తలమడుగు, జూలై 18 : జిల్లాలో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులు భేషుగ్గా ఉన్నాయని కేంద్ర బృందం సభ్యులు కొనియాడారు. సోమవారం మండలంలోని కజ్జర్ల, రుయ్యాడి, కుచులాపూర్ గ్రామాల్లో జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం ద్వారా జరుగుతున్న అభివృద్ధి పనులను కేంద్ర బృందం సభ్యులు మానిక్‌చంద్ పండిత్, కిరణ్‌కుమార్, అరవింద్‌కుమార్ ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్, అడిషనల్ కలెక్టర్ రిజ్వాన్షేక్ బాషాతో కలిసి పరీశీలించారు. హరితహారంలో నాటిన మొక్కలు, డంప్ యార్డు, శ్మశానవాటిక, ఉపాధిహామీ ద్వారా నిర్మించిన పశువుల పాకలు, కుచులాపూర్ శివారు గుట్టపై కూలీలు చేసిన పనులను పరిశీలించారు. గుట్టపైకి వాహనాలు వెళ్లడానికి సరైన మార్గం లేకపోవడంతో 3 కిలోమీటర్లు నడుచుకుంటా వెళ్లారు.
గ్రామాల్లో జరుగుతున్న ఉపాధిహామీ పనులు బాగున్నాయని కితాబిచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పనులు కల్పించాలన్నారు. గ్రామానికి వచ్చిన కేంద్ర బృందంతో పాటు జిల్లా అధికారులను పంచాయతీ సిబ్బంది శాలువాలతో సత్కరించారు. ఇక్కడ డీఆర్డీవో కిషన్, జడ్పీటీసీ గోక గణేశ్‌రెడ్డి, ఎంపీడీవో రమాకాంత్, ఎంపీవో దిలీప్‌కుమార్, సర్పంచులు మొట్టె వెంకటమ్మ, పోతారెడ్డి, మోహితె ప్రభ, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.