కుమ్రం భీం ఆసిఫాబాద్/మంచిర్యాల, జూలై 22 (నమస్తే తెలంగాణ) : చాలీచాలని వేతనాలతో బతుకీడుస్తున్న చిరు ఉద్యోగులపై బీజేపీ సర్కారు పెనుభారం మోపుతున్నది. పన్నుల మీద పన్నులతో చుక్కలు చూపిస్తున్నది. జీఎస్టీ విధానంతో జ్వరమొస్తే వేసుకునే పారాసిటమాల్ గోలి మొదలు.. కాలి చెప్పుల దాకా రేట్లు రెండింతలై పోగా, బతకడం గగనమైపోతు న్నది. ముఖ్యంగా ప్రైవేట్ కంపెనీలు, పాఠశాలలు, దుకాణాల్లో పనిచేసే వేతన జీవులను ధరాఘాతం బాధిస్తుంటే, మరో వైపు వరుస పన్నుపోట్లతో ఏ క్షణంలో తాము పనిచేసే సంస్థ మూతపడిపోతుం దోనన్న బెంగ మరింత వేధిస్తున్నది.
కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న జీఎస్టీ.. చిరుద్యోగులకు మోయలేని భారంగా మా రింది. సామాన్యులు వినియోగించే ప్రతి వస్తువుపై నా కేంద్రం పన్నులు విధించి వసూళ్లు చేస్తుండడం తో చిన్న చిన్న వేతనాలతో బతికే చిరుద్యోగులు ఆర్థికంగా చితికిపోతున్నారు. రాష్ట్ర సర్కారు ఉద్యోగాలు ఇచ్చి ఉపాధి కల్పిస్తుంటే, కేంద్రం మాత్రం నిత్యావసర సరుకులపై ఎడాపెడా పన్నులు విధిస్తూ తమను దోచుకుంటుందని వారు ఆవేదన చెందుతున్నారు.
పేదలపై పెనుభారం..సగటు మనిషి రోజువారీగా ఉపయోగించే వాటిపై కేంద్రం పన్నులు వేస్తుండగా, ఇంటి బడ్జెట్ తలకిందలవుతున్నది. సామాన్యుడికి మేలు చేసేందుకు జీఎస్టీని తీసుకొస్తున్నట్లు ఐదేండ్ల క్రితం ప్రధాని మోదీ ప్రకటించారు. ధాన్యాలు, పెరుగు, లస్సీవంటి వాటికి మినహాయింపు ఇస్తామని చెప్పారు. కానీ దేన్నీ వదలట్లేదు. ఉప్పు.. పప్పు, పాలు, పెరుగు, ఎల్ఈడీ బ ల్బులు.. ఇలా కాదేదీ జీఎస్టీకి అనర్హం అన్నట్లు మోదీ ప్రభుత్వం పనిచేస్తున్నది. 99 రకాల నిత్యావసర వస్తువులపై 5 నుంచి 18 శాతం జీఎస్టీ విధించడంతో సామాన్యుడి జీవితం అగమ్యగోచరంగా మా రింది.
ఇక ప్రైవేట్ కంపెనీలు, పాఠశాలలు, దుకాణాల్లో పనిచేస్తూ జీవితాన్ని గడుపుతున్న చిరు ఉద్యోగులను ఓ వైపు ధరాఘాతం బాధిస్తుంటే, కేంద్ర ప్రభుత్వం వరుస జీఎస్టీ పన్నులతో ఏ క్షణంలో తాము పనిచేసే సంస్థ మూతపడిపోతుందోన్న బెంగ మరో వైపు అతలాకుతలం చేస్తున్నది. ప్రాణాంతక వ్యాధులను నివారించే మందుల నుంచి మొదలుకొని.. కాలి చెప్పుల దాకా జీఎస్టీ విధిస్తుండడంతో, ఆయా కంపెనీలు, దుకాణాలు, షోరూమ్ల యజమానులు ఆర్థిక భారం నేపథ్యంలో ఏ క్షణంలో తమ ను ఉద్యోగం నుంచి తీసేస్తారోనన్న అయోమయ స్థితిలో కొట్టుమిట్టుడాతున్నామని చిరు ఉద్యోగులు చెబుతున్నారు.
బతకలేని పరిస్థితి..
