మంచిర్యాల అర్బన్, ఆగస్టు 5 : విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు, కొత్త ప్రయోగాలు, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఇన్స్పైర్ మనక్ కార్యక్రమాన్ని 2009-10 విద్యా సంవత్సరం నుంచి నిర్వహిస్తున్నది. జిల్లాలోని అన్ని యాజమాన్యాల పరిధిలోని ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఆరు నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులు 2022-23 ఇన్స్పైర్ మనక్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. సెప్టెంబర్ 30వ తేదీ వరకు అవకాశం కల్పించింది. ఇందుకోసం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఎంఈవోలకు, కాంప్లెక్స్ హెచ్ఎంలకు, హెచ్ఎంలకు, ఉపాధ్యాయులకు ఇన్స్పైర్ నామినేషన్లు పంపే విధానంతో పాటు ఎలాంటి ప్రాజెక్టులు ఎంచుకోవాలన్నదానిపై అవగాహన కల్పించారు.
ప్రతి పాఠశాల నుంచి ఐదు నామినేషన్లు..
జిల్లాలోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల నుంచి నామినేషన్లు తీసుకుంటుంది. ఒక్కో పాఠశాల నుంచి ఐదు నామినేషన్లు మాత్రమే పంపేందుకు అవకాశం ఉంటుంది. ప్రయోగానికి సంబంధించిన చిత్రా లు, వివరాలు, వీడియోలు, పాఠశాల యూ డైస్ నంబరు, ఈ మె యిల్, విద్యార్థి ఆధార్ నంబర్, బ్యాంకు ఖాతా, గైడ్ ఉపాధ్యాయుడు, హెచ్ఎం మొబైల్ నంబర్లు తదితర వివరాలను సెప్టెంబర్ 15వ తేదీలోగా వెబ్సైట్ (www.inspireawards-dst.gov.in) ద్వారా స్కూల్ అథారిటీ లాగిన్‌లో ఐదు ప్రాజెక్టులు నమోదు చేసుకోవాలి.
ఇన్స్పైర్ మనక్‌కు ఎంపికైతే ప్రోత్సాహకం..
విద్యార్థులు పంపిన ప్రాజెక్టులను డిపార్టుమెంట్ ఆఫ్ సైన్స్, టెక్నాలజీకి చెందిన కేంద్రమంత్రిత్వ శాఖ ప్రతినిధులు పరిశీలిస్తారు. ఎంపికైన విద్యార్థులకు రూ. 10 వేలు ప్రోత్సాహకంగా అందజేస్తారు. జాతీయ స్థాయికి ఎంపికైతే రూ. 25 వేలు, జాతీ య స్థాయిలో ఉత్తమ ప్రాజెక్టుగా ఎంపికైతే రూ. 40 వేల నుంచి రూ. 60 వేల నగదు పారితోషికాన్ని అందజేస్తారు. ఉత్తమంగా ఎంపికైన పరిశోధనపై మేథో సంపత్తి హక్కులు సైతం కల్పిస్తారు. విజేతలకు రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం అందజేస్తారు. ప్రతిభావంతులకు ఐఐటీ ప్రవేశాలలో రిజర్వేషన్ వర్తింపజేస్తారు.
కరోనా ఎఫెక్ట్‌తో రెండేండ్ల తర్వాత..
కరోనా కారణంగా జూమ్ పద్ధతిలో నిర్వహించారు. ఈ ఏడాది ప్రత్యక్ష విధానంలో చేపట్టేందుకు నామినేషన్లు స్వీకరిస్తున్నారు. గతేడాది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 711 పాఠశాలల నుంచి 2,814 ప్రదర్శనలు ఆన్లైన్లో నమోదు చేయగా, ఇందులో జిల్లా స్థాయిలో 450 ఉత్తమ ప్రదర్శనలుగా ఎంపికయ్యాయి. మంచిర్యాల జిల్లాలో 218 పాఠశాలల నుంచి 798 ప్రదర్శనలు రాగా, 105 జిల్లా స్థాయికి ఎంపికయ్యాయి. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 102 పాఠశాలల నుంచి 422 ప్రదర్శనలకుగాను 45, నిర్మల్ జిల్లాలో 222 పాఠశాలల నుంచి 978 ప్రదర్శనలలో 186, ఆదిలాబాద్ జిల్లాలో 169 పాఠశాలల నుం చి 616 ప్రదర్శనలకుగాను 114 ఉత్తమ ప్రదర్శనలుగా ఎంపికయ్యా యి. ఈ ప్రదర్శనలు సైతం సెప్టెంబర్, అక్టోబర్‌లో జరుగనున్నాయి.
నామినేషన్లు పెంచేందుకు కమిటీలు..
