ఆదిలాబాద్, జూలై 29(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పేద, మధ్య తరగతి ప్రజలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సర్కారు దవాఖానలు వరంలా మారాయి. రాష్ట్ర సర్కారు ప్రత్యేక చొరవతో కార్పొరేట్‌కు దీటుగా ఆధునిక వైద్య సేవలందిస్తున్నాయి. రూపాయి ఖర్చు లేకుండా ప్రజలకు ఉత్తమ చికిత్సలందుతుండగా, వైద్యుల కృషితో ఎన్నో ప్రాణాలు నిలుస్తున్నాయి. ఆదిలాబాద్‌లోని రిమ్స్‌తో పాటు ఆయా జిల్లా కేంద్రాల్లోని ప్రధాన దవాఖానలు కీలక శస్త్రచికిత్సలు నిర్వహించడంతో పాటు నార్మల్ డెలివరీలకు ప్రాధాన్యమి స్తున్నాయి. ప్రభుత్వ దవాఖానల్లో ఓపీతో పాటు ఇన్‌పేషెంట్ల సంఖ్య కూడా పెరుగుతుండగా, ప్రభుత్వం కల్పిస్తున్న మెరుగైన వసతులే ఇందుకు కారణమవుతున్నాయి. మోకాలు కీలు మార్పిడి ఆపరేషన్లతో పాటు అరుదైన శస్త్రచికిత్సలు, వైద్య పరీక్షలతో ప్రజల ప్రశంసలందుకుంటున్నాయి.
ఉమ్మడి రాష్ట్రంలో సర్కారు దవాఖానల పరిస్థితి అధ్వానంగా ఉండేది. వైద్యులు, సిబ్బంది, మౌలిక వసతులు, మందులు, పరికరాల కొరత కారణంగా ప్రజలు ప్రభుత్వ దవాఖానలకు పోవాలంటేనే భయపడేవారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం వైద్యరంగానికి పెద్దపీట వేసింది. ప్రభుత్వ దవాఖానల్లో వైద్యులు, సిబ్బంది పోస్టులను భర్తీ చేయడంతో పాటు దవాఖానల నిర్మాణం, ఆధునీకరణ, అవసరమైన మందులు, వైద్య పరికరాలను సమకూర్చింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలతో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ప్రజల పాలిట వరంగా మారింది.
ఈ దవాఖానకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు ఇతర జిల్లాలు, మహారాష్ట్రకు చెందిన ప్రజలు వైద్య సేవల కోసం వస్తున్నారు. నిత్యం 1200 వరకు ఓపీ సేవలు అందుతుండగా, 450 మంది రోగులు ఇన్ పేషెంట్లుగా చికిత్స పొందుతున్నారు. జిల్లా సరిహద్దుగా ఉన్న మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి నిత్యం 150 మంది వరకు రిమ్స్‌కు వచ్చి వైద్య సేవలు పొందుతారు. రిమ్స్‌లో సూపర్ స్పెషాలిటీ భవనాన్ని ఇటీవల రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించగా, ఆ దవాఖానలో న్యూరో, పిడియాట్రిక్స్, యూరాలజీ విభాగాల్లో ఓపీ సేవలు అందిస్తున్నారు.
అందుబాటులో అన్ని సేవలు
ఆదిలాబాద్ రిమ్స్‌లో ప్రజలకు అన్ని రకాల వైద్యం అందుతున్నది. 24 గంటల అత్యవసర వైద్యసేవలు అందుబాటులో ఉన్నాయి. జనరల్‌కు సంబంధించిన పలు రకాల వైద్యసేవలు అందుతున్నాయి. గైనకాలజీ విభాగంలో నెలకు 250 వరకు కాన్పులు చేస్తున్నారు. గతేడాది ప్రభుత్వ దవాఖానల్లో నిర్వహించిన డెలివరీల్లో రాష్ట్రంలో రిమ్స్ రెండోస్థానంలో నిలిచింది. చిన్నారులకు ప్రత్యేకమైన విభాగం ఉంది. ఆప్తమాలజీ, ఎముకలకు వైద్యులు ప్రత్యేక వైద్యం అందిస్తున్నారు. రేడియాలజీ, డయాలసిస్, బ్లడ్‌బ్యాంక్, ఐసీయూ, ఎంఐసీయూ, ఎన్ఆర్సీ సేవలు నిర్వహిస్తున్నారు.
