ఆదిలాబాద్ ప్రతినిధి/నిర్మల్, జూలై 25(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా రైతులు అధికంగా సాగు చేస్తారు. దీంతో కూలీలకు పనులు అధికంగా లభిస్తాయి. డిసెంబరు నుంచి మే వరకు కూలీలు ఉపాధి పనులకు వెళ్తుంటారు. ఉపాధి పథకంలో భాగంగా వివిధ రకాల పనులు చేపడుతారు. గ్రామాల్లో చేపడుతున్న పనులు రైతులు, స్థానికులకు ప్రయోజనం చేకూరుస్తున్నాయి. యేటా గ్రామసభలు నిర్వహించి అవసరమైన పనులు, అందుకు అయ్యే ఖర్చులను ముందుగా గుర్తిస్తారు. వాటి ఆమోదం తర్వాత పనులు చేపడుతారు. ఈ యేడాది ఆదిలాబాద్ జిల్లాలో రూ.38.44 కోట్లు ప్రభుత్వం చెల్లించింది. మెటీరియల్ కాంపోనెంట్ కింద రూ.13.33 కోట్లు వెచ్చించింది. పనులు చేయడం ద్వారా గ్రామాలలో కూలీలకు రోజూ రూ.183 కనీస వేతనం లభించింది. జిల్లా వ్యాప్తంగా యేటా ఎండాకాలంలో రోజు 50-60 వేల మంది ఉపాధి పొందుతారు. పల్లెల్లో గుంపులు, గుంపులుగా కూలీలు పనులు చేస్తూ కనిపిస్తారు. గ్రామ పంచాయతీ సిబ్బంది వీరికి పనులు కల్పించేలా చూడడంతోపాటు వేతనాలు కూడా పంపిణీ చేసేలా చూస్తారు.
20 పనుల నిబంధనతో పనికి దూరం
ఆదిలాబాద్ జిల్లాలో 468 గ్రామ పంచాయతీలు ఉండగా.. యేటా ఉపాధి హామీ అధికారులు గ్రామసభలు నిర్వహించి ఏమే పనులు నిర్వహించాలని తెలుసుకుంటారు. ఇందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తారు. జిల్లాలో గతేడాది 21 వేల పనులను చేపట్టాలని అధికారులు ప్రణాళికలు తయారు చేశారు. ఇప్పటివరకు 17 వేల పనులు పూర్తికాగా 4 వేల పనులు కొనసాగుతున్నాయి. యేటా ఒక్కో గ్రామంలో సగటున 40 పనులు చేపడుతారు. దీంతో గ్రామంలో కూలీలకు ఉపాధి లభిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన కొత్త నిబంధన కూలీలను ఉపాధి పనులకు దూరం చేయనున్నది. ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నీరుగార్చే ప్రయత్నాలు చేస్తుందని సర్పంచ్‌లు, కూలీలు వాపోతున్నారు.
మంచిర్యాల జిల్లాలో..
ఉపాధి హామీ పథకం నిర్వీర్యానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తున్నది. కొత్త నిబంధనలతో కొర్రీలు పెడుతూ కూలీల ఉపాధికి గండి కొడుతున్నది. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టంలో భాగంగా జిల్లాలోని ప్రతి శ్రామిక కుటుంబానికి, ఏడాదికి కనీసం 100 రోజుల పాటు జీవనోపాధి పనులు కల్పిస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో జూన్ 15 వరకు 1,28,213 జాబ్ కార్డులు జారీ చేశారు. మొత్తం 2,64,039 మంది కూలీలు ఉండగా, 2022-23 సంవత్సరంలో 50,563 కుటుంబాలకు, 81,412 మంది కూలీలకు పనులు కల్పించారు. 5,93,666 పనిదినాల సంఖ్య కల్పించగా, కూలీలకు మొత్తం రూ.21.26కోట్లు ఖర్చు చేశారు. సామగ్రితో కలిపి మొత్తం రూ.23.48 కోట్లు ఖర్చు చేశారు. కాగా, కేంద్రం తాజా నిబంధనలతో పనిదినాలు, కూలీల సంఖ్యలో కోత పడనున్నది. కొత్త నిబంధనలు ఆగస్టు 20 నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ పేర్కొన్నది. ఉపాధి హామీలో 57 పనులకు అవకాశం ఉండగా, జిల్లాలో ప్రాధాన్యతను బట్టి 25 నుంచి 30పైగా పనులు కొనసాగిస్తున్నారు. పరిస్థితులు, అవసరాన్ని బట్టి కూలీల సంఖ్య పెంచుతున్నారు. పనిని బట్టి 50పైగా కూలీలను సైతం వినియోగిస్తున్నారు. కేంద్రం కొత్త నిబంధనలు కూలీలకు గొడ్డలి పెట్టుగా మారనున్నాయి.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో..
