దస్తురాబాద్, జూలై 25 : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు విద్యుత్ స్తంభాలు నీట మునిగాయని, వీలైనంత త్వరగా మరమ్మతులు చేపట్టి కరెంట్ సరఫరాను పునరుద్ధరిస్తామని ఎన్పీడీసీఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ -వరంగల్ (జిల్లా ప్రత్యేక పర్యవేక్షణ అధికారి) పేర్కొన్నారు. మండలంలోని రాంపూర్, గొడిసెర్యాల గ్రామంలోని గోదావరి తీర ప్రాంతంలో వరదకు నీట మునిగిన విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతులను సంబంధిత అధికారులతో కలిసి సోమవారం ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవునిగూడెం, మున్యాల, రాంపూర్, భూత్కుర్, గొడిసెర్యాల, గొడిసెర్యాల గోండుగూడెంలో గోదావరి ప్రవహానికి 1012 విద్యుత్ స్తంభాలు ధ్వంసం కాగా , 135 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు నీట మునిగాయని పేర్కొన్నారు. మరో 10 కిలోమీటర్ల విద్యుత్ వైర్లు కొట్టుకుపోయినట్లు తెలిపారు. మండలంలో సుమారుగా రూ 70 లక్షల నష్టం వాటిల్లిందని అంచనా వేశామన్నారు. నలుగురు కాంట్రాక్టర్లతో పనులు వేగవంతం చేసినట్లు, కొత్త స్తంభాలు సైతం వేస్తున్నట్లు చెప్పారు. గ్రామాల్లో త్రీఫేస్, సింగిల్ ఫేస్ విద్యుత్ సరఫరా చేస్తున్నామని, గోదావరి తీరా ప్రాంతాల్లో వ్యవసాయానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు తెలిపారు. జిల్లాలోని పెంబి, ఖానాపూర్, కడెం, మామడ, దస్తురాబాద్ మండలాల్లో విద్యుత్ నష్టం భారీగా వాటిల్లిందన్నారు. పంటలకు సకాలంలో విద్యుత్ అందిస్తామని, ఎవరూ కూడా ఆందోళన చెందవద్దు కోరారు. ఆయన వెంట ఖానాపూర్ ఏడీఈ ఈదన్న, ఏఈ కెశెట్టి శ్రీనివాస్, విద్యుత్ సిబ్బంది, రైతులు ఉన్నారు.