టీ డయాగ్నోస్టిక్ కేంద్రంలో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 37,430 వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. దవాఖానలో 400 బెడ్లకు ఆక్సిజన్ సౌకర్యం కల్పించడంతో పాటు కరోనా బాధితుల కోసం ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. విపత్కర పరిస్థితుల్లో ఆక్సిజన్ కొరత లేకుండా ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. ఇటీవల రిమ్స్‌లో 16 మంది వైద్యులను నియమించగా, ఇందులో ఆరుగురు స్పెషలిస్టులు, 10 మంది ఎంబీబీఎస్ వైద్యులు ఉన్నారు. ప్రభుత్వం ఇటీవల రూ.11 కోట్లతో రిమ్స్‌కు ఎంఆర్ఐ యంత్రాన్ని మంజూరు చేసింది.
నిర్మల్ జిల్లాలో..
నిర్మల్, జూలై 29(నమస్తే తెలంగాణ): నిర్మల్ జిల్లాలోని మామడ మండలం రాయదారి గ్రామానికి చెందిన బావుసింగ్ మోకాలు కీలు అరిగిపోవడంతో నడవడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. చికిత్స కోసం హైదరాబాద్‌లోని ప్రైవేట్ దవాఖానకు వెళ్లగా, మోకీలు మార్పిడి చేయాలని, ఇందుకు రూ. 2 లక్షలు ఖర్చవుతుందని అక్కడి వైద్యులు చెప్పారు. అంత మొత్తాన్ని భరించలేని బావుసింగ్ నిర్మల్‌లోని జిల్లా దవాఖాన వైద్యులను సంప్రదించాడు. అన్ని రకాల పరీక్షలు చేసిన ఇక్కడి వైద్యులు గత నెల 29న ఆరోగ్యశ్రీ కింద పూర్తి ఉచితంగా మోకీలు మార్పిడి సర్జరీని పూర్తి చేశారు. ఆర్థోపెడిక్ విభాగానికి చెందిన సివిల్ సర్జన్ డాక్టర్ ప్రమోద్‌చంద్రారెడ్డి, సివిల్ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ విజయ్‌రెడ్డి, డాక్టర్ రఘునందన్‌రెడ్డి, డాక్టర్ అశ్విన్‌లతోపాటు అసిస్టెంట్లు మనోహర్, రమ్యలతో కూడిన వైద్య బృందం ఈ శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు.
ప్రస్తుతం బావుసింగ్ ఎ లాంటి నొప్పి లేకుండా నడవగలుగుతున్నాడు. ఇదిలా ఉంటే సారం గాపూర్ మండలం గొడిసెర గ్రామానికి చెందిన తలారి దేవన్న పోలియో బాధితుడు. పోలియో సోకిన కాలు తుంటి భాగం విరిగిపోయింది. దీంతో గతేడాది అక్టోబరులో ఇదే దవాఖానలో తుంటి కీలు మార్పిడి చేశారు. తర్వాత 6 నెలలకు జరిగిన ప్రమాదంలో అదేకాలు మోకాలి కింది భాగంలో విరిగింది. దీనిని పెరీప్రాస్తటిక్ ప్రాక్చర్ అంటారని, ఇది చాలా అరుదుగా జరిగేదని వైద్యులు తెలిపారు. ఇందు కోసం జిల్లా దవాఖానలోని ఆర్థోపెడిక్ వైద్య బృందం ప్రత్యేకంగా ఇంప్లాంటును తయారు చేయించారు. గతనెల జూన్ 12న దాదాపు 4 గంటల పాటు శ్రమించి ఈ ఇంప్లాంట్‌ను దేవన్న కాలులో అమర్చి ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. కార్పొరేట్ దవాఖానల్లో రూ. 4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఖర్చయ్యే ఈ ఆపరేషన్‌ను ఉచితంగా చేసినట్లు దవాఖాన సూపరింటెండెంట్ ఏ. దేవేందర్‌రెడ్డి తెలిపారు.
ప్రతి నెలా 400 మందికి డెలివరీ..
