ఆదిలాబాద్ రూరల్, జూలై 29 : పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. శుక్రవారం పట్టణంలోని తాటిగూడ ప్రభుత్వ హైస్కూల్లో ఈ క్లాస్ రూమ్స్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం బొక్కల గూడ, కేఆర్కే కాలనీల్లో సవారీ బంగ్లా పనులు, మసూద్నగర్లో డ్రైనేజీ పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మొహర్రం పండుగ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. హిందూ ముస్లింలు సోదరుల్లా పండుగను నిర్వహిస్తున్నారన్నారు. అందుకే ప్రభుత్వం సవారీ బంగ్లాలకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఇప్పటికే కేజీబీవీలు, మోడల్‌స్కూల్, ఎంజేపీలను ఏర్పాటు చేసిందన్నారు. మన ఊరు మన బడి పేరుతో పాఠశాలల రూపురేఖలు మారుస్తుందన్నారు. పార్టీలకతీతంగా పట్టణంలోని 49వార్డుల్లోనూ కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, పట్టణాధ్యక్షుడు అజయ్, కౌన్సిలర్లు అశోక్‌స్వామి, బండారి సతీశ్, జాదవ్ పవన్ నాయక్, సంద నర్సింగ్, పందిరి భూమన్న, సంజయ్, గేడం సంజీవ్ పాల్గొన్నారు.
రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి…
ఆదిలాబాద్ రూరల్, జూలై 29: పట్టణంలో రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్ష పార్టీల కీలక నేతలు టీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. శుక్రవారం పట్టణంలోని కేఆర్కే కాలనీకి చెందిన పలువురు బీజేపీ యువకులు, మహిళలు భారీ సంఖ్యలో టీఆర్ఎస్లో చేరగా వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సామాన్య ప్రజలపై భారం మోపుతుంటే , రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తున్నదన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ అంజు, మహిళా విభాగం నాయకులు మమత, స్వరూపారాణి, మాజీ ఎంపీటీసీ నర్సింగ్ పాల్గొన్నారు.
రిమ్స్‌లో కీళ్ల మార్పిడి చికిత్స సక్సెస్
ఎదులాపురం, జూలై 29 : రిమ్స్‌లో కీళ్ల మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్న వరంగల్ జిల్లాకు చెందిన సౌందర్య అనే వృద్ధురాలిని ఎమ్మెల్యే జోగు రామన్న శుక్రవారం పరామర్శించారు. రిమ్స్ చరిత్రలోనే తొలిసారిగా కీళ్ల మార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేయడంపై రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, వైద్యులు తిప్పస్వామి, శ్యామ్ ప్రసాద్, నాగేశ్వర్రావు, చంద్రశేఖర్‌ను ఎమ్మెల్యే అభినందించారు. వృద్ధురాలికి స్వీట్లు తినిపించి డిశ్చార్జీ కార్డులను అందజేశారు.
ఎమ్మెల్యేకు విద్యార్థి కానుక..
తాటిగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఓ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే జోగు రామన్నకు పదో తరగతి విద్యార్థి ఎం.కార్తీక్ పెన్సిల్‌తో గీసిన రామన్న ముఖచిత్రం అందజేశారు. కార్తీక్ కుటుంబ, ఆర్థిక పరిస్థితులు తెలుసుకున్న రామన్న.. ప్రభుత్వం తరఫున సాయం అందజేస్తానని హామీ ఇచ్చారు.
– ఆదిలాబాద్ ఫొటోగ్రాఫర్, జూలై 29