మంచిర్యాల, జూలై 18 (నమస్తే తెలంగాణ) : వారం పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల ప్రభావం కూరగాయలపైనా పడింది. వరదలకు వాగులు, వంకలు పొంగిపొర్లడం, రోడ్లు తెగిపోవడం వల్ల రవాణా వ్యవస్థ స్తంభించగా, ప్రస్తుతమున్న వాటికి రెట్టింపు చేసి విక్రయిస్తున్నారు. టమాట, కాకర, దొండ, బెండ, వంకాయలు.. ఇలా ఏది కొందామన్నా కిలో రూ.60 పైనే ఉండగా, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇంతకుముందు కిలోల కొద్ది కొన్నవారంతా ఇప్పుడు కొసిరి కొసిరి తీసుకుంటున్నారు.
వారం రోజులుగా ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాల ప్రభావం కూరగాయల ధరలపైనా పడింది. బయట నుంచి రవాణా నిలిచిపోవడంతో ప్రస్తుతమున్న వాటికి రెట్టింపు చేసి అమ్ముతున్నారు. జిల్లాకేంద్రంలోని రాంనగర్, ఎన్టీఆర్ నగర్, ఎల్ఐసీ కాలనీ, రెడ్డి కాలనీతో పాటు పలు వార్డుల్లోకి వరద వచ్చి చేరింది. దీంతో చాలా మంది పునరావాస కేంద్రాలకు తరలివెళ్లారు. వర్షం తగ్గడంతో తిరిగి ఇండ్లల్లో కి చేరుకుంటున్నా, శుభ్రం చేసుకునేందుకే సమ యం పడుతున్నది. మంచిర్యాల జిల్లాకేంద్రంతో పాటు గోదావరి పరివాహక ప్రాంతాలైన జన్నా రం, దండేపల్లి, లక్షెట్టిపేట, హాజీపూర్ కోటపల్లి, చె న్నూర్, భీమారం, జైపూర్, వేమనపల్లి, నెన్నెల వంటి మండలాలు సైతం నీటిలో చిక్కుకున్నాయి. పంటలు నీట మునిగాయి.
ఇండ్లలోని వస్తువులు నీటి ప్రవాహానికి కొట్టుకొని పోయాయి. ఆయా మండలాల ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులెదుర్కొంటున్నా రు. ఇదిలా ఉంటే వర్షం ప్రభావం ముఖ్యంగా నిత్యావసర వస్తువులు, కూరగాయాలపైనా పడింది. మహారాష్ట్రతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో పంటలు బాగా దెబ్బతిన్నాయి. ఆంధ్ర ప్రాంతంతో పాటు సిద్దిపేట, కరీంనగర్వంటి పట్టణాల నుంచి వచ్చే కూరగాయలపైనే మంచిర్యాల జిల్లా వాసులు ఆధారపడి ఉన్నారు. భారీ వర్షాలతో మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి, లక్షెట్టిపేట, మందమర్రి, నస్పూర్వంటి పట్టణాలకు వివిధ మార్గాల నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. వాగులు వంకలు పొంగి పొర్లడం, రోడ్లపైకి వరద రావడంతో రహదారులన్నీ ఎక్కడికక్కడ తెగిపోయి రవాణా స్తంభించింది. కూరగాయల మార్కెట్కు ఇత ర ప్రదేశాల నుంచి కూరగాయలు రాకపోవడంతో వ్యాపారులు ఉన్న వాటి ధరలు పెంచి విక్రయిస్తున్నా రు. వారం క్రితం ఉన్న కూరగాయల ధరలు రెట్టింపయ్యాయి. నిత్యావసర సరుకులపైనా ధరల ప్రభావం పడుతున్నది. సోమవారం వర్షం కాస్త తగ్గుముఖం పట్టడంతో మార్కెట్లో కొంత సందడి కనిపిస్తున్నది.
బయటి నుంచి వచ్చే పరిస్థితి లేక..
ఇటీవల విపరీతంగా కురిసిన వర్షాలకు చాలా ఇబ్బందయ్యింది. కూర్చుండే పరిస్థితి లేకపోవడం, మార్కెట్కు ప్రజలు కూడా ఎక్కువగా రాకపోవడంతో తిప్పలు పడ్డాం. కొన్ని కూరగాయలు, ఆకు కూరలు మురిగిపోయాయి. బయటి నుంచి వచ్చే పరిస్థితి లేకపోవడంతో గిట్టుబాటు కోసం ఉన్నవాటి ధరలను పెంచాల్సి వచ్చింది. – పీ శ్రీనివాస్, కూరగాయల వ్యాపారి, మంచిర్యాల