కేంద్ర ప్రభుత్వ చర్యల కారణంగా గ్రామ పంచాయతీలు ఆర్థికంగా చికితిపోతున్నాయి. పంచాయతీలపై పెత్తనం చేసేందుకు చూస్తుండడంతో ‘ప్రగతి’ పడకేస్తున్నది. కేంద్రం ఇచ్చే ఆర్థిక సంఘం నిధులను నేరుగా పంచాయతీ ఖాతాల్లో జమ చేస్తామని చెబితే.. అందుకనుగుణంగా పాలకవర్గాలు కొత్త ఖాతాలను తెరిచాయి. కానీ.. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. నెలనెలా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులతోనే సర్పంచ్‌లు సరిపెట్టుకుంటూ వస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలకు ఈ యేడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు కేంద్రం నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.66 కోట్లు రావాల్సి ఉంది. కానీ.. నేటికీ ఒక్క రూపాయి కూడా రాకపోవడంతో పంచాయతీల పాలకవర్గాలు ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నాయి.
నిర్మల్ (నమస్తే తెలంగాణ)/నిర్మల్ టౌన్, జూలై 27 : పల్లెల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం నెలనెలా ఠంఛనుగా నిధులు విడుదల చేస్తున్నది. కేంద్రం వాటాగా వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులతోపాటు, రాష్ట్ర వాటాగా ఇచ్చే నిధులు పంచాయతీలకు సమకూరుతున్నాయి. అయితే గ్రామ పంచాయతీలకు 2022-23 ఆర్థిక సంవత్సరానికి నేరుగా తామే నిధులు అందజేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఈ యేడాది మార్చిలోనే ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్బీఐ బ్యాంకుల్లో జీరో ఖాతాలు తెరవాలని సూచించగా.. ఆ మేరకు పంచాయతీ పాలక వర్గాలు బ్యాంకు ఖాతాలు తెరిచాయి. కేంద్రం చెప్పినట్లుగా ఉమ్మడి అదిలాబాద్ జిల్లాకు ప్రతినెలా రూ.22.03 కోట్ల వరకు నిధులు ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. కానీ.. మూడు నెలలు అవుతున్నప్పటికీ రూ.66 కోట్లలో పైసా జమ కాలేదు.
సంక్షోభ పరిస్థితుల్లోనూ వెనుకాడని తెలంగాణ ప్రభుత్వం
కేంద్రం మోకాలొడ్డినా.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం పంచాయతీలకు ప్రతినెలా క్రమం తప్పకుండా జీపీల ఖాతాల్లో నిధులు జమ చేస్తూ వస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం వాటాగా రూ.22.68 కోట్లు ప్రతి నెలా జమ చేస్తున్నది. అందులో జనరల్ గ్రాంట్ కింద రూ.16.12 కోట్లు, ఎస్సీ గ్రాంట్ కింద రూ.2.19 కోట్లు, ఎస్టీ గ్రాంట్ కింద రూ.2.36 కోట్లను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 1,509 పంచాయతీల ఖాతాలకు విడుదల చేస్తున్నది. ఇదేరీతిన కేంద్రం కూడా జనరల్ గ్రాంట్ కింద రూ.15.66 కోట్లు, ఎస్సీ గ్రాంట్ కింద 2.10 కోట్లు, ఎస్టీ గ్రాంట్ కింద రూ.3.28 కోట్లను పంచాయతీ ఖాతాల్లో జమ చేయాల్సి ఉన్నది. అయితే.. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్, మే, జూన్ నెలలకు కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడం గమనార్హం.
కేంద్రం మోకాలొడ్డినా..
కేంద్రం సహకరించనప్పటికీ, కరోనా వంటి ఆర్థిక సంక్షోభంలోనూ తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, రైతుబంధు వంటి పథకాలను కొనసాగించి.. అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్నది. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని పంచాయతీలకు ఈ ఆర్థిక సంవత్సరంలోనూ ప్రతినెలా నిధులను పంచాయతీల ఖాతాల్లో జమ చేస్తూ వస్తున్నది. కేంద్రం తీరు వల్ల నిధుల లేమితో పంచాయతీలు కొట్టుమిట్టుడుతుండగా.. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న నిధులే ప్రస్తుతం పంచాయతీలకు ఆసరా అవుతున్నాయి. ఆ నిధులతోనే పాలకవర్గాలు పాలనను కొనసాగిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం గ్రామ పంచాయతీల అభివృద్ధికి ఎసరు తెచ్చే విధంగా ఉందన్న అభిప్రాయాన్ని పలువురు సర్పంచ్‌లు వ్యక్తం చేస్తున్నారు.
కేంద్ర సర్కారు రాష్ట్రంపై వివక్ష
సోన్, జూలై 27 : మాది నిర్మల్ మండలంలోని నీలాయిపేట్ గ్రామం. మా గ్రామంలో అధికంగా ఎస్టీ జనాభా ఉంటుంది. గతంలో కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రతినెలా జనరల్ ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద సుమారు రూ.1.50 లక్షల వరకు జీపీ ఖాతాల్లో జమయ్యేవి. ఆ నిధులతోనే ప్రజలకు అవసరమైన సదుపాయాలు కల్పించేవాళ్లం. మార్చి నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిధులు జమ చేస్తున్నా.. కేంద్రం మూడు నెలల నుంచి పైసలు ఇవ్వడం లేదు. ఆర్థికంగా ఇబ్బంది అవుతున్నది. అభివృద్ధి పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి.
– సూరపు సాయన్న, నీలాయిపేట్, సర్పంచ్
డబ్బులియ్యట్లే..
సోన్, జూలై 27 : మాది ముథోల్ నియోజకవర్గంలోని ఓలా గ్రామం. సుమారు మూడు వేల వరకు జనాభా ఉంటుంది. మార్చి నెల కంటే ముందు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 15వ ఆర్థిక సంఘం నిధుల కింద జీపీలకు నిధులు మంజూరు చేసేవి. నెలకు కేంద, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన రూ. 1.50లక్షల వరకు వచ్చేవి. మార్చి నెల నుంచి కేంద్ర నిధులు నిలిచిపోగా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిధులు ఇస్తున్నది. జీరో ఖాతాలను సేకరించిన ప్రభుత్వం నేరుగా గ్రామ పంచాయతీ ఖాతాల్లో కేంద్రం నిధులు జమ చేస్తామని ఖాతాలు తీసుకొని ఇప్పుడు డబ్బులు వేయకపోవడంతో పల్లెలపై వివక్ష చూపడమే అవుతుంది.
– కనీస్ ఫాతిమా, సర్పంచ్, ఓలా