నిర్మల్ అర్బన్, ఆగస్టు 5 : నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఆగస్టు 7న నిర్వహించనున్న ఎస్ఐ పోస్టుల భర్తీ ప్రిలిమినరీ పరీక్షకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. నిర్మల్ జిల్లా నుంచి 2,372, ఆదిలాబాద్ జిల్లా నుంచి 3,554 మంది దరఖాస్తు చేశారు. నిర్మల్ జిల్లాలో 6, ఆదిలాబాద్ జిల్లాలో 8 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, పరిశీలకులు, బమోమెట్రిక్ ఇన్విజిలేటర్లకు ఇప్పటికే అవగాహన కల్పించారు.
5,926 మంది అభ్యర్థులు..
నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల పరిధిలో మొత్తం 5,926 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. నిర్మల్ జిల్లాలో ప్రభుత్వ బాలికల, బాలుర జూనియర్ కళాశాలలు, శాంతినగర్, రవి ఉన్నత పాఠశాల, వశిష్ట డిగ్రీ కళాశాల, చాణక్య డిగ్రీ కళాశాల, దీక్ష జూనియర్ కళాశాలలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించనున్నారు. ఆయా కేంద్రాల్లో తాగునీరు, బెంచీలు ఏర్పాటు చేశారు.
నిమిషం నిబంధన అమలు..
ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు గంట ముందుగానే చేరుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థుల గుర్తింపునకు బయోమెట్రిక్ పద్ధతిలో వేలిముద్రలు నమోదు చేయనున్నారు. చేతి వేళ్లకు గోరింటాకు, మెహందీ వంటివి పెట్టుకుంటే వేలి ముద్రలు సరిగ్గా పడక అభ్యర్థులు నష్టపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో అలాంటివి ఏమీ లేకుండా చూసుకోవాలని అధికారులు చెప్తున్నారు. పరీక్ష కేంద్రాల్లోకి సెల్ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, క్యాలిక్యులేటర్లు, తదితర ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదని స్పష్టం చేశారు.
పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు…
పరీక్ష ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని ఏర్పాట్లు చేశాం. నిర్ణీత సమయానికి గంట ముందుగానే అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. అభ్యర్థులు హాల్‌టికెట్‌తో పాటు ఫొటోను వెంట తీసుకురావాలి. కష్టాన్ని నమ్ముకుని పరీక్షకు హాజరుకావాలి తప్ప.. ఉద్యోగాలు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పే మోసగాళ్ల వలలో చిక్కుకోవద్దు. అలాంటి వారిపై పోలీసులకు సమాచారం అందించి సహకరించాలి.
– ప్రవీణ్ కుమార్, ఎస్పీ, నిర్మల్ జిల్లా