జిల్లాలో 15 మండలాల పరిధిలో 1,24,638 జాబ్‌కార్డులు ఉన్నాయి. కూలీలు 2,66,857 మంది ఉన్నారు. గతేడాది నిర్వహించిన పనుల ద్వారా ఒక్కో కూలీకి సగటున 53 రోజుల పనిదినాలు మాత్రమే లభించాయి. గతేడాది జిల్లాలో 100 రోజుల పనిదినాలు వినియోగించుకున్న కుటుంబాలు కేవలం 8,850 మంది మాత్రమే. 2022-23 ఆర్థిక సంవత్సరానికి 45.41 లక్షల పనిదినాలను కూలీలకు కల్పించే విధంగా ప్రణాళికలు తయారు చేశారు. రూ. 185 కోట్లు అవసరమవుతాయని అధికారులు అంచనాలు తయారు చేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న నిబంధనల కారణంగా కూలీలకు ఉపాధి కరువయ్యే ప్రమాదం ఏర్పడింది. ఈ ఆర్థిక సంవత్సరానికిగాను సగానికిపైగా పనిదినాలు తగ్గే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొంటున్నారు.
నిర్మల్ జిల్లాలో..
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులకు హాజరయ్యే కూలీలకు కేంద్రంలోని బీజేపీ సర్కారు షాక్ ఇవ్వబోతున్నది. కూలీలకు పనిదినాలు తగ్గించి ఉపాధికి దూరం చేయాలనే కుట్ర పన్నుతున్నది. ఇందుకోసం ఆగస్టు 1వ తేదీ నుంచి కొత్త నిబంధనలు అమలు చేసేందుకు సిద్ధమవుతున్నది. కొత్త మార్గదర్శకాల ప్రకారం.. ఏదైనా ఒక గ్రామంలో ఒకేసారి 20 పనులకు మించి చేపట్టరాదని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశా లు జారీ చేసింది. చేపట్టిన 20 పనుల్లో ఏదైనా ఒక పని పూర్తయిన తర్వాత నే కొత్త పని మొదలు పెట్టాల్సి ఉంటుంది. ఒకసారికి 20 పనులకు మాత్రమే బిల్లులు చేసే వెసులుబాటు ఉంటుంది. ఇతర పనుల బిల్లులను కొత్తగా రూపొందించిన సాఫ్ట్వేర్ అనుమతించదు. దీంతో చాలా గ్రామాల్లో కొన్ని నెలలపాటు కొత్త పనులు ప్రారంభించే అవకాశమే ఉండదు. దీంతో కూలీ దొరికే పరిస్థితి లేకుండా పోతుందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతున్నది.
3.67 లక్షల మంది కూలీలకు ఉపాధి
నిర్మల్ జిల్లాలోని 395 పంచాయతీల్లో దాదాపు 19 వేల పనులు జరుగుతున్నాయి. వీటిలో కొన్ని పూర్తి కాగా, మరి కొన్ని పురోగతిలో ఉన్నాయి. ప్రస్తుతం భారీ వర్షాల కారణంగా ఇతర పనులు పక్కన పెట్టి కేవలం ప్లాంటేషన్ పనులనే కొనసాగిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 1,78,948 జాబ్ కార్డులు ఉండగా.. 3,67,054 మంది కూలీలు ఉపాధి పొందుతున్నారు. ఒక్కో గ్రామంలో సగటున 38 పనులు కొనసాగుతున్నాయి. ఆయా పనులను బట్టి కొన్ని పనులను కొందరు మాత్రమే చేయగలరు. తాజాగా కేంద్రం తేనున్న కొత్త నిబంధనతో 20 పనులను మాత్రమే చేయాల్సి ఉంటుంది. దీంతో సహజంగానే కూలీలకు పనులు తగ్గుతాయి. ఏకకాలంలో జరుగుతున్న 38 పనుల్లో దాదాపు సగం నిలిచిపోతే చాలా మంది కూలీలకు ఉపాధి లభించే పరిస్థితి ఉండదు. తాము చేయగలిగిన పనులు ఎప్పుడు ప్రారంభిస్తారో అని ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొంటుంది. కాగా.. ఉపాధి హామీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు రూపొందించినట్లు తెలిసిందని, మార్గదర్శకలు రాలేదని నిర్మల్ జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారిణి విజయలక్ష్మి తెలిపారు.
