలకు గ్రామాలు మంచాలు పట్టేవి. ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్యసేవలు సరిగా అందక మరణాలు సంభవించేవి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం వైద్య రంగానికి పెద్దపీట వేసింది. ఆదిలాబాద్ జిల్లాలో వానకాలం, ఇతర సీజన్లలో వచ్చే వ్యాధులపై ప్రత్యేక దృష్టి పెట్టింది. సర్కారు దవాఖానల్లో వైద్యులు, సిబ్బంది నియామకం, వివిధ వ్యాధులకు అవసరమైన మందుల పంపిణీ, దవాఖానల నిర్మాణం, వ్యాధినిర్ధారణ యంత్రాలు, స్కానింగ్ యంత్రాలను సమకూర్చింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా జిల్లాలోని 22 పీహెచ్సీల్లో మారుమూల గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయి. గతంలో వానకాలం వచ్చిందంటే చాలు వివిధ వ్యాధులతో వణికిపోయే ప్రజలు ఇప్పుడు ప్రభుత్వం అందిస్తున్న వైద్యసేవలు పొందుతూ ఆరోగ్యంగా ఉంటున్నారు.
ఫీవర్ సర్వేతో ప్రాథమిక దశలోనే నివారణ
జిల్లాలో వానకాలం వ్యాధులు ప్రబలకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో వైద్యసిబ్బంది ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నారు. జూలై 1 నుంచి ప్రారంభమైన సర్వే రెండు నెలల పాటు ఆగస్టు 31 వరకు కొనసాగుతుంది. ఏఎన్ఎంలు, సూపర్వైజర్లు, ఆశ కార్యకర్తలు గ్రామాల్లో ఇంటింటా తిరుగుతారు. కుటుంబంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారి వివరాలను అడిగి తెలుసుకొని, వారికి వైద్యం, రక్త పరీక్షలు నిర్వహించనున్నారు. వ్యాధుల తీవ్రతను బట్టి వారిని రిమ్స్, ఉట్నూర్ దవాఖానలకు తరలిస్తారు. ఫీవర్ సర్వే కారణంగా ప్రజలకు ప్రాథమిక దశలోనే చికిత్సలు అందుతున్నాయి. దీంతో గ్రామాల్లో వ్యాధుల తీవ్రతను అరికట్టనట్లవుతుంది.
గ్రామాల్లో వైద్యశిబిరాలు
జిల్లాలో గత నెలలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో ప్రజలు వివిధ రకాల వ్యాధులతో ఇబ్బందులు పడకుండా వైద్యశాఖ అధికారులు వైద్యశిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. జూలై 13 నుంచి రోజూ ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక గ్రామంలో వైద్యశిబిరం నిర్వహిస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 665 గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి 27,336 మందికి వైద్య సేవలు అందించారు. మూడేళ్లలో మలేరియా, డెంగీ, టైఫాయిడ్ లాంటి వ్యాధులు వచ్చిన గ్రామాలను హై రిస్క్ ప్రాంతాలుగా గుర్తించి అక్కడ నివారణ చర్యలు చేపట్టారు. పంచాయతీ సిబ్బందితో కలసి యాంటీ లార్వా యాక్టివిటీ చేపడుతున్నారు. ఇండ్ల పరిసరాల్లో నీటి నిల్వలు ఉండకుండా వారంలో రెండు రోజుల పాటు డ్రై డే నిర్వహిస్తున్నారు. ప్రజలకు వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు.
ముందు జాగ్రత్తలతోనే వ్యాధుల నివారణ
ఈ సీజన్లో ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వ్యాధుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. జిల్లాలో మలేరియా, డెంగీ, టైఫాయిడ్, డయేరియా, ఇతర వ్యాధుల నివారణ కోసం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాం. ఫీవర్ సర్వేలో భాగంగా అవసరమైన వైద్యం అందిస్తున్నాం. ప్రజలు వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. దోమలు వృద్ధి చెందకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. నీటి నిల్వలు లేకుండా చూడాలి. వేడి చేసి చల్లార్చిన నీటిని తాగాలి. బయటి ఆహారం తీసుకోవద్దు. ఇంట్లో వేడి, వేడి భోజనం తీసుకోవాలి. గ్రామాల్లో వైద్యసిబ్బంది సూచనలు పాటించాలి.
– నరేందర్ రాథోడ్, డీఎంహెచ్వో, ఆదిలాబాద్