నిర్మల్(నమస్తే తెలంగాణ)/ఎదులాపురం, ఆగస్టు 6 ;కాబోయే అమ్మకు ఆపద. మాతృమూర్తిగా మారే తరుణంలో అనుకోని అవస్థలు. పురుష పుంగవుల్లో నెలకొన్న అపోహే అమ్మకు ముప్పు తెస్తున్నది. కట్టుకున్న భర్త ‘ఆమె’ భారాన్ని పంచుకోవడం లేదు. అన్నింట్లో ఎంతో ప్రేమను పంచే శ్రీవారు ఆ.. ఆ‘పరేష(షా)న్’ అంటేనే అల్లంత దూరంలో ఉంటున్నాడు. గర్భస్తం నుంచి బిడ్డ ప్రసవం వరకు వేదనను అనుభవిస్తున్న ‘అమ్మ’ శస్త్రచికిత్స సమయంలో మరోమారు కడుపు కోతకు గురవుతోంది. కాన్పు సమయంలోనూ పడని వేదనను శస్త్రచికిత్స సమయంలో భరిస్తున్నది. సృష్టికే ఆధారమైన ఆమెకు సమాజంలో లభిస్తున్న గౌరవం ఇంట్లో శ్రీవారి వద్ద లభించకపోవడం ఆవేదనకు గురిచేస్తున్నది. వ్యాసెక్టమీ ఆపరేషన్లతో ఎటువంటి నష్టం ఉండదని వైద్యశాఖ స్పష్టం చేస్తున్నా… పురుష పుంగవుల్లో మార్పురావడం లేదు.
అధునాతన పద్ధతులున్నా..
ప్రస్తుతం కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయడానికి అధునాతన పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. కోత, రక్తస్రావం, కుట్లు లేకుండా శస్త్ర చికిత్సలు చేస్తున్నారు. నో స్కాల్పల్ వ్యాసెక్టమీ(ఎన్ఎస్వీ) పద్ధతి ద్వారా చేస్తారు. శస్త్రచికిత్స చేసిన 20 నిమిషాల్లోనే నడిచి ఇంటికి వెళ్లొచ్చు. తర్వాత రోజు నుంచి తమ పనులు యథావిధిగా చేసుకునే అవకాశం ఉంది. దీనివల్ల ఇబ్బందులు తలెత్తే చాన్స్ లేదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మహిళలకు చేసే కుటుంబ నియంత్రణ ఆపరేషన్(ట్యూబెక్టమీ)లో ప్రస్తుతం డబుల్ పంక్చర్ లైప్రోస్కొపీ(డీపీఎల్) అధునాతన పద్ధతిని పాటిస్తున్నారు. దీని ద్వారా కూడా కోత, రక్తస్రావం లేకుండా చేస్తారు.
కొద్దిపాటి విశ్రాంతితో యథావిధిగా పనులు చేసుకునే వీలుంది. అయితే శారీరక శ్రమ అధికంగా ఉండే మహిళలకు బదులుగా పురుషులు ముందుకొచ్చి వ్యాసెక్టమీ శస్త్ర చికిత్సలు చేయించుకుంటే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వైద్యులు వ్యక్తం చేస్తున్నారు. కాగా.. కు.ని. శస్త్ర చికిత్సలకు మహిళలే ముందుంటున్నా.. వారికి అందుతున్న ప్రోత్సాహాన్ని పురుషులతో పోలిస్తే తక్కువగానే ఉంది. ఒక్కో ట్యూబెక్టమీకి రూ.880 ఇస్తుంటే.. అదే వేసెక్టమీకి రూ.1,100 వరకు ప్రభుత్వం చెల్లిస్తున్నది. ట్యూబెక్టమీ కంటే వ్యాసెక్టమీకి అధిక నగదు ప్రోత్సాహం సర్కారు అందిస్తున్న పురుషుల నుంచి స్పందన లేదు. ఫలితంగా వైద్యశాఖ అనుకున్న లక్ష్యాలు చేరుకోలేక పోతున్నది.
ఎందుకిలా జరుగుతోంది..
కుటుంబ నియంత్రణ(కు.ని.) అంటే మహిళలకు సంబంధించిన అంశంగా సమాజంలో నాటుకు పోయింది. అపోహలు, అనుమానాలు పురుషులను శస్త్రచికిత్సలకు దూరంగా ఉంచుతు న్నాయని వైద్యులు చెబుతున్నారు. ఉన్నత చదువులు చదివిన వారు కూడా ఇదే పద్ధతిలో వ్యవహరిస్తున్నారు. వైద్యశాఖ పరంగా అవగా హన, చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ.. అనాదిగా ఉన్న అపోహలు తొలగడం లేదు. కు.ని. చేయించుకుంటే మునుపటిలా సంసార జీవితంలో పాలు పంచుకోరనే అపోహ పాతుకుపోయింది. అలాగే.. శారీరక శ్రమ సామర్థ్యం కూడా తగ్గుతుందనే భావన ఉంది. అయితే ఈ రెండింటిలో ఎంత మాత్రం వాస్తవం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
వ్యాసెక్టమీ సులువైన ఆపరేషన్
వ్యాసెక్టమీ ఆపరేషన్ చాలా సులు వైనది. నో స్కాల్పల్ వ్యాసెక్టమీ (ఎన్ఎస్వీ) ఆపరేషన్లో కోత, కుట్లు అనేవి ఉండవు. అయినా పురుషుల నుంచి స్పందన ఉండడం లేదు. దీనిపై ప్రజల్లో సరైన అవగాహన లేకపోపవడమే ప్రధాన కారణం. దీనిపై విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పూర్తిస్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నాం.
– డాక్టర్ ధన్రాజ్, డీఎంహెచ్వో, నిర్మల్.
కేవలం అపోహలే..
సెక్స్ సామర్థ్యం తగ్గుతుందన్న భావన పురుషుల్లో ప్రధానంగా నెలకొనడం వల్లనే వ్యాసెక్టమీ ఆపరేషన్లు చేసుకునేందుకు పురుషులు ముందుకు రావడంలేదు. ఇది కేవలం అపోహ మాత్రమే. ఆపరేషన్ చేయించుకుంటే స్త్రీలకు అవసరమైన విశ్రాంతి కూడా పురుషులకు అవసరం లేదు. వైద్యశాఖ ఆధ్వర్యంలో వ్యాసెక్టమీ ఆపరేషన్లపై అవగాహన కల్పిస్తూనే ఉన్నాం. ఇప్పటికైనా పురుషుల్లో మార్పు రావాల్సిన అవసరం ఉంది.
–డాక్టర్ రజని, ఇన్చార్జి సూపరింటెండెంట్, ప్రసూతి దవాఖాన, నిర్మల్