పెంబి, జూలై 31 : ప్రస్తుత కాలంలో మద్యం, మాంసం దొరకని ఊరు లేదు. వీటి కోసం ఎంతదూరమైనా వెళ్లి తెచ్చుకునే వారున్నారు. ఇందుకు భిన్నంగా నిర్మల్ జిల్లాలో ఓ గ్రామం ఉంది. ఆ గ్రామంలో మద్యం, మాంసం వాసన అంటేనే తెలియదు. చిన్న గ్రామమైనా అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నది. నిర్మల్ జిల్లా పెంబి మండలం జంగన్గూడ పంచాయతీ పరిధిలోని కొలాంగూడలో దాదాపు 150 మంది జనాభా ఉంటారు. అన్ని ఆదివాసీ కుటుంబాలే నివసిస్తాయి. వీరి జీవనాధారం ఇప్పపువ్వు, తునికాకు సేకరించడం, పోడు భూముల్లో వ్యవసాయం చేయడం. వీరందరూ కూడా ఆదివాసీల ఆరాధ్య దైవమైన పూలాజీబాబా చూపిన మార్గంలో నడుస్తున్నారు. తన ప్రవచనాలకు ఆకర్షితులై ఐదేండ్ల నుంచి మాంసం, మద్యం మానేసి ఆరోగ్యంగా, ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. పూలాజీబాబా యేటా ఈ గ్రామానికి వచ్చి ఆధ్యాత్మిక బోధనలు చేసేవారని గ్రామస్తులు తెలిపారు. ఆయన పరమపదించిన తర్వాత కొన్ని నెలల క్రితమే గ్రామస్తులందరూ కలిసి ఆయన ఆలయాన్ని నిర్మించారు. ఇప్పుడు ఆ గ్రామంలో ఏ కార్యక్రమం జరిగినా మాంసం వండడం, తినడం, మద్యం తాగడం ఉండదు. భౌతికంగా ఆయన దూరమైనా ఆయన ప్రబోధనలు పాటిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఉదయం పూలాజీబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేయడం, సాయంత్రం భజనలు చేస్తూ భక్తిపారవశ్యంలో మునిగి తేలుతున్నారు. పక్క గ్రామాల్లోని కొందరు వీరిని ఆదర్శంగా తీసుకొని వారు కూడా మాంసం, మద్యం తీసుకోవడం మానేస్తున్నారు.
ప్రవచనాలు మమ్మల్ని ఆకర్షించాయి..
పూలాజీబాబా ప్రవచనాలు మమ్మల్ని ఆకర్షితులను చేశాయి. భక్తి మార్గంతోనే మానసిక ప్రశాంతత లభిస్తుం దని భావిస్తున్నాం. మాంసం, మద్యం మానేసి ప్రశాంత జీవనం గడుపుతున్నాం. బాబా చూపిన మార్గంలోనే నడుస్తున్నాం.
– టేకం రమేశ్, కొలాంగూడ.