నిర్మల్, జూలై 24 (నమస్తే తెలంగాణ) : వానకాలం సీజన్‌కు సంబంధించి వరి మినహా మిగతా అన్ని పంటల సాగు పనులు ఇప్పటికే ఊపందుకున్నాయి. రైతులకు లాభసాటి పంటలపై వ్యవసాయ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏవోలు, ఏఈవోలు అన్ని వ్యవసాయ క్లస్టర్ల పరిధిలోని రైతు వేదికల్లో రైతులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ప్రతి మంగళ, శుక్రవారాలు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు అవసరమైన సూచనలు, సలహాలను ఇస్తున్నారు. నిర్మల్ జిల్లాలోని 79 క్లస్టర్ల పరిధిలో 79 రైతు వేదికలున్నాయి. ఆయా వేదికల ద్వారా రైతులకు లాభసాటి పంటలపై అవగాహన కల్పిస్తూ చైతన్యపరుస్తున్నారు. ఈ వానకాలంలో జిల్లా వ్యాప్తంగా 4.06 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేశారు. కాగా, ఇప్పటి వరకు 2.80 లక్షల ఎకరాల్లో రైతులు పంటలను సాగు చేశారు.
రైతు వేదికల్లో సమావేశాలు..
ఈ సీజన్లో రైతులు లాభసాటి పంటలు సాగు చేసి, లబ్ధిపొందేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగా ప్రతి రైతు వేదికలో వారానికి రెండుసార్లు రైతులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం వ్యవసాయాధికారులను ఆదేశించింది. ఆయా క్లస్టర్ల పరిధిలోని రైతులతో అధికారులు సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఈ సమావేశాల్లో పంటల సాగులో మెళకువలను తెలియజేయడంతో పాటు, పచ్చిరొట్ట ఎరువుల వాడకంపై అవగాహన కల్పిస్తున్నారు. పచ్చిరొట్ట వాడకంతో భూసారం పెరుగుతుందని సూచిస్తున్నారు. అలాగే ఈ సమావేశాల్లో భాస్వరాన్ని కరిగించే జీవ ఎరువుల వాడకం గురించి అవగాహన కల్పిస్తున్నారు. వరిసాగులో దమ్ము లేకుండా నేరుగా వెదజల్లే పద్ధతి, ఎరువులను ఒకేసారి కాకుండా దఫాలుగా వేయడంపై రైతులకు విలువైన సూచనలు అందిస్తున్నారు. అలాగే మార్కెట్లో డిమాండ్ ఉన్న పత్తి, కంది పంటలను ఎక్కువగా సాగుచేయాలని చెబుతున్నారు. వ్యవసాయ అధికారులు సమావేశాల్లో చెబుతున్న అంశాలపై రైతులు అవగాహన పెంపొందించుకొని వాటిని పాటిస్తూ పంటలను సాగు చేస్తున్నారు.
అందుబాటులో విత్తనాలు, ఎరువులు..
రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాల కొరత లేకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకున్నది. జిల్లాలో ఈ ఏడాది వానకాలం సీజన్లో 4.06 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అందుకోసం 20వేల క్వింటాళ్ల వరి విత్తనాలు, 500 క్వింటాళ్ల కంది, 2 వేల క్వింటాళ్ల మక్క, 24వేల క్వింటాళ్ల సోయా, 10 క్వింటాళ్ల పెసలు, 50 క్వింటాళ్ల మినుములు, 765 క్వింటాళ్ల పత్తి విత్తనాల ప్యాకెట్లను రైతులకు అందుబాటులో ఉంచింది. అలాగే ఆయా పంటల సాగుకు 35 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమవుతాయని అంచనా వేసిన వ్యవసాయాధికారులు, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. యూరియా 22 వేల మెట్రిక్ టన్నులు జిల్లాకు రాగా, ఇప్పటికే 7 వేల మెట్రిక్ టన్నులు రైతులు కొనుగోలు చేశారు. ఇంకా 15వేల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉంది. అలాగే 10వేల మెట్రిక్ టన్నుల డీఏపీ రాగా, 7వేల మెట్రిక్ టన్నుల డీఏపీని రైతులకు పంపిణీ చేశారు. మరో 3 వేల మెట్రిక్ టన్నుల డీఏపీ అందుబాటులో ఉంది.
లాభసాటి పంటలపై అవగాహన..
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని 79 రైతు వేదికల్లో వారానికి రెండుసార్లు రైతులతో సమావేశాలు నిర్వహిస్తున్నాం. ఈ సమావేశాల్లో మండల వ్యవసాయాధికారులు, విస్తరణాధికారులు లాభసాటి పంటల సాగు, ఎరువుల వాడకం, సాగులో మెళకువలు, యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. అలాగే స్థానిక వ్యవసాయాధికారులు, ఆసక్తి కలిగిన రైతులను ఎంపిక చేసి క్షేత్రస్థాయి ప్రదర్శనలకు తీసుకెళ్తున్నారు. ప్రస్తుత సీజన్లో రైతులు ఎక్కువగా పత్తి, కంది, ఇతర వాణిజ్య పంటలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహిస్తున్నాం.
– అంజి ప్రసాద్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, నిర్మల్