జిల్లా కేంద్రంలోని ప్రధాన దవాఖానలో 24 గంటల సేవలు, నిరంతర ప్రసూతి సేవలు అందుతున్నాయి. ప్రతి నెలా 350 నుంచి 400 మందికి డెలివరీలు అవుతున్నాయి. సుమారు 500 మంది గర్భిణులు వివిధ పరీక్షల కోసం చేరుతున్నారు. ఈ యేడాది (2022) జనవరిలో డెలివరీ కోసం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో మొత్తం 505 మంది గర్భిణులు చేరారు. ఇందులో 49 మంది కొవిడ్ బాధితులు ఉన్నారు. 184 మందికి శస్త్ర చికిత్స అవసరం కాగా, 159 మందికి సాధారణ కాన్పులయ్యాయి. ఫిబ్రవరిలో 325 మంది డెలివరీ కాగా, ఇందులో 144 నార్మల్, 181 సిజేరియన్ ఆపరేషన్లు ఉన్నాయి.
మార్చిలో 395 మందికి కాన్పులు కాగా, 203 మందికి సాధారణ, 192 మందికి సిజేరియన్ ఆపరేషన్ అవసరం అయ్యింది. ఏప్రిల్‌లో 376 మంది ప్రసూతి కాగా, 176 మందికి సాధారణ, 196 మందికి శస్త్ర చికిత్సలు జరిగాయి. ప్రసవమైన అనంతరం ప్రతి ఒక్కరికీ కేసీఆర్ కిట్స్ పంపిణీ చేస్తున్నారు. మేలో 370 మంది డెలివరీ అయ్యారు. ఇందులో 138 మందికి సుఖ ప్రసవాలు కాగా, 232 మందికి ఆపరేషన్ల ద్వారా ప్రసూతి చేశారు. జూన్ 2022లో 342 మందికి ప్రసూతి కాగా, ఇందులో 138 మందికి నార్మల్ డెలివరీ అయ్యింది. అవసరం మేరకు 204 మందికి ఆపరేషన్ చేసి పురుడు పోశారు. గర్భిణులకు సాధారణ, శస్త్ర చికిత్సలతో పాటు కీలక సమయాల్లోనూ ఆపరేషన్ భేష్ అనిపించుకున్నారు.
డెలివరీ సమయాల్లో బీపీ పెరగడం, రక్తహీనత లోపంతో బాధపడుతున్న కీలక సమయాల్లోనూ అప్రమత్తంగా ఉండి డెలివరీలు చేశారు. దవాఖానకు వచ్చే గర్భిణుల్లో కొవిడ్ బాధితులు సైతం ఉండడంతో హై రిస్క్ చేసి ప్రసవాలు చేశారు. తల్లీ బిడ్డల ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని రక్షించిన సందర్భాలూ అనే కం ఉన్నాయి. శస్త్ర చికిత్స విభాగంలో జనరల్ సర్జికల్, ఎముకల సర్జరీలు కంటే కంటి శస్త్ర చికిత్సలు, ప్రసూతి శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయి. మార్చిలో 254, ఏప్రిల్‌లో 255, మేలో 327 శస్త్ర చికిత్సలు చేశారు.
ఆసిఫాబాద్ జిల్లాలో 1,350 సాధారణ ప్రసవాలు
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ఏర్పడిన తర్వాత కార్పొరేట్‌కు దీటుగా సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. మార్చిలో రూ. 60 కోట్లతో ఏరియా దవాఖాన నిర్మాణానికి మంత్రులు హరీశ్‌రావు, ఐకేరెడ్డి శంకుస్థాపన చేశారు. జిల్లాకు మెడికల్ కాలేజీ కూడా మంజూరు చేయడం విశేషం. జిల్లాలో గత జనవరి నుంచి ఇప్పటి వరకు 1,648 ప్రసవాలు జరుగగా, ఇందులో 1,350 సాధారణ ప్రసవాలు జరిగాయి. ఏజెన్సీ ప్రాంతాల్లోని గర్భిణులు, బాలింతలకు రక్తహీనత సమస్య నుంచి గట్టెక్కించేందుకు ప్రత్యేకంగా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్‌ను అందిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని దవాఖానను ఉన్నతీకరించేందుకు నాలుగేళ్ల క్రితం రూ. 7 కోట్లు మంజూరు చేయగా, సకల సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. 30 పడకల నుంచి 100 పడకలకు ఉన్నతీకరిస్తున్నారు. రూ. 32 లక్షలతో డయాగ్నొస్టిక్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో 57 రకాల రోగ నిర్ధారణ పరీక్షలు ఉచితంగా అందుబాటులోకి వచ్చాయి.
