ఆదిలాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) ;ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను వారం రోజుల పాటు కుండపోత వర్షాలు అతలాకుతలం చేశాయి. రహదారులు, డ్రెయినేజీలు, ఇండ్లలోకి చెత్తాచెదారం కొట్టుకొచ్చింది. ఫలితంగా పల్లెలు, పట్టణాల్లో అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. మూడు రోజులుగా వర్షాలు, వరదలు తగ్గుముఖం పట్టడంతో సర్కారు పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టిసారించింది. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉండడంతో అధికారులను అప్రమత్తం చేసింది. పంచాయతీ, వైద్య, మున్సిపల్ శాఖ సిబ్బంది ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు కార్యచరణ రూపొందించి అమలు చేస్తున్నారు. ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. జ్వరపీడితులను పరీక్షిస్తూ ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నారు. సీజనల్ వ్యాధులు, కీటకజనిత రోగాలు, కలుషిత నీరు, ఆహారం ద్వారా అంటువ్యాధులు ప్రబలకుండా విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. కలెక్టర్లు, డీఎంహెచ్వోలు, అధికారులు, ప్రజాప్రతినిధులు పర్యటిస్తూ భరోసా ఇస్తున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా భారీ నష్టం సంభవించింది. వరదల కారణంగా పంటలు నీట మునిగిపోగా, ఇండ్లు కూలిపోయాయి. వాగులు, వంకలు పొంగడంతో పలు గ్రామాల్లో రోడ్లు తెగిపోయాయి. వర్షాల కారణంగా గ్రామాల్లో అపరిశుభ్రమైన వాతావరణం నెలకొంది. నీటి గుంటల్లో నీరు నిల్వ ఉండడం, మురుగు కాలువల్లో చెత్తాచెదారం పేరుకుపోవడం ఇతర సమస్యలు నెలకొన్నాయి. దీంతోపాటు గ్రామాల్లో ఈగలు, దోమల బెడద అధికమైంది.
వర్షాల వల్ల ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా అధికారులు అప్రమత్తమయ్యారు. పంచాయతీ, మున్సిపల్, వైద్య, రెవెన్యూశాఖల అధికారులు పారిశుధ్య కార్యక్రమాలు, వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. పల్లెలు, పట్టణాల్లో అధికారులు, సిబ్బంది విస్తృతంగా పారిశుధ్య కార్యక్రమాలు చేపడుతున్నారు. తాగునీటి వనరుల్లో కొత్తనీరు చేరడంతో బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నారు.
మురుగు కాల్వలను శుభ్రం చేయడంతోపాటు, ప్రజలు తమ ఇండ్ల పరిసరాల్లో ఈగలు, దోమలు వృద్ధి చెందకుండా అవగాహన కల్పిస్తున్నారు. పంచాయతీల ట్రాక్టర్లో ఇండ్ల నుంచి ఎప్పటికప్పుడు చెత్తను సేకరిస్తున్నారు. వర్షాల కారణంగా డయేరియా, మలేరియా, టైఫాయిడ్, కలరా వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉండడంతో వైద్యశాఖ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సీజనల్ వ్యాధులు రాకుండా గ్రామాల్లో వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి స్థానికులకు అవసరమైన చికిత్సలు అందిస్తున్నారు.
జ్వర సర్వే నిర్వహిస్తూ పల్లెల్లో అనారోగ్యం బారిన పడిన వారికి మెరుగైన చికిత్సలు అందిస్తున్నారు. ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నారు. మారుమూల ప్రాంతాలు, రోడ్ల సౌకర్యం సరిగా లేని గ్రామాల్లో గర్భిణులను ముందుస్తుగా దవాఖానలకు తరలిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 60 గ్రామాలను గుర్తించిన వైద్యశాఖ అధికారులు గర్భిణులు డెలివరీకి ముందుగానే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బర్త్ వెయింటింగ్ రూంలకు తీసుకెళ్లి ప్రసవం అనంతరం వారిని తిరిగి ఇంటికి పంపిస్తున్నారు. కాగా. పంచాయతీరాజ్, మున్సిపల్‌శాఖల అధికారులు క్షేత్రస్థాయి సిబ్బందికి రాష్ట్రస్థాయి అధికారులు మార్గదర్శకాలు కూడా జారీ చేశారు. హెల్ప్‌లైన్స్ కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.