లక్షెట్టిపేట, జూలై 18 : లక్షెట్టిపేట పట్టణంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మిస్తుండగా, కూరగాయల వ్యాపారుల కష్టాలు తొలగిపోనున్నాయి. ప్రస్తుతం ఎండనకా.. వాననకా కవర్లు కప్పుకొని వ్యాపారం చేస్తుండగా, త్వరలోనే వారి కల నెరవేరబోతున్నది. స్థానిక మున్సిపల్ కార్యాలయం ముందు టీయూఎఫ్ఐడీసీ నిధులు రూ.3.90 కోట్లతో రెండు నెలల క్రితం ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్‌రావు, కలెక్టర్ భారతీ హోళీకేరి చేతుల మీదుగా పనులు ప్రారంభించగా, ప్రస్తుతం గ్రౌండ్ వర్క్ కూడా పూర్తయ్యింది. గతంలో ఇక్కడ తహసీల్దార్ నివాసం కోసం ఏర్పాటు చేసిన బంగ్లాతో పాటు పాత పోలీస్‌స్టేషన్ శిథిలావస్థకు చేరింది. వ్యాపారుల ఇబ్బందులను అధికారులు, ప్రజాప్రతినిధులు కలెక్టర్ భారతీహోళికేరి దృష్టికి తీసుకురావడంతో ఆమె సర్కారుకు నివేదిక పంపించారు. ఇందుకు స్పందించిన ప్రభుత్వం ఆ స్థలాన్ని మున్సిపాలిటీకి అప్పగించాలని ఆదేశించింది. దీంతో పాటు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి నిధులు కూడా మంజూరు చేసింది. దీంతో బంగ్లాలను కూల్చివేసి ఆ స్థలంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మిస్తున్నారు. వ్యాపారుల ఇబ్బందులు చూడలేక టీఆర్ఎస్ నాయకులు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం కోసం చొరవచూపితే.. ఓర్వలేని ప్రతిపక్ష నేతలు అడ్డుపడే ప్రయత్నం కూడా చేశారని పలువురు ఆరోపిస్తున్నారు.
అన్నీ ఒకే చోట..
ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో కూరగాయలతో పాటు మటన్, ఫిష్ మార్కెట్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అధికారులు, మున్సిపల్ సిబ్బంది పనులను నిత్యం పర్యవేక్షిస్తున్నారు. ఏడాదిలోగా పనులు పూర్తి చేసే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. కాగా, ఇటీవల కురిసిన భారీ వర్షాలతో తీవ్ర ఇబ్బందులు పడ్డ వ్యాపారులు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఎప్పుడు పూర్తవుతుందా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
వ్యాపారుల కష్టాలు చూడలేకే..
నేను పుట్టి పెరిగింది ఇక్కడే. నా చిన్నతనం నుంచి చూస్తున్న. ఇక్కడ కూరగాయల మార్కెట్ లేక వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ వస్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా కూరగాయలు పెట్టుకొని అమ్ముతున్నారు. వానకు తడుస్తూ.. ఎండకు ఎండుతూ అనేక కష్టాలు పడుతున్నారు. చైర్మన్ అయ్యాక మొదట మార్కెట్ నిర్మించాలని అనుకున్న. అందుకే ఎమ్మెల్యే దివాకర్‌రావుతో కలిసి సర్కారు దృష్టికి తీసుకెళ్లినం. రూ. 3.90 కోట్లు మంజూరు చేశారు. వెంటనే పనులు చేపట్టాం. త్వరగా పూర్తి చేస్తాం.
– నలుమాసు కాంతయ్య, మున్సిపల్ చైర్మన్, లక్షెట్టిపేట
v 20 ఏండ్ల సంది రోడ్డుపైనే అమ్ముతున్నం..
నేను కూరగాయల వ్యాపారం చేయబట్టి 20 ఏండ్లు దాటింది. నా కొడుకు కూడా ఇదే వ్యాపారం చేస్తడు, రోడ్డు మీదే అమ్ముతున్న. ఎండాకాలం, వానకాలం మస్తు తిప్పలైతంది. ఇప్పటి దాకా మా బాధలను పట్టించుకున్నోళ్లు లేరు. ఇప్పుడు తెలంగాణ సర్కారోళ్లు కొత్త మార్కెట్ కట్టిస్తన్రు. ఇగ మా బాధలు తీరుతయ్.
– కట్ల సువర్ణ, కూరగాయల వ్యాపారి