భారీ వర్షాలకు జరిగిన నష్టాలపై శాఖల వారీగా సర్వే చేసి నివేదికలు అందజేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తాపట్నాయక్ అధికారులకు సూచించారు. ఇంద్రవెల్లి మండలం దస్నాపూర్, హర్కాపూర్తండా గ్రామాల్లో బ్రిడ్జి, కల్వర్టులను గురువారం ఆమె పరిశీలించారు. మరమ్మతులతో పాటు నిర్మాణాలపై సంబంధిత శాఖల అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. వర్షాల కారణంగా జరిగిన వివిధ నష్టాలపై పరిశీలన చేసేందుకు కేంద్రం నుంచి ప్రత్యేక బృందం శుక్రవారం జిల్లాకు రానుందని తెలిపారు. అన్ని శాఖలకు చెందిన అధికారులు పూర్తి వివరాలతో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆమె వెంట అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, తహసీల్దార్ సోము, పీఆర్ డీఈ రమేశ్, డిప్యూటీ తహసీల్దార్ రమేశ్, సర్పంచ్‌లు సేవంతబాయి, పార్వతీబాయి ఉన్నారు.
రోడ్ల నష్టం నివేదికను పంపాలి
వరదలతో దెబ్బతిన్న రోడ్లు, బ్రిడ్జిలు, వంతెనల నష్టం వివరాల నివేదికను పంపాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తాపట్నాయక్ ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు. మండల కేంద్రంలోని సిరిచెల్మ రోడ్డు మార్గంలో తెగిపోయిన వంతెన ప్రాంతాన్ని జిల్లా అధికారులతో కలిసి ఆమె పరిశీలించారు. అనంతరం దుబార్‌పేట గ్రామాన్ని సందర్శించారు. ఆమె వెంట ఆర్డీవో రాథోడ్ రమేశ్, తహసీల్దార్ రాథోడ్ మోహన్‌సింగ్, డిప్యూటీ తహసీల్దార్ జాదవ్ రామారావ్, ఆర్అండ్బీ ఎస్ఈ సురేశ్, డీఈ సునీల్, దుబార్‌పేట గిరిజనులు ఉన్నారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన వరద ప్రభావిత ప్రాంతాలు కుంటాల, వెంకటాపూర్, మాదాపూర్, కుమారి, కుప్టి, సావర్గాం గ్రామాల్లో గురువారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ పర్యటించారు. కడెం వాగు ఉధృతితో పంటలు దెబ్బతిన్నాయని రైతులు కలెక్టర్‌కు వివరించారు. వరదలతో పంటలు నష్టపోయామని వాపోయారు. సావర్గాం గ్రామ సమీపంలో వాగు చిన్న వర్షానికే రోడ్డుపై పారుతుండడంతో 14 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో జేడీఏ పుల్లయ్య, ఎంపీపీ రాథోడ్ సజన్, తహసీల్దార్ పవన్‌చంద్ర, ఎంపీడీవో అబ్దుల్సమద్, ఏవో భాస్కర్, ఆర్ఐ నాగోరావ్, సర్పంచ్‌లు రాజుయాదవ్, విశాల్‌కుమార్, కుమారి పీఏసీఎస్ చైర్మన్ మందుల రమేశ్, టీఆర్ఎస్ మండల కన్వీనర్ శివారెడ్డి, నాయకులు గడ్డం భీంరెడ్డి, ఉపసర్పంచ్ నరేశ్‌రెడ్డి, గ్రామాల రైతులు పాల్గొన్నారు.