నార్నూర్, జూలై 20: భారీవర్షాలతో తలెత్తిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానాన్ని ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. బుధవారం గాదిగూడ మండలంలోని రోమాన్కసా, భూయిలీకాసా, మేడిగూడ, బొడ్డిగూడ, పూనగూడ, చిత్తగూడ, ఖడ్కి, లోకారి(కే) ప్రధాన రహదారులపై కోతకు గురైన కల్వర్టులు, పంట పొలాలను పరిశీలించారు. ఎమ్మెల్యే ఆత్రం సక్కు సహకారంతో కల్వర్టులను మరమ్మతు చేయిస్తామని తెలిపారు.
అనంతరం ఝరి ఆశ్రమ ఉన్నత బాలుర పాఠశాలలను పర్యవేక్షించారు. విద్యార్థుల సామర్థ్యాలు, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యాప్రమాణాలు పెంచాలని, రుచికరమైన భోజనం వడ్డించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఉపాధ్యాయులు పాఠశాల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లగా పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. అనంతరం ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. మేడిగూడలో తెలంగాణ సాంస్కృతిక సారిథి కళా బృంధం ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధులపై కళాజాతం నిర్వహించగా జడ్పీ చైర్మన్ పాల్గొన్నారు.
కార్యక్రమంలో ఎంపీపీ చంద్రకళ-రాజేశ్వర్, జడ్పీటీసీ మెస్రం గంగుబాయి-సోము, వైస్ ఎంపీపీ యోగేశ్, పీఆర్ ఏఈ జాడి లింగన్న, కోఆప్షన్ సభ్యుడు జాండే బా బు, ఎంపీడీవో రామేశ్వర్, ఎంపీవో షేక్ ఖలీంహైమద్, సర్పంచ్ కొడప మోతుబాయి జాకు, ప్రధానోపాధ్యాయుడు కోట్నాక్ రాజేశ్వర్, జీవ వైవిధ్య కమిటీ జిల్లా సభ్యుడు మర్సుకోల తిరుపతి, ఉపాధ్యాయులు, నాయకులు, కళాకారులు రమేశ్, వెంకట్రావ్, ఆత్రం గోవింద్‌రావ్, రవీందర్, రాజలింగు, మోహన్‌నాయక్, శంకర్, ఆశిష్, పురుషోత్తం, నర్సమ్మ ఉన్నారు.
యువకుల మరణం కలిచివేసింది
ఉట్నూర్, జులై 20: కుమ్మరితండా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుల మరణించడం కలిచివేసిందని జడ్పీచైర్మన్ రాథోడ్ జనార్ధన్ అన్నారు. బుధవారం ప్రభుత్వ దవాఖానలో ముగ్గురు యువకులు మృతదేహాల వద్ద రోదిస్తున్న కుటుంబీకులను పరామర్శించారు. పట్టణానికి చెందిన ముగ్గురు యువకులు ఒకేసారి చనిపోవడం చాలా బాధకరమన్నారు. మృతదేహాలకు తొందరగా పంచనామా చేసి కుంటుంబీకులకు అప్పగించాలని వైద్యులకు సూచించారు. ఆయన వెంట నాయకులు ఉన్నారు.