ఎదులాపురం, జూలై 27 : ఎస్సీ, ఎస్టీ కేసులకు సంబంధించిన విచారణ వేగవంతం చేసి కమిటీ సభ్యులకు సహకరించాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశమందిరంలో అధికారులతో జిల్లా స్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో 2021 సంవత్సరంలో 33 కేసుల నమోదు కాగా 28 పెండింగ్, ట్రయల్‌లో 4, చివరి దశలో ఒకటి తప్పుడు కేసుగా పరిగణించి మినహాయించబడిందన్నారు.
2022 సంవత్సరంలో ఈ నెల 20వ తేదీ వరకు 33 కేసులు నమోదు కాగా 15 కేసులు పెండింగ్, ట్రయల్‌లో ఒక కేసు ఫైనల్ రిపోర్ట్‌గా, 17 కేసులు విచారణ దశలో ఉన్నాయని తెలిపారు. 2021 సంవత్సరంలో 28 కేసులకు రూ.16 లక్షల 50 వేలు ఎఫ్ఐఆర్ స్టేజ్‌లో, 28 మందికి రూ.32 లక్షల 50వేలు చార్ట్షీట్ దశలో రిలీఫ్ కింద ఇచ్చామన్నారు. 2022 సంవత్సరంలో 20 మందికి రూ.9లక్షలు ఎఫ్ఐఆర్ స్టేజ్‌లో, 14 మందికి రూ.14లక్షల 50వేల చార్ట్షీట్ దశలో రిలీఫ్ కింద ఇచ్చామని తెలిపారు. మిగతా వారికి బ్యాంకు ఖాతాలు , తదితర సమాచారం సేకరించి రిలీఫ్ అందజేస్తామని పేర్కొన్నారు.
చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో వర్షాల కారణంగా మారుమూల గ్రామాల్లోని ప్రజలకు అవసరమైన ప్రభుత్వ సేవలు అందించేందుకు కమిటీ సభ్యులు నేరుగా సమాచారం అందించవచ్చన్నారు. ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పురోగతికి పోలీస్ యంత్రాంగం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుందన్నారు. పలువురు కమిటీ సభ్యులు లేవనెత్తిన అంశాలకు ఎస్పీ సమాధానం ఇచ్చారు.
అంతకుముందు జిల్లా దళిత సంక్షేమ శాఖ అధికారి భగత్ సునీతాకుమారి కేసులకు సంబంధించిన వివరాలు తెలియజేశారు. సమావేశంలో ఐటీడీఏ పీవో వరుణ్ రెడ్డి, అదనపు కలెక్టర్లు రిజ్వాన్ బాషా షేక్, ఎన్ నటరాజ్, ఉట్నూర్ అదనపు ఎస్పీ హర్షవర్ధన్, ఆదిలాబాద్ ఇన్చార్జి డీఎస్పీ ఉమామహేశ్వర్ రావు, ఆర్డీవో రాథోడ్ రమేశ్, సంక్షేమ శాఖల అధికారులు రాజలింగం, కృష్ణవేణి, కమిటీ సభ్యులు మెస్రం భీంరావ్, అనిల్, రోష్ణ, కలెక్టరేట్ పరిపాలన అధికారి అరవింద్ పాల్గొన్నారు.
పనులు సమర్థవంతంగా నిర్వహించాలి
ఎదులాపురం, జూలై 27 : జలశక్తి అభియాన్ కింద చేపట్టిన పనులు సమర్థవంతంగా నిర్వహించాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను అదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జలశక్తి అభియాన్ ద్వారా చేపట్టిన పనులపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామ పంచాయతీ రాజ్, నీటి పారుదల, వివిధ శాఖల ద్వారా గ్రామాల్లో చేపట్టిన పనులను సమర్థ వంతంగా నిర్వహించాలన్నారు. గ్రామీణ అభివృద్ధి, అటవీ, వ్యవసాయ కృషి విజ్ఞాన, నెహ్రూ యువ కేంద్రం గ్రామీణ నీటి సరఫరా పంచాయతీ సంస్థల పునరుద్ధరణ జిల్లాలో కొనసాగుతుందన్నారు.
ఈ నెల 29వ తేదీన కేంద్ర బృందం అధికారులు జలశక్తి అభియాన్‌పై జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులు నివేదికలతో సిద్ధంగా ఉండాలన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, జిల్లా అటవీ శాఖ అధికారి రాజశేఖర్, ఆర్డీవో రాథోడ్ రమేశ్, డీఆర్డీవో కిషన్, జడ్పీ సీఈవో గణపతి, వ్యవసాయ శాఖ అధికారి పుల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.