భైంసా, జూలై 19 : వరద బాధితులను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని మాజీ ఎమ్మెల్యే వేణుగోపాలాచారి భరోసానిచ్చారు. మంగళవారం పట్టణంలోని విశ్రాంతి భవనంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాటాడారు. నిర్మల్ జిల్లాలో అత్యధిక వర్షాలు వచ్చి తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. భైంసా పట్టణంలో ఆటోనగర్, రాహుల్‌నగర్, బట్టీగల్లీలో తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయని చెప్పారు. ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి సహకారంతో బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. రాహుల్ నగర్లో హైలెవల్ బ్రిడి, సుద్దవాగు కెనాల్ ఆర్సీసీకి ప్రతిపాదనలు పంపించామని చెప్పారు.
భైంసా పట్టణంలో తాత్కాలిక మరమ్మతులకు రూ. 5 కోట్లు మంజూరు చేయాలని అధికారులు ప్రభుత్వానికి నివేదించారని గుర్తు చేశారు. జిల్లాలో పెద్ద మొత్తంలో పంటలు దెబ్బతిన్నాయని, రైతులకు పరిహారం అందేలా కృషి చేస్తామన్నారు. గుండేగాం ముంపు గ్రామానికి శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపడుతున్నామని, గ్రామస్తులు ఆందోళన చెందవద్దని సూచించారు. బాసర ట్రిపుల్ ఐటీలో ఇటీవల కలుషిత ఆహారంతో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని, ఇందుకు కారణమైన మెస్‌లపై కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు. నెల రోజుల క్రితం ట్రిపుల్ ఐటీ విద్యార్థులు తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరగా ఇప్పటికే ప్రభుత్వం రూ. 16 కోట్లు విడుదల చేసిందన్నారు. విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లను సైతం పంపిణీ చేశామని తెలిపారు. సమావేశంలో నాయకులు కొట్టె హన్మాండ్లు, దేవేందర్, శ్రీనివాస్, నర్సాగౌడ్, నరేందర్, రఘువీర్ ఉన్నారు.
అధైర్యపడొద్దు అండగా ఉంటాం..
లోకేశ్వరం, జూలై 19 : వరద బాధితులు అధైర్యపడొద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే వేణుగోపాలాచారి పేర్కొన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు లోకేశ్వరం రహదారి వంతెన కూలిపోవడంతో పాటు పుస్పూర్ నుంచి మాటేగాంకు వెళ్లే రహదారులు గుంతల మయంగా మారాయి. మంళవారం ఆయన మండలంలోని వంతెన, రహదారులు, పత్తి, సోయా పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంట నష్టపోయిన రైతులు అధైర్యపడొద్దని చెప్పారు. రైతులకు ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా చూస్తానని తెలిపారు. లోకేశ్వరం-అర్లి వంతెన శిథిలావస్థకు చేరిందని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే మరమ్మత్తులు చేయిస్తామన్నారు. ఇక్కడ సర్పంచ్ సంగెం నర్సయ్య, నాయకులు గన్ను నర్సారెడ్డి, తెలంగాణ శీను, కొట్టె హన్మాండ్లు, పీ దేవేందర్, ప్రభాకర్ స్వామి, నర్సప్ప, శ్రీనివాస్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు ఉన్నారు.
పరామర్శ
మండల కేంద్రానికి చెందిన వ్యాపారవేత్త కోస్లి వెంకట్రావు తల్లి కోస్లి సత్తెమ్మ ఇటీవల మృతి చెందారు. మాజీ ఎమ్మెల్యే సముద్రాల వేణుగోపాలాచారి మంగళవారం ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. పీఏసీఎస్ మాజీ చైర్మన్ చిన్నారావు, నాయకులు గన్ను నర్సారెడ్డి, వెంకట్రావు, విజయారావు, తెలంగాణ శీను, శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు.
టీఆర్ఎస్ నాయకుడికి..
భైంసాటౌన్, జూలై 19 : మాటేగాంకు చెందిన మధుసూదన్ రెడ్డికి ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో కాలు విరిగింది. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే వేణుగోపాలాచారి మంగళవారం ఆయనను పరామర్శించారు. అనంతరం గ్రామాభివృద్ధి గురించి గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు.