నిర్మల్ అర్బన్, జూలై 20: సంఘ విద్రోహ శక్తులపై నిరంతరం నిఘా ఉంచాలని నిర్మల్ ఎస్పీ సీహెచ్ ప్రవీణ్ కుమార్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో నెలవారీ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో పెండింగ్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సమగ్ర విచారణ చేపట్టి చట్టపరంగా నేరస్తులకు శిక్ష పడేలా కృషి చేయాలని ఆదేశించారు.
వాహనదారులకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించాలన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో నిత్యం డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు నిర్వహించాలని తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు.
ఎవరైనా సైబర్ నేరాల బారిన పడి నగదు కోల్పోతే వెంటనే ఫిర్యాదు చేసేలా జిల్లా ప్రజలందరికీ అవగాహన కల్పించాలన్నారు. నేరాలు జరిగే, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రదేశాలు గుర్తించి పాయింట్ బుక్స్ ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రాంరెడ్డి, భైంసా ఏఎస్పీ కిరణ్ ఖారే, డీఎస్పీ జీవన్ రెడ్డి, సీఐలు రమేశ్, మహేందర్, కుమారస్వామి, శ్రీనివాస్, వెంకటేశ్, ప్రవీణ్ కుమార్, రాంనర్సింహారెడ్డి, వినోద్ అజయ్‌బాబు, ఎస్ఐలు పాల్గొన్నారు.