నిరంతరం పర్యవేక్షిస్తున్నాం
జిల్లాకేంద్రంలోని దవాఖానలో 24 గంటల మెరుగైన వైద్య సేవలందిస్తున్నాం. డయాలసిస్, ఐసీయూ, సిటీ స్కాన్ విభాగాలతో పాటు పలు విభాగాల్లో నిరంతర సేవలందుతున్నాయి. ఎన్‌బీఎస్‌యూ, ఎస్ఎన్సీయూ విభాగాల్లోనూ పుట్టిన పిల్లలకు ప్రాథమిక చికిత్సతో పాటు అత్యవసర సేవలందిస్తున్నాం. ప్రసవాల సంఖ్య కూడా పెరుగుతున్నది. ప్రతి నెలా దాదాపు 500 మంది గర్భిణులు దవాఖానలో అడ్మిట్ అవుతుండగా, 350 పైగానే మందికి డెలివరీలు చేస్తున్నాం. ప్రసవం అనంతరం కేసీఆర్ కిట్లు అందిస్తున్నాం. తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నాం.- డా.హరీశ్చంద్ర రెడ్డి, సూపరింటెండెంట్, మంచిర్యాల జిల్లా ప్రభుత్వ దవాఖాన
నార్మల్ డెలివరీ చేశారు
మంచిర్యాల ఏసీసీ, జూలై 29 : నా పేరు బోరె అమల. మాది కోటపల్లి మండలం ఆల్గాం గ్రామం. నా భర్త వెంకటేశ్ వ్యవసాయం చేస్తాడు. నాలుగు రోజుల కింద మంచిర్యాల జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు ప్రసవం కోసం వచ్చాను. మూడు రోజుల క్రితం నార్మల్ డెలివరీ చేశారు. ఇక్కడ తల్లీబిడ్డలను క్షేమంగా చూసుకుంటున్నారు. ప్రసవం తర్వాత ప్రతి ఒక్కరికీ కేసీఆర్ కిట్ కూడా అందిస్తున్నారు. అదే ప్రైవేట్ దవాఖానకు పోతే లక్షల్లో ఖర్చు అయ్యేది.
ఈ మహిళ పేరు పాశం సౌందర్య. ఈమెది వరంగల్ జిల్లా నర్సంపేట మండలం మహేశ్వరం. ఈ మహిళకు 12 రోజుల కింద ఆర్థోపెడిక్ విభాగం హెచ్‌వోడీ జైసింగ్ రాథోడ్ ఆధ్వర్యంలో వైద్యులు తిప్పస్వామి, శ్యాంప్రసాద్ కుడి మోకాలు కీలు మార్పిడి ఆపరేషన్ చేశారు. రిమ్స్‌లో అందుతున్న వైద్యసేవలపై బంధువుల ద్వారా తెలుసుకున్న సౌందర్య వరంగల్ నుంచి ఇక్కడికి వచ్చింది. ఐదేళ్లుగా మోకాలు నొప్పులతో బాధపడుతున్నానని, ప్రైవేటుకు వెళ్తే రూ.2.50 లక్షల ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పినట్లు తెలిపింది. రిమ్స్‌లో పైసా ఖర్చు లేకుండా వైద్యం అందిందని పేర్కొంది. వైద్యులు, సిబ్బంది బాగా చూసుకున్నారని, ఇప్పుడు మెల్లమెల్లగా నడవగలుగుతున్నానని చెప్పింది. త్వరలో ఎడమ మోకాలుకు కూడా రిమ్స్‌లోనే ఆపరేషన్ చేయించుకుంటానని తెలిపింది.
ఉచితంగా ఆపరేషన్ చేసిన్రు..