బెల్లంపల్లి రూరల్, జూలై 22 : నా పేరు బొజ్జపల్లి సతీశ్. నేను బెల్లంపల్లి తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల కళాశాలలో తాత్కాలిక పద్ధతిపై గేట్ వాచ్మెన్గా పని చేస్తున్న. నా జీతం రూ. 14 వేలు. కుటుంబ ఖర్చులు, పిల్లల చదువులు అన్నీ అందులోనే. తినే పదార్థాలతో పాటు కుటుంబానికి అవసరమయ్యే ప్రతీ వస్తువుపైనా విపరీతంగా జీఎస్టీ విధిస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం నిత్యావసరాలపై వస్తు సేవల పన్ను (జీఎస్టీ)ని విధిస్తూ సామాన్యులు, పేద, మధ్య తరగతి ప్రజలను బతకలేని పరిస్థితికి దిగజారుస్తుంది. దేశ సంపదను కార్పొరేట్ సంస్థలకు దోచిపెడుతూ.. చిరు ఉద్యోగులపై పన్నుల భారాన్ని మోపుతున్నది. కరోనాతో ఆర్థికంగా చితికిపోయిన సామాన్య ప్రజలకు, ఉద్యోగులకు పెరుగుతున్న పన్నులు గుదిబండగా మారాయి. ఇప్పటికైనా పేదల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని నిత్యావసర వస్తువులపై విధిస్తున్న జీఎస్టీ పన్నును తక్షణమే ఉపసంహరించుకోవాలి.
రాష్ట్ర ప్రభుత్వం జీతమిస్తే..కేంద్రం దోచుకుంటంది
రాష్ట్ర ప్రభుత్వం ఔట్ సోర్సింగ్ ద్వారా మాలాంటి వారికి ఉపాధి కల్పించి వేతనాలు ఇస్తుం టే కేంద్ర ప్రభుత్వం మాత్రం పన్నుల రూపంలో దోచుకుంటుంది. పెరిగిన ధరలతో జీతం సరిపోని పరిస్థితి ఉంది. పన్నుల భారం మోయలేక పోతున్నాం. ప్రతి నెలా అప్పులు చేయాల్సి వస్తుంది. గీ బీజేపీ సర్కారోళ్లు మాలాంటోళ్లను బతుకనిస్తరో లేదో మరి. ఇకనైనా మా బాధలను అర్థం చేసుకొని పెంచిన ధరలన్నీ తగ్గించాలి. – ఆత్రం సుజాత, ఝరి పాఠశాల, కుక్
గీ కక్కుర్తి ఏమిటో..
తెలంగాణ ప్రభుత్వం మాలాంటోళ్లకు ఉద్యోగాలిచ్చి ఆదుకుంటుంటే.. కేంద్ర సర్కారోళ్లు మామ్ముల గోస పెడుతున్నరు. ఝరి పాఠశాలలో ప్రతి రోజూ వంట చేస్త. వచ్చే జీతంతో కుటుంబాలను వెళ్లదీసుకస్తున్నం. ఇప్పుడు బీజేపీ సర్కారోళ్లు నూనెలు, ఉప్పు, పప్పు. పాలు, పెరుగు.. గిట్లా అన్నింటి మీద జీఎస్టీ విధిస్తున్నారు. ఏది కొందామన్నా ధరలు మండిపోతున్నాయి. బతుకు చాలా కష్టమవుతుంది. చిన్న పిల్లలు తినే వాటిమీద కూడా కక్కుర్తి పడుతున్నారు. ఈ ఐదేళ్లలో ధరలు డబుల్ అయినయ్. ఇంకా మున్ముందు ఎట్లుంటదో ఏమో. ఇలా అయితే బతకడం కష్టమే..
– కుర్సింగ దీపక్, కుక్, ఝరి పాఠశాల
ధరలు పెంచితే బతుకుడెట్లా..!
మంచిర్యాల అర్బన్, జూలై 22 : నేను దేవాపూర్ నుంచి వచ్చి మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ బట్టల దుకాణంలో పనిచేస్తున్న. నెలకు రూ. 6 వేల జీతం ఇస్తున్నారు. ఈ డబ్బులతో ఇద్దరు కొడుకులను పోషించుకుంటున్న. కేంద్రం ఇలా నిత్యావసర ధరలు పెంచితే బతకడం ఎలా. ఏ ప్రభుత్వం కూడా పాలపై పన్ను విధించింది లేదు. రాష్ట్ర ప్రభుత్వం పథకాల రూపంలో పేద, మధ్య తరగతి ప్రజలకు అండగా ఉంటుంటే, కేంద్ర ప్రభుత్వం మాత్రం ధరలు పెంచి బతుకలేని పరిస్థితి తీసుకొచ్చింది.
– ఇందూ దేవి, దేవాపూర్, కాసిపేట