ఉట్నూర్ రూరల్, జూలై 19 : ఉట్నూర్ మండలంలోని కుమ్మరితండా సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉట్నూర్ పట్టణంలోని మొమిన్పూర కాలనికి చెందిన షహబాజ్(28), లక్కారంకు చెందిన గాయక్వాడ్ రవి(31) ఇద్దరు(టీఎస్01ఈ00358గల ద్విచక్రవాహనంపై ఆదిలాబాద్‌కు వెళ్లి పనులు చేసుకొని తీరిగి ఉట్నూర్‌కు వస్తున్నారు.
ఉట్నూర్‌లోని శాంతినగర్ కాలనికి చెందిన రాథోడ్ మౌను(20), ఐటీడీఏ క్వాటర్స్‌లో నివాసం ఉండే అర్క ఆశిష్ అనే ఇద్దరు స్నేహితులు కలిసి ద్విచక్రవాహనం(టీఎస్01ఈజే6756)గల వాహనంపై ఉట్నూర్ నుంచి ఆదిలాబాద్ వైపు వెళ్తున్నారు. మండలంలోని కుమ్మరితండా గ్రామ సమీపంలో రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుంగా బలంగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో రాథోడ్ మౌను, రవి, షహాబాజ్లు ముగ్గురు యువకులు సంఘటన స్థలంలోనే మృతి చెందారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ అర్క ఆశిష్ పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన వైద్యం కోసం 108తో జిల్లా కేంద్రం రిమ్స్‌కు తరలించారు.
ఇరు కుటుంబాల్లో మిన్నంటిన రోదనలు
ఉట్నూర్ పట్టణనికి చెందిన ముగ్గురు యువకులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఇరు కుటుంబాల్లో విషాదచాయలు చోటు చేసుకున్నాయి. మృతి చెందిన రవి, షహబాజ్, మౌను మృతదేహలను ఉట్నూర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న మృత్యుల బంధువులు, స్నేహితులు, పలు పార్టీల నాయకులు దవాఖానకు తరలివచ్చారు. మృతదేహలను చూసి బోరుమని విలపించారు. మాజీ ఎంపీ రాథోడ్ రమేష్, జడ్పీటీసీ రాథోడ్ చారులత, ఉట్నూర్ సీఐ సైదారావ్, ఎస్ఐ భరత్ సుమన్ మృతదేహలను పరిశీలించారు. మృత్యుడు షహబాజ్ స్థానికంగా కంప్యూటర్ సెంటర్ నిర్వహిస్తూ కుటుంబానికి ఆసరగా ఉంటున్నాడు.
అదే విధంగా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ పట్టణ అధ్యక్షుడుగా పని చేస్తున్నాడు. తన స్నేహితుడైన రవి కూడా స్థానిక అంబేద్కర్ చౌక్‌లో పెయింట్ దుకాణం నిర్వహిస్తున్నాడు. రవికి గత నాలుగైదు నెలల క్రితమే వివాహం జరిగింది. అర్క ఆశిష్ డిగ్రీ చదువుకుంటున్నాడు. ముగ్గురు యవకులు కుటుంబానికి చెదడువాదడుగా ఉండే సమయంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం పట్ట జీర్ణించుకోలేక పోతున్నారు. అందరితో కలిసి మెలసి ఉండే ముగ్గురు యువకులు మృతి చెందడంపై అందరు కన్నీరు పెట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.