కుమ్రం భీం ఆసిఫాబాద్/మంచిర్యాల, జూలై 23 (నమస్తే తెలంగాణ) : పొద్దుగాల ఏడింటికి అడ్డా మీదికి రావడం.. కూలీ దొరుకుతుందో.. లేదోనని ఎదురుచూడడం.. ఎవరైనా వస్తే ‘పని ఉందా సారూ’ అని ఆశగా అడగడం.. ఒకవేళ కైకిలి దొరికితే వచ్చిన డబ్బులతో ఇంటికి సరుకులు తీసుకెళ్లడం. లేదంటే పదింటి దాకా ఎదురుచూసి నిరాశతో తిరిగి వెళ్లడం.. ఇది అడ్డామీది కూలీల దీనావస్థకు నిదర్శనం.. ఇలాంటి నిరుపేదలపై కేంద్ర సర్కారు జీఎస్టీ పేరిట మోయలేని భారం మోపుతున్నది. గొడ్డు చాకిరీ చేసినా పెరిగిన ధరలతో ఒక్కపూటా కడుపు నింపుకోలేక పోతున్నామని.. బీజేపీ సర్కారుకు మూడిందని.. తగిన గుణపాఠం చెప్పి తీరుతామని వారు హెచ్చరిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న జీఎస్టీ.. అన్ని వర్గాలనూ ఆర్థికంగా దెబ్బతీస్తున్నది. ముఖ్యంగా రోజూ వారీ అడ్డా కూలీలపైనా తీవ్ర ప్రభావం చూపిస్తున్నది. అసలు ఏ రోజు పని దొరుకుతుందో.. లేదో కూడా తెలియని వారి బతుకులు అగమ్య గోచరంగా మారుతున్నాయి. పొద్దంతా కష్టపడితే వచ్చే సొమ్ము ఆ రోజు గడవడానికి సరిపోని పరిస్థితి నెలకొందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనికి దొరికితేనే నాలుగు వేళ్లు నోట్లోకి వెళ్లేది. నిత్యావసరాలపై పన్ను విధించడంతో వారి పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా తయారైంది. మోదీ సర్కారు బతికి ఉంటే కూడా లైఫ్ ట్యాక్స్ పేరిట పన్నులు వసూలు చేస్తుందేమోనని వారు ఆందోళన చెందుతున్నారు. చాలీ చాలనీ డబ్బులతో ఒక పూట తింటూ, మరో పూట పస్తులుంటున్నామని, జీఎస్టీ రూపేనా రక్తం తాగుతున్న బీజేపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని, ఇగ బీజేపీ సర్కారుకు మూడిందంటూ శాపనార్థాలు పెడుతున్నారు.
మా అసొంటోళ్ల పొట్టగొట్టవట్టే..
మంచిర్యాల అర్బన్, జూలై 23 : మాది రెక్కాడితేగాని డొక్కాడని కుటుంబం. రోజూ భార్యా భర్తలిద్దరం కూలీ పనికి పోతాం. ఇద్దరం కష్ట్టపడితే నెలకు రూ. ఏడెనిమిది వేలస్తయి. ఒక్కో రోజు కూలే దొరకదు. టిఫిన్ పట్టుకొని ఇంటికి పోతం. ఇద్దరు పిల్లలను పోషించడం కోసం అష్టకష్టాలు పడుతుంటే గీ మోదీ మమ్ముల అరిగోస పెడుతున్నడు. పాలు, ఉప్పు, పప్పుల మీద పన్నులు పెంచుకుంటూ పోతే ఇగ బతుకుడెట్లా. ఉన్నోళ్ల దగ్గర కొట్టాలె గాని.. మా అసొంటోళ్ల పొట్టకొడితే ఏం వస్తది. ఎప్పుడు పైకి సూడకుండా కిందికి సూత్తే మాలాంటోళ్ల కష్టాలు తెలుస్తయ్.
– బొమ్మినేని నగేశ్, అడ్డా కూలీ,తిలక్ నగర్, మంచిర్యాల
రోగమో.. నొప్పో వస్తే అంతే..
మంచిర్యాల అర్బన్, జూలై 23 : కేంద్ర సర్కారోళ్లు సరుకులన్నింటిపైనా జీఎస్టీ విధిస్తున్నరు. పొద్దంత కష్టపడతే వచ్చే సొమ్ములతో ఒక్క పూట గడుస్తలేదు. ఇగ రోగమో.. నొప్పో వస్తే ఇగ సచ్చుడేనా మరి. పేదోళ్లను ఆదుకోవాల్సింది పోయి సంపుక తింటున్రు. ఇప్పటికే చాలా ఇబ్బందులు పడుతున్నం. జీఎస్టీ పేరిట మాలాంటి పేదోళ్ల పొట్టగొడుతున్నరు. ఇకనైనా ధరలు తగ్గించాలి.
– సిద్ధం సురేశ్, కూలీ, తిలక్‌నగర్, మంచిర్యాల
నమ్మి ఓటేస్తే నడ్డి విరుస్తున్నరు
తాండూర్, జూలై 23 : నేను కూలీ పనికి పోత. లారీల నుంచి కంకరను దింపితే రూ. 600 దాకా ఇస్తరు. ఇలా ప్రతి రోజూ పని దొరకదు. నెలంతా కష్టపడితే వచ్చేది రూ. ఐదారు వేలే. నా భార్య లక్ష్మి కూడా అప్పుడప్పుడు కూలీ పనులకు పోతది. మాకు ఇద్దరు కొడుకులు. గీ పెరిగిన ధరల వల్ల ఇల్లు గడవడమే కష్టం. ఇప్పటికే కరోనాతో మస్తు ఇబ్బందులు పడ్డం. ఈ కష్టాలు చాలవన్నట్లు మళ్లా పాలు, పెరుగు, బియ్యం, నూనె, పప్పుల ధరలు పెంచి మమ్ముల ఆగం చేస్తున్నరు. జీఎస్టీని ఎత్తివేయకుంటే బీజేపీకి పుట్టగతులుండవు. బీజేపీని నమ్మి ఓటేస్తే ప్రజల నడ్డి విరుస్తున్నరు.
– ఏరుకట్ల మల్లయ్య, అడ్డా కూలీ, తాండూర్
ఒక్కపూట కడుపు నింపుకోవడానికే..
ప్రతి రోజూ ఆసిఫాబాద్‌లోని అడ్డామీదికి పోత. దేవుని దయ వల్ల కైకిలి దొరికితే రూ. 150 నుంచి రూ. 200 దాకా వస్తయి. పని దొరికిన రోజు వచ్చే డబ్బులతో ఇంటికి కావాల్సిన సరుకులు కొనుక్కొని తీసుకెళ్తా. ఇది వరకు ధరలు తక్కువగా ఉండే. గిప్పుడు గదేదో జీఎస్టీ అని నూనెలు, బియ్యం, పప్పుల ధరలు అమాంతం పెంచిన్రు.
– అరుణ, కూలీ, ఆసిఫాబాద్