ప్రతి పనికీ ఆటంకమే..
ఉపాధి హామీ పథకంలో పలు పనులకు కేంద్ర ప్రభుత్వం ఆటంకం కలిగిస్తున్నది. గతంలోఉపాధి హామీ కూలీలు పనిచేసే చోట మౌలిక వసతులు ఈజీఎస్ నిధుల నుంచి చేపట్టేవారు. పనులు చేసే చోట మంచినీరు, నీడ కోసం టెంట్ వేసుకునే సౌకర్యం తదితర బాధ్యతల నుంచి కేంద్రంలోని మోదీ సర్కారు తప్పుకున్నది. గ్రామపంచాయతీలపైనే భారం వేసింది. ఉపాధి హామీ ప్రారంభం నుంచి చెరువుల పూడికతీత కార్యక్రమం ఉన్నది. ఇప్పుడు నీటి పారుదల శాఖ ఎన్వోసీ (నో అబ్జక్షన్ సర్టిఫికెట్) లేకుండా చెరువుల పూడికతీతపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది.
– కొండగొర్ల బాపు, సర్పంచ్, సుంపుటం, వేమనపల్లి.
పదేపదే ఫొటో తీయడం ఇబ్బందే..
వేమనపల్లి, జూలై 25 : ఉపాధి హా మీ కూలీలు ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేయా ల్సిందేనని కేంద్ర సర్కారు చెబు తున్నది. ఉదయం పని ప్రారం భించాక ఒకసారి ఫొటో తీయ డం, మధ్యా హ్నం తర్వాత మరోసారి ఫొటో తీసి అప్లోడ్ చేయాలని ఆదే శించారు. దీంతో కూలీలకు స్వేచ్ఛ లేకుండా పోయింది. అధికారులు, ఉపాధి హామీ సిబ్బందికి ఇబ్బందవుతుంది. గతంలో ఒక సారి తీసి అప్లోడ్ చేసేవాళ్లం. కొత్త నిబంధ నలకు సంబంధించి విధివిధానాలు పూర్తిస్థా యిలో రావాల్సి ఉంది. అదనపు కూలీ చెల్లించేందుకు కూడా అవకాశం లేదని తెలిసింది.
– బీ సత్యప్రసాద్, అదనపు కార్యక్రమ అధికారి,జాతీయ ఉపాధి హామీ పథకం, వేమనపల్లి.
ఉపాధి కోల్పోతారు..
ఉపాధి హామీ పథకం కింద గ్రామానికి 20 పనులు మాత్రమే కేటాయిస్తామని కేంద్ర ప్రకటించడం సరైంది కాదు. ఫలితంగా పేదల బతుకులతో చెలగాటం ఆడడమే అవుతుంది. ఉపాధి తగ్గి కూలీలకు పని దొరకని పరిస్థితి నెలకొంటుంది. పస్తులుండే అవకాశం కూడా ఉంది. కేంద్ర సర్కారు వెనక్కి తగ్గి నిబంధనలు మార్చాల్సిన అవసరం ఉంది.- జీ స్వాతిక, సర్పంచ్, కరంజి(టి), భీంపూర్ మండలం
ఈజీఎస్ పథకాన్ని నీరుగారుస్తున్నరు..
కేంద్రం ఈజీఎస్ పథకాన్ని పూర్తిగా నీరుగార్చేం దుకు కుట్ర పన్నుతున్నది. కనీసం కూలీలకు పని దొరుకని పరిస్థితి ఉంటుంది. గ్రామానికి 20 పను లే అనడంతో కొన్ని శ్రమశక్తి సంఘాలు పనిలేకుం డా పోతాయి. కేంద్రం వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. ఈ విషయంలో మేము పట్టుదలతో ఉద్యమం చేస్తాం. – బక్కి లలిత, సర్పంచ్, అంతర్గాం, భీంపూర్ మండలం