నిర్మల్, జూలై 18 (నమస్తే తెలంగాణ) : అంతరించిపోతున్న అడవులకు పునరుజ్జీవం పోయడం.. ఫల, ఔషధ మొక్కలు పెంచి ఆరోగ్యవంతమైన తెలంగాణగా మార్చాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమానికి అంకురార్పణ చేశారు. ఏడు విడుతలుగా నాటిన మొక్కలు ఏపుగా పెరిగి నీడ, ఫలాలను అందిస్తున్నాయి. పల్లెలు, పట్టణాలు, అటవీ ప్రాంతాలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. జూలై 1వ తేదీ నుంచి ఎనిమిదో విడుత హరితహారం ప్రారంభమైంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా యజ్ఞంలా సాగుతుండగా.. లక్ష్యాన్ని ఛేదించడానికి అన్ని శాఖలు సమన్వయంలో పనిచేస్తున్నాయి. ఇప్పటివరకు 28.60 లక్షల మొక్కలు నాటగా.. లక్ష్యాన్ని చేరే వరకు కార్యక్రమం కొనసాగనున్నది. పుడమికి ఆకుపచ్చ కిరీటాన్ని తొడగడంలో భాగంగా గ్రామీణాభివృద్ధి, అటవీశాఖలు భారీ లక్ష్యాలను నిర్దేశించుకుని ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నాయి.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా హరితహారం కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. వర్షాలు సమృద్ధిగా కురుస్తుండడంతో అధికారులు మొక్కలు నాటే ప్రక్రియను వేగవంతం చేశారు. డీఆర్డీఏ, అటవీ, ఎక్సైజ్, మున్సిపల్, మార్కెట్, పశుసంవర్ధక, పరిశ్రమలు, బీసీ వెల్ఫేర్, ఉద్యానవన, సింగరేణి ఆధ్వర్యంలో మొక్కలు నాటుతున్నారు. టేకు, శ్రీగంధం, వేప, నెమలినార, తుమ్మ, సోమి, నారేప, జిట్రేగి, వెదురు వంటి కలప నిచ్చే మొక్కలు.. జామ, నిమ్మ, అల్లనేరేడు, మునగ, దానిమ్మ, ఉసిరి, సీతాఫలం, బొప్పాయి వంటి పండ్ల మొక్కలు, రావి, మర్రి, బాదం, కానుగ, వేప, నెమలినార వంటి నీడ నిచ్చే చెట్లు.. గంగరావి, మల్లె, గుల్మోహర్, పారిజాతం, తబుబియా రోసియా, టెకోమ వంటి పూల మొక్కలు.. తెల్లమద్ది, మందార, గన్నేరు, ఈత, నందివర్ధనం వంటి ఇతరకాల మొక్కలను ఎంపిక చేశారు. వీటిని ప్రభుత్వ కార్యాలయాలు, ఖాళీ ప్రదేశాలు, ప్రధాన రహదారులకు ఇరువైపులా, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాల ఆవరణల్లో విరివిగా గుంతలు తీసి నాటుతున్నారు. ఎండిన మొక్కల స్థానంలో కొత్తవి పెడుతున్నారు. నాటిన మొక్కలను జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, పంచాయతీ, అటవీ శాఖల ఆధ్వర్యంలో సంరక్షించనున్నారు.
ఇప్పటివరకు 28.60 లక్షలు నాటింపు..
2022-23 సంవత్సరానికి గాను దాదాపు 2 కోట్ల మొక్కలు నాటేందుకు లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇందుకోసం భారీ స్థాయిలో అధికార యంత్రాంగం నర్సరీల్లో పెద్ద ఎత్తున మొక్కలు పెంచింది. ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నర్సరీలు ఏర్పాటు చేయగా, అటవీశాఖ కూడా మొక్కలను సిద్ధం చేసి ఉంచింది. అన్ని ప్రభుత్వ శాఖలకు లక్ష్యాలను నిర్దేశించించారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని 335 జీపీల్లో 34 లక్షల మొక్కల పెంపకాన్ని లక్ష్యంగా పెట్టుకోగా 3.60 లక్షలు నాటారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 468 గ్రామ పంచాయతీలు ఉండగా.. 47 లక్షలకు 9 లక్షలు.. నిర్మల్ జిల్లాలోని 396 జీపీల్లో 44.21 లక్షల మొక్కల పెంపకాన్ని లక్ష్యంగా పెట్టుకోగా 14 లక్షలు.. మంచిర్యాల జిల్లాలోని 310 జీపీల్లో 56.10 లక్షల మొక్కల పెంపకాన్ని పెట్టుకోగా 2 లక్షలు.. ప్రస్తుతానికి మాత్రం తొమ్మిది శాఖలు సమన్వయంతో పనిచేసి కొద్ది రోజులుగా కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
వారం రోజులు ఏకధాటిగా వర్షాలు కురియడంతో కొద్దిగా మందగించింది. అనుకున్న లక్ష్యాన్ని త్వరితగతిన పూర్తి చేసే దిశగా అన్ని శాఖలు చర్యలు తీసుకుంటున్నాయి. లక్ష్యం పూర్తి చేసేంత వరకు హరితహారం కొనసాగుతోంది. మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యతలను కూడా ఆయా శాఖలు తీసుకుంటున్నాయి. అలాగే మొక్కలకు నీరు పోసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. యేటా హరితహారంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న పకడ్బందీ చర్యలు ఆకుపచ్చ తెలంగాణకు బాటలు పరుస్తున్నాయి.