ముత్నూర్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల భవనం ప్రారంభం
ఇంద్రవెల్లి, జూలై 29 : మండలంలోని ముత్నూర్ గ్రామ సమీపంలో రూ.6కోట్ల వ్యయంతో నిర్మించిన ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ జూనియర్ కళాశాల నూతన భవనాన్ని ఎమ్మెల్యే రేఖానాయక్ శుక్రవారం ప్రారంభించారు. ఐటీడీఏ పీవో వరుణ్రెడ్డి, ఐటీడీఏ చైర్మన్ కనక లక్కేరావ్తోపాటు మండల ప్రజాప్రతినిధులు పాల్గొనగా.. విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. సరస్వతీదేవి చిత్రపటానికి పూజలు చేసిన అనంతరం వంటగదితోపాటు స్టోర్ రూం, తరగతి గదులను ఎమ్మెల్యే పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతంలో మెరుగైన విద్యను అందించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుందని, ఏజెన్సీలోని గిరిజన విద్యార్థులకు ఉన్నత చదువులు అందించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వసతులు కల్పిస్తున్నారని తెలిపారు. అనంతరం ఇద్దరికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ పోటే శోభాబాయి, జడ్పీటీసీ పుష్పలత, పీఏసీఎస్ చైర్మన్ మారుతీ పటేల్ డోంగ్రే, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు మహ్మద్ అబ్దుల్ అంజద్, ఎంపీటీసీ జాదవ్ స్వర్ణలత, సర్పంచులు తుంరం భాగూబాయి, గాంధారి, విజయ, ఆర్సీవో గంగాధర్, కళాశాల ప్రిన్సిపాల్ ఆర్కా కృష్ణవేణి, వైస్ ప్రిన్సిపాల్ చంద్రకళ, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
కూలీలతో కలిసి భోజనం…
ఎమ్మెల్యే రేఖానాయక్ శుక్రవారం ఇంద్రవెల్లి మండలంలో పర్యటించారు. దారిలో వ్యవసాయ కూలీల వద్దకు వెళ్లి పలుకరించారు. ఈ సందర్భంగా వారితో కలిసి భోజనం చేసి మహిళలను సంతోషపరిచారు.