ఎదులాపురం, జూలై 19: ఇటీవల జరిగిన హత్య కేసులో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఆదిలాబాద్ వన్‌టౌన్‌లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో డీఎస్పీ ఉమేందర్ వివరాలు వెల్లడించారు. ఆదిలాబాద్ పట్టణంలోని విద్యానగర్‌కు చెందిన గుడ్ల సావిత్రి (రిటైర్డ్ టీచర్) కుమారుడు గుడ్ల సాయికుమార్ (31) ఈ నెల 13న రాత్రి 9 గంటలకు కాకతీయ బార్‌కు వెళ్లాడు. అక్కడ అతడికి ప్రీతమ్ అనే యువకుడు పరిచయమయ్యాడు. తాను గంజాయి డాన్‌నని ప్రీతమ్ పరిచయం చేసుకున్నాడు. తరువాత అదే రోజు రాత్రి వీరిద్దరూ దేవీబార్ కౌంటర్ వద్ద తారసపడ్డారు. ఇద్దరూ మద్యం మత్తులో ఉన్నారు. ప్రీతమ్ గంజాయి అమ్మి అందరి ఆరోగ్యాలు, భవిష్యత్తు చెడగొడుతున్నాడని సాయికుమార్ తన మిత్రుడు అస్వద్తో అన్నాడు. దీంతో ఆగ్రహించిన ప్రీతమ్ సాయికుమార్‌ను బూతులు తిట్టాడు. బయటకు రా నీ సంగతి చూస్తా అని బెదిరించాడు. ఈ క్రమంలో భయపడిన సాయికుమార్ గేటు తీసుకుని బార్ బయటకు వెళ్లాడు.
ఆ వెనుకనే వచ్చిన ప్రీతమ్ తన వద్ద ఉన్న కత్తితో సాయికుమార్‌ను పొడిచాడు. స్థానికులు సాయికుమార్‌ను రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. అక్కడ ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలు, ప్రత్యక్ష సాక్షులను విచారించిన పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. జిల్లా కేంద్రంలోని అన్ని బార్లు, వైన్సులపై ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్‌కుమార్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు. ఎక్సైజ్ అధికారులతో సమన్వయం చేస్తూ ఆకస్మికంగా తనిఖీలు చేస్తామన్నారు. అర్ధరాత్రి వరకు బార్లు తెరిస్తే చట్టపరంగా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అన్ని బార్లు, వైన్సు షాపుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమావేశంలో వన్‌టౌన్ సీఐ సురేందర్ ఉన్నారు.