మంచిర్యాల(నమస్తే తెలంగాణ)/గర్మిళ్ల, ఆగస్టు 6 : ఎస్సై ప్రిలిమినరీ రాత పరీక్షకు పోలీసు శాఖ, అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. మంచిర్యాల ఇన్చార్జి డీసీపీ, పరీక్ష నోడల్ ఆఫీసర్ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో చీఫ్ సూపరింటెండెంట్లకు, అబ్జర్వర్లకు, ఇన్విజిలేటర్లకు శిక్షణ ఇచ్చారు. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష ఉండనున్నది. విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్‌కు గంట ముందుగానే చేరుకోవాలి. హాల్ టికెట్ల లో అక్షర దోషాలుంటే సెంటర్‌కు వచ్చిన తర్వా త ఇబ్బంది పడకుండా ఆధార్ కార్డు లేదా ఏదైనా ఓటరు ఐడీ వెంట తెచ్చుకోవాలి. వీటి ఆధారంగా లోపలికి అనుమతించనున్నారు. బయోమెట్రిక్ అటెండెన్స్ తప్పనిసరి కావున చేతులకు మెహిందీ, టాటూలు పెట్టుకోవద్దు. ఓఆర్ఆర్ షీట్‌పై వైట్నర్ ఉపయోగించరాదు.
విధుల నిర్వహణ ఇలా..
మంచిర్యాల జిల్లాలో 17 కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 5,727 మంది పరీక్ష రాయనున్నారు. పర్యవేక్షణ కోసం 17 మంది చీఫ్ సూపరింటెండెంట్లు(సీఎస్), 17 మంది అబ్జర్వర్లు, 238 మంది ఇన్విజిలేటర్లు పర్యవేక్షించనున్నారు. ఆసిఫాబాద్‌లో 3, కాగజ్‌నగర్‌లో 3 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆరుగురు సీఎస్‌లు, ఆరుగురు అబ్జర్వర్లు, ఇద్దరు రూట్ ఆఫీసర్లు, 12 మంది బయోమెట్రిక్ ఇన్విజిలేటర్లు, 63 మంది ఇన్విజిలేటర్లు, బయోమెట్రిక్ సూపర్వైజర్ విధులు నిర్వహించనున్నట్లు రీజినల్ కో ఆర్డినేటర్ శ్రీధర్ సుమన్ తెలిపారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల పరిధిలో 5,926 మంది పరీక్ష రాయనుండగా.. ఇందులో నిర్మల్ జిల్లా నుంచి 2,372, ఆదిలాబాద్ నుంచి 3,554 మంది ఉన్నారు. నిర్మల్‌లో 6, ఆదిలాబాద్‌లో 8 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.
నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు..
పరీక్షా కేంద్రానికి నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు. అభ్యర్థులు లోపలికి వచ్చిన తరువాత బయోమెట్రిక్ తీసుకుంటాం. అందుకు ఒక్కో కేంద్రానికి ఇద్దరి చొప్పున టెక్నికల్ పర్సన్లను నియమించాం. అలాగే ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ వస్తువులు, పర్సు, చేతి గడియారం కూడా అనుమతి ఉండదు. అభ్యర్థులు హాల్ టికెట్‌పై పాస్‌పోర్టు సైజు ఫొటోను తప్పకుండా అంటించుకొని రావాలి. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పరీక్షకు హాజరు కావాలి.
– అఖిల్ మహాజన్, అడిషనల్ డీసీపీ,
మంచిర్యాల