ఇచ్చోడ, జూలై 28 : ఆ పాఠశాల ఆవరణలో పచ్చని చెట్లు, తరగతి గదులకు మహనీయులు, జాతీయ నాయకుల చిత్ర పటాలు.. రంగు రంగుల బొమ్మలు కనువిందు చేస్తున్నాయి. ఉపాధ్యాయులు, సిబ్బంది ఇచ్చోడ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు నేడు చెట్లుగా మారి ఆహ్లాదపరుస్తుండడంతో బృందావనంలా కనిపిస్తున్నది.
ప్రైవేట్‌కు దీటుగా….
ప్రైవేట్‌కు దీటుగా ప్రతి ఏటా విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నది. ఇక్కడ ఇంగ్లిష్ మీడియం ప్రారంభమై పదేళ్లు దాటింది. ప్రారంభం నుంచి పదో తరగతి వార్షిక పరీక్షల్లో వందశాతం ఫలితాలు నమోదవుతున్నాయి. గ్రంథాలయం, సైన్స్ ల్యాబ్, శుద్ధ జలం, ఇతర మౌలిక వసతులు అందుబాటులో ఉన్నాయి. ఇచ్చోడ మండలం నుంచే కాకుండా నేరడిగొండ, సిరికొండ, గుడిహత్నూర్, బజార్హత్నూర్ మండలాల్లోని ఆయా ప్రాంతాల నుంచి విద్యార్థులు ఇచ్చోడ జడ్పీ బడి బాట పడుతున్నారు. విద్యార్థులకు మరిన్ని వసతులు కల్పించేందుకు ఈ పాఠశాలను మన ఊరు – మన బడి పథకం కింద ఎంపిక చేశారు.
విద్యార్థుల వివరాలు ..
పాఠశాలలో ఆరు నుంచి పది వరకు తరగతులు కొనసాగుతున్నాయి. తెలుగు మీడియంలో బాలురు 307, బాలికలు 228 మంది విద్య నభ్యసిస్తున్నారు. ఇంగ్లిష్ మీడియంలో బాలురు 510, బాలికలు 187 మంది ఉన్నారు. పాఠశాలలో మొత్తం 1,232 మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
నాణ్యమైన విద్యనందిస్తున్నాం
ప్రైవేట్‌కు దీటుగా విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తున్నాం. చదువుల్లో వెనుకబడిన విద్యార్ధులపై ప్రత్యేక దృష్టి సారించాం. పదేళ్ల నుంచి వంద శాతం ఫలితాలు సాధిస్తున్నాం. పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం.
-రమణారెడ్డి ఇన్చార్జి హెచ్ఎం, ఇచ్చోడ