మంచిర్యాల జిల్లాలో నామినేషన్ల సంఖ్య పెంచేందుకు ప్రత్యేకంగా కాంప్లెక్స్‌ల వారీగా 60 కమిటీలు వేశారు. కమిటీలో హెచ్ ఎం, ఉపాధ్యాయుడు, క్లస్టర్ రిసోర్స్ పర్సన్ ఉంటారు. కమిటీ సభ్యులు ఐదు నుంచి పది పాఠశాలల ద్వారా తప్పకుండా నామినేషన్లు పంపేలా సహకరిస్తారు. అంతేగాకుండా ఎమ్మార్సీలలోని ఎంఐఎస్ సీసీవోలు నమోదు చేయడంలో భాగస్వాములవుతున్నారు. అలాగే జిల్లా సైన్స్ అధికారి మధుబాబు ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యులతో టెక్నికల్ టీం ఏర్పాటు చేశారు. వీరు లాగిన్ సమస్యల పరిష్కారం, ఆన్లైన్ చేయడంలో సహకరిస్తారు.
జాతీయ స్థాయి వేదికపై జిల్లా ప్రాజెక్టు…
గతేడాది నిర్వహించిన ఎన్ఎల్ఈపీసీలో మల్కేపల్లి ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు వేములవాడ రమేశ్ సహకారంతో జుమిడి అంజన్న ప్రదర్శించిన ఫీడింగ్ ఛాంబర్ ప్రాజెక్టు జాతీయ స్థాయిలో నాలుగో స్థానంలో నిలిచింది. దేశ వ్యాప్తంగా నాలుగు లక్షల ప్రాజెక్టులు నమోదు చేసుకోగా, 43 వేల ప్రాజెక్టులకు జిల్లా స్థాయిలో పోటీపడే అవకాశం లభించింది. దశల వారి పోటీల తర్వాత జాతీయ స్థాయిలో వెయ్యికిపైగా ప్రాజెక్టులకు టాప్ 60 పోటీకి ప్రత్యేక పోటీ నిర్వహించగా, జిల్లా ప్రాజెక్టు జాతీయ స్థాయిలో నాలుగో స్థానంలో నిలిచింది. బెంగళూరులోని ఎన్ఐఏఎస్, ఐఐఎస్ క్యాంపస్‌లో నిర్వహించిన అవార్డుల కార్యక్రమంలో ఎన్ఐఎఫ్ డైరెక్టర్ విపిన్‌కుమార్, ఇస్రో చీఫ్ పీఎస్ గోయల్ చేతుల మీదుగా అంజన్న బహుమతి అందుకున్నాడు.
శ్రీస్ రుతుమిత్ర కిట్‌తో..
జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాలకు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థిని సాయి శ్రీవల్లి ‘శ్రీస్ రుతుమిత్ర కిట్’తో ఇన్స్పైర్-2021 జాతీయ స్థాయి పోటీలకు తెలంగాణ రాష్ట్రం తరపున జిల్లా నుంచి ఎంపికైంది. మహిళలు, విద్యార్థినులు నెలవారీ రుతుక్రమ ప్రక్రియలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఈ నేపథ్యంలో రుతుక్రమ ప్రక్రియ సులభం చేసి వారి ఇబ్బందులు తగ్గించేలా, సులభంగా వాడేలా, అసలు ఖర్చు లేకుండా ఉపయోగించేలా శ్రీవల్లి ‘శ్రీస్ రుతుక్రమ కిట్ తయారు చేసింది. రుతుక్రమ సమయంలో అన్ని పనులు యథావిధిగా నిర్వహించుకునేలా దీనిని రూపొందించింది. ఈ కిట్ ఈజీగా వాష్, ఈజీగా డ్రై, ఈజీగా క్యారీ చేసేలా ఉంది. త్వరలో ఈ ప్రదర్శన జాతీయ స్థాయిలో నిలవాలని కోరుకుందాం.
వాట్సాప్ గ్రూపుల ద్వారా..
జిల్లాలో అందరి సహకారంతో 100 శాతం నామినేషన్లు వచ్చేలా చూస్తున్నాం. పాఠశాలల్లోని సైన్స్, గణిత వాట్సాప్ గ్రూ పులు ఏర్పాటు చేసి వాటి ద్వారా సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేస్తున్నాం. ప్రాజెక్టులు నైపుణ్యాలను కలిగి ఉండేలా ప్రోత్సహిస్తున్నాం. ప్రతి పాఠశాల నుంచి ఐదు నామినేషన్లు వచ్చేలా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం.
– సాయిలు మధుబాబు, సైన్స్ అధికారి, మంచిర్యాల
అవకాశాన్ని ఉపయోగించుకోవాలి..
జిల్లాలోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనేందుకు ఆయా పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు చొరవ చూపాలి. ప్రాజెక్టుల తయారీ, నామినేషన్లు పంపడంలో ఎలాంటి సందేహాలున్నా జిల్లా సైన్స్ అధికారి మధుబాబు(98495 50200)ను సంప్రదించవచ్చు. గడువు లోగా నామినేషన్లు చేసుకోవాలి.
– ఎస్ వెంకటేశ్వర్లు, డీఈవో, మంచిర్యాల