జైనూర్, జూలై 29 : తెలంగాణ సర్కారు ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం నిరుపేద దళితులకు వరమని కుమ్రం భీం ఆసిఫాబాద్ జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో దళిత బంధు పథకం యూనిట్ కింద మంజూరైన సూపర్ మార్కెట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా దళితుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని కృషిచేస్తున్నదని తెలిపారు. దళిత బంధు పథకాన్ని సద్వినియోగం చేసుకొని, ఉపాధి పొందాలని సూచించారు.
అర్హులందరికీ దళిత బంధు అందించాలి
దళిత బంధు పథకం ఏజెన్సీలోని అర్హులందరికీ అందేలా చూడాలని జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మికి అంబేద్కర్ ఫూలే మహా సంఘం జిల్లా అధ్యక్షుడు సుద్దాల శ్రీనివాస్ వినతిపత్రం అందజేశారు. జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ అర్హులందరికీ అందేలా కృషి చేస్తామని చెప్పారు.
పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి అన్నారు. జైనూర్ మేజర్ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో తయారు చేసిన ప్లాస్టికేతర సంచులను నాయకులు, అధికారులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకంతో పర్యవరణానికి ముప్పుకలుగుతుందన్నారు. ప్లాస్టిక్ రహిత సంచులను తయారు చేయడం అభినందనీయమన్నారు. అనంతరం దుబ్బగూడ చౌరస్తా వద్ద ఉన్న వాసవీ ఆలయం ఆవరణలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కనక యాదవ్‌రావు, రాష్ట్ర హజ్ కమిటీ సభ్యుడు ఇంతియాజ్‌లాలా, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆత్రం భగవంత్‌రావు, ఎంపీపీ కుమ్ర తిరుమల, వైస్‌ఎంపీపీ చిర్లె లక్ష్మణ్, ఎంపీడీవో ప్రభుదయ, మండల కోఆప్షన్ సభ్యుడు ఫెరొజ్ఖాన్, సహకార సంఘం చైర్మన్ కొడప హన్నుపటేల్, సర్పంచులు పార్వతి లక్ష్మణ్, మడావి భీంరావు, శ్యాంరావు, ఎంపీటీసీ భగ్గు, నాయకులు జాడి రవీందర్, అజ్జులాలా, షేక్ అబ్బు, జన్నవార్ పవన్‌కుమార్ తదితరులున్నారు.