ఆదిలాబాద్ రూరల్, జూలై 20: పట్టణంలోని పదపో వార్డు రాంనగర్‌కు చెందిన బీజేపీ కౌన్సిలర్ సుజాత ఎమ్మెల్యే జోగు రామన్న ఆధ్వర్యంలో టీఆర్ఎస్లో చేరారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమెతో పాటు భర్త భూమన్న గులాబీ కండువాలు కప్పుకుని పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ బీజేపీతో దేశానికి ఒరిగిందేమీ లేదన్నారు.
అన్ని రంగాల్లో తెలంగాణపై వివక్ష చూపుతూ అభివృద్ధి నిరోధకులుగా నిలుస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలుస్తుందని తెలిసే బీజేపీ నాయకులు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. పార్టీలతో సంబంధం లేకుండా పట్టణంలో చేస్తున్న అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు అజయ్, కౌన్సిలర్లు సంద నర్సింగ్, జాదవ్ పవన్ నాయక్, పండ్ల శ్రీనివాస్ ,మహిళా విభాగం నాయకులు సుజాత, స్వరూప, ఏవన్, ప్రశాంత్ పాల్గొన్నారు.
రైతులను ఆదుకుంటాం..
తాంసి/ఆదిలాబాద్ రూరల్, జూలై 20: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. బుధవారం పట్టణంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో విక్రాంత్ కంపెనీ ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. సోయాకు ఎకరాకు రూ.5వేల పరిహారాన్ని చెల్లించడానికి కంపెనీ ప్రతినిధులు ముందుకు వచ్చారని తెలిపారు. కంపెనీ వారు ఇచ్చి విత్తనాలు వేసి పంట వేసి నష్టపోయిన రైతులు ఏవో, ఏఈవోలను సంప్రదించాలని సూచించారు. డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, వ్యవసాయ శాఖాధికారి పుల్లయ్య, ఏడీఏ రమేశ్, శాస్త్రవేత్త శ్రీధర్ చౌహాన్, ఏవో శివకుమార్ పాల్గొన్నారు.