బాసర, జూలై 31 : విద్యార్థుల సమస్యలన్నింటనీ పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని ఇన్చార్జి వైస్ ఛాన్స్లర్ వెంకటరమణ స్పష్టం చేశారు. ట్రిపుల్ఐటీలోని కాన్ఫరెన్స్ హాల్లో డైరెక్టర్ సతీశ్‌కుమార్‌తో కలిసి ఆదివారం విలేకరులతో ఆయన మాట్లాడారు. విద్యార్థుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని, ఇందులో భాగంగా ఈ అకడమిక్ క్యాలెండర్‌ను తయారు చేశామని తెలిపారు. ఇంజినీరింగ్‌లో పలు సంస్కరణలను తీసుకురావడానికి పలు విద్యాసంస్థల్లోని ప్రొఫెసర్లతో కమిటీ ఏర్పాటు చేశామని, జాతీయ, రాష్ట్ర స్థాయి విద్యాసంస్థలకు చెందిన ఎక్స్‌పర్ట్స్‌ను నియమించనున్నట్లు తెలిపారు. అలాగే తరగతి గదుల్లో ప్రొజెక్టర్స్ సహా మౌలిక వసతులు కల్పిస్తున్నామని, హాస్టల్ తరగతి గదుల్లో వైఫై సామర్థ్యాన్ని 350ఎంబీపీఎస్ నుంచి 1జీబీకి పెంచనున్నట్లు వెల్లడించారు. ప్రతిష్టాత్మక జాతీయ, అంతర్జాతీయ పరిశ్రమలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకొని, ఇంటర్షిప్తో పాటు పలు ఉపాధి అవకాశాలను కల్పించనున్నామన్నారు.
24 గంటల పాటు లైబ్రరీ సదుపాయం, హాస్టల్లో రీడింగ్ రూముల ఏర్పాటు, పోటీ పరీక్షలకు అవసరమయ్యే పుస్తకాలు, పీవీసీ విద్యార్థులకు రెండు కంప్యూటర్ ల్యాబ్‌లు, ఇంజినీరింగ్ విద్యార్థులకు ల్యాప్‌టాప్స్‌ను సమకూర్చడం కోసం నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ట్రిపుల్ఐటీలోని అన్ని విభాగాల పనితీరు మెరుగు పరుచుకోవడానికి కమిటీలను ఏర్పాటు చేశామని చెప్తూ.. పెండింగ్ బిల్లులను త్వరలోనే మంజూరు చేసేందుకు కృషి చేయనున్నట్లు చెప్పారు. లిఫ్ట్‌లను మరమ్మతు చేసి, వాటర్ ప్లాంట్లలో ఫిల్టర్లను ఏర్పాటు చేశామని, డ్రైనేజీ వ్యవస్థను మార్చేందుకు చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు సంక్షేమ కోసం హాస్టళ్లలో మౌలిక వసతులు, ఆరోగ్య శిబిరాలు నిర్వహించి హెల్త్ రిపోర్ట్ తయారు చేయిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల సమస్యలను తెలుసుకోవడానికి ప్రతి నెలా అన్ని విభాగాల సీఆర్లతో సమావేశం ఏర్పాటు చేస్తామని, విద్యార్థులు తమ సమస్యలను తెలుపడానికి ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో సాయంత్రం 3 నుంచి 5 గంటల వరకు డైరెక్టర్ సతీశ్‌కుమార్ అందుబాటులో ఉంటారని చెప్పారు.
దివ్యాంగుల కోసం మెరుగైన సదుపాయం కల్పించడానికి కమిటీని ఏర్పాటు చేశామని, ఇప్పటికే మెస్‌లో రోజూ ఇద్దరు ఫ్యాకల్టీ భోజనం చేసి వారి అభిప్రాయాన్ని తీసుకుంటున్నట్లు తెలిపారు. క్రీడా వసతులు మెరుగు పరచడానికి నిపుణులతో కమిటీలను ఏర్పాటు చేసి ఏటా క్రీడా పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. టెక్‌ఫెస్ట్ ఈ సంవత్సరం కూడా నిర్వహిస్తామని, విద్యార్థుల్లో నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసున్నామన్నారు.
టెండర్ల ఆహ్వానం..
