బేల, జూలై 18 : వర్షాల నేపథ్యంలో ప్రజలు ఆరోగ్యంపై జాగ్రత్త వహించాలని, దెబ్బతిన్న పంటల వివరాలను ప్రభుత్వానికి విన్నవిస్తామని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేర్కొన్నారు. సోమవారం బేల మండలం సాంగిడి, బెదోడ పెన్‌గంగ బ్యాక్ వాటర్‌తో దెబ్బతిన్న పంటపొలాలను జిల్లా ఆధికారులతో కలిసి పరిశీలించారు. సాంగిడిలో మెడికల్ క్యాంపును పరిశీలించి ఫీవర్ సర్వే, ప్రజల ఆరోగ్య స్థితిగతులు, పారిశుధ్యంపై పంచాయతీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ఇంటింటి ఫీవర్ సర్వే నిర్వహించి జ్వరాలు సోకిన వారికి వైద్యసేవలందించాలన్నారు.
నిరంతరం పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రతి శుక్రవారం డ్రై డే కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. దోమల నివారణకు ఆయిల్ బాల్స్ వేయాలన్నారు. మండలంలోని గర్భిణులు, ప్రసవాల వివరాలను వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. సీజనల్ వాధులు ప్రబలే ఆస్కారం ఉన్నందున జిల్లా వ్యాప్తంగా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామని తెలిపారు. బెదోడలో పెన్‌గంగ నీరు ప్రవేశించిన ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం బేల తహసీల్ కార్యాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్డీవో రమేశ్ రాథోడ్, జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి నరేందర్ రాథోడ్, జిల్లా వ్యవసాయాధికారి పుల్లయ్య, రోడ్లు-భవనాల శాఖ డిప్యూటీ ఈఈ సురేశ్, జిల్లా మలేరియా ఆధికారి డాక్టర్ శ్రీకాంత్, బేల ఎంపీపీ వనితాఠాక్రే, సర్పంచ్ వట్టిపెళ్లి ఇంద్రశేఖర్, నాయకులు గంభీర్ ఠాక్రే, మస్కేతేజ్రావ్, కన్నాల గంగన్న, కన్నాల మహేందర్, తహసీల్దార్ బడాల రాంరెడ్డి, ఎంపీడీవో భగత్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.