నేను పదేళ్లుగా మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న. అడుగు తీసి అడుగు వేయాలంటే నరకమైంది. హైదరాబాద్‌లో డాక్టర్లకు చూపిస్తే పెద్దాపరేషన్ చేయాలన్నరు. 2 లక్షలు ఖర్సైతదని చెప్పిన్రు. అంత ఖర్చు భరించడం నాతోటి కాదు. ఇగ నిర్మల్‌లోని సర్కారు దవాఖాన్ల చూపించిన. ఇక్కడి డాక్టర్లు ఒక్క రూపాయి తీసుకోకుండా మోకాలు ఆపరేషన్ చేసిన్రు. ఇప్పుడు నొప్పి చాలా వరకు తగ్గింది. ఆనందంగా ఉంది.
–బావుసింగ్, రాయదారి
పేదల దేవుడు కేసీఆర్ సారు..
మాది నిరుపేద కుటుంబం. భార్య, ఇద్దరు పిల్లలతో వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ పొట్టపోసు కుంటున్న. నాకు పుట్టుకతోనే కుడి కాలుకు పోలియో సోకింది. అదే కాలు తుంటి భాగంలో విరగడంతో పోయినేడు అక్టోబర్‌లో నిర్మల్ సర్కారు దవఖానలో తుంటి కీలు మార్పిడి ఆపరేషన్ చేసిన్రు. మళ్లీ మొన్న జూన్ నెలలో ఇంట్లో కాలు జారి పడడంతో అదే కాలు మోకాలి కింద విరిగింది. చాలా పెద్దాపరేషన్ చేసి ఆదుకున్నరు. మాలాంటి పేదలకు సీఎం కేసీఆర్ సారు దేవుడు. సార్ దయవల్లే పైసా ఖర్చులేకుండా నాకాలు బాగైంది.
–తలారి దేవన్న, గొడిసెర
2014కు ముందు సర్జరీలు చాలా అరుదు..
నేను ఇక్కడి దవాఖానలో 2012నుంచి పని చేస్తున్నా. అప్పట్లో నెలకు ఒక్క ఆపరేషన్ కూడా జరిగేది కాదు. చాలా అరుదుగా సర్జరీలు జరిగేవి. 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ దవాఖానల్లో నాణ్యతా ప్రమాణాలు, రోగులకు సదుపాయలు మెరుగయ్యాయి. ఆధునిక పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో కార్పొరేట్ స్థాయి చికిత్సలను చేయగలుగుతున్నాం. ఒక్క ఆర్థోపెడిక్ విభాగంలోనే ప్రస్తుతం నెలకు 50 నుంచి 60వరకు సర్జరీలు చేస్తున్నాం. ఇటీవల ఓ వ్యక్తికి కాలు విరిగితే టైటానియంతో చేసిన ఇంప్లాంట్‌ను అమర్చాం. ఇదే ప్రైవేటులో అయితే రూ. 4 లక్షల నుంచి రూ. 5 లక్షలు ఖర్చయ్యేది.
–డాక్టర్ టీ ప్రమోద్‌చంద్రారెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్, జిల్లా దవాఖాన, నిర్మల్
వారానికోసారి కీలుమార్పిడి ఆపరేషన్లు
ఆదిలాబాద్ రిమ్స్‌లో పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందిస్తున్నాం. రోజూ 1500 మందికి వివిధ విభాగాల ఆధ్వర్యంలో వైద్యం చేస్తున్నాం. 24 గంటలు ఎమర్జెన్సీ సేవలు అందుబాటులో ఉంటాయి. వారానికోసారి మోకాలు కీలు మార్పిడి ఆపరేషన్లు చేయాలని నిర్ణయించాం. మోకాలు సమస్యలు ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆర్థో తో పాటు గైనకాలజీ, జనరల్, ఆప్తమాలజీ, పిడియాట్రిక్స్ విభాగాల్లో మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నాం. సూపర్ స్పెషాలిటీ దవాఖానలో న్యూరో, పిడియాట్రిక్, యూరాలజీ ఓపీ సేవలు నిర్వహిస్తున్నాం. దవాఖానకు వచ్చే వారికి నాణ్యమైన వైద్యం అందుతుండడంతో ఓపీ, ఐపీ బాగా పెరిగింది. వైద్యులు, సిబ్బంది సహకారంతో ప్రజలకు అన్ని రకాల వైద్యసేవలు అందిస్తున్నాం.
– జైసింగ్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్