ట్రిపుల్‌ఐటీలో 6 పీడీ పోస్టులను భర్తీ చేశామని, ఫైనాన్స్ ఆఫీసర్‌గా అడిట్ డిపార్ట్మెంట్లో పని చేస్తున్న నిజామాబాద్‌కు చెందిన అనిల్‌రెడ్డిని నియమించినట్లు తెలిపారు. విద్యార్థుల యూనిఫాం, షూ, మెస్‌ల నిర్వహణకు టెండర్లను ఆహ్వానించామని వెల్లడించారు. బ్రాడ్‌బాండ్, వైఫై వ్యవస్థను మెరుగు పరిచేందుకు రూ.25లక్షలు వెచ్చించనున్నట్లు తెలిపారు. రూ.30లక్షలతో విద్యార్థులకు అవసరమయ్యే పుస్తకాలు కొనుగోలు చేయనున్నామన్నారు. 3వేల ల్యాప్‌టాప్‌ల కోసం దాదాపు రూ.10కోట్లకు పైగా అవసరం ఉంటుందని, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని వీసీ తెలిపారు. మెస్ బిల్లులు, హౌస్ కీపింగ్ సెక్యూరిటీ, ఫ్యాకల్టీ వేతనాలకు రూ.4 నుంచి 5 కోట్ల మేర ఖర్చవుతుందని, ఇప్పటికే హాస్టల్లో ఫ్యాన్లు, ట్యూబ్లైట్లను ఏర్పాటు చేశామని తెలిపారు. విద్యార్థులకు హెల్త్‌ప్రొఫైల్‌ను కూడా క్రియేట్ చేస్తున్నామని, కొందరు విద్యార్థుల్లో చూపు సమస్య ఉండడంతో ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి నుంచి కళ్లద్దాలు తెప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వీసీ వెల్లడించారు.
నిబంధనలకు విరుద్ధంగా వెళ్లొద్దు..
కొందరు విద్యార్థులు యూనివర్సిటీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, తోటి విద్యార్థులను మెస్‌లోకి వెళ్లకుండా, తినకుండా అడ్డుకుంటున్నట్లు సమాచారం ఉన్నదని చెప్తూ.. అలాంటి చర్యలను సహించేది లేదని వీసీ స్పష్టం చేశారు. షోకాజ్ నోటీసులిచ్చి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పలు కమిటీలు…
రోజూ లేడీ డాక్టర్ అందుబాటులో ఉండడంతో పాటు మెస్ వార్డెన్లను, కమిటీలను ఏర్పాటు చేసి విద్యార్థులు ఏఏ మెస్సుల్లో భోజనం చేస్తున్నారో అటెండెన్స్ నిర్వహించేందుకు ఫేస్ రికగ్నైజేషన్ వ్యవస్థను త్వరలోనే ఏర్పాటు చేయనున్నామని వీసీ వెల్లడించారు.
మెనూ మారడం వల్ల ఫుడ్ పాయిజన్…
మెనూలో ఉన్నది కాకుండా విద్యార్థుల కోరిక మేరకు ఎగ్‌ఫ్రైడ్ రైస్ పెట్టడం వల్ల ఫుడ్ పాయిజన్ జరిగిందని డైరెక్టర్ సతీశ్‌కుమార్ తెలిపారు. గుడ్ల ప్రభావం వలనే ఫుడ్ పాయిజన్ జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఇకపై మెనూ యథాతథంగా అమలు చేయాలని మెస్ యజమానులకు స్పష్టం చేసినట్లు వెల్లడించారు. ఎప్పటికప్పుడు మెస్‌లను పరిశీలించి, ఇన్చార్జీ వీసీతో పాటు తాను కూడా అదే భోజనం తింటున్నామన్నారు. విలేకరుల సమావేశంలో డీన్లు దేవరాజ్, సృజన, పలు విభాగాల హెచ్వోడీలు పాల్గొన్నారు.
బీమాపై స్పష్టత..
2016 సంవత్సరం నుంచి యునైటెడ్ కంపెనీలో విద్యార్థుల పేరిట బీమా కొనసాగుతున్నదని, 2019-20, 2020-21లో 1500 మంది విద్యార్థులు యూనివర్సిటీకి రూ.700 చెల్లించినట్లు వీసీ తెలిపారు. కరోనా సమయంలో బీమా కంపెనీలు ముందుకు రాకపోవడంతో ప్రీమియం చెల్లించలేదని గుర్తు చేస్తూ.. తాజాగా ఇద్దరు ప్రొఫెసర్లు కృష్ణయ్య, జీఎన్ శ్రీనివాస్‌తో కమిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. ఇప్పటికే నాలుగు కంపెనీలు ముందుకు వచ్చాయని, నివేదికల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ నెల 2 నుంచి ప్రాంగణ నియామకాలను నిర్వహించేందుకు విద్యార్థులతో పలు సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. టీహబ్, వీహబ్‌తో మాట్లాడి ఇప్పటికే పలు ఒప్పందాలను కుదుర్చుకున్నట్లు తెలిపారు. బాసర ట్రిపుల్‌ఐటీలో గల ఆరోగ్య కేంద్రాన్ని భైంసా ఏరియా ఆస్పత్రికి అటాచ్ చేయడం జరిగిందన్నారు.