చిత్రంలో కనిపిస్తున్నది.. ఇది కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలంలోని చింతపల్లివాగు వద్ద నిర్మించిన వంతెన. చెలిమెల వాగు ప్రాజెక్టు ఆధునీకరణలో భాగంగా ప్రభుత్వం రూ.1.18 కోట్లతో నిర్మించింది. ఈ వాగు అవతల మూడు గ్రామాలు ఉండగా.. 300లకు పైగా కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. గతంలో చిన్నపాటి వర్షాలకే వాగు ఉప్పొంగి రాకపోకలు నిలిచిపోయేవి. బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి ప్రజలు అష్టకష్టాలు పడేవారు. ప్రభుత్వం 2018 సంవత్సరంలో వంతెన నిర్మించడంతో ఇబ్బందులు తొలిగిపోయాయి. ఇటీవల వచ్చిన వరదలకు వంతెన ఏ మాత్రం చెక్కు చెదర లేదు.
ఆదిలాబాద్ ప్రతినిధి/నిర్మల్, జూలై 16(నమస్తే తెలంగాణ) : ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా మారుమూల గ్రామాల ప్రజలతోపాటు ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆదివాసీలు వర్షాకాలంలో ఇబ్బందులు పడేవారు. కొద్దిపాటి వర్షాలకే వాగులు, వంకలు పొంగి లో-లెవల్ వంతెనలపై నుంచి నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయేవి. గత పాలకులకు ఎన్ని సార్లు విన్నవించినా సమస్య పరిష్కారం కాలేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం మారమూల గ్రామాల రహదారులపై ప్రత్యేక ధృష్టి సారించింది. గ్రామాల్లో రహదారులతోపాటు రోడ్లను నిర్మించింది. ఆదిలాబాద్ జిల్లాలో రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్ శాఖల ఆధ్వర్యంలో రూ.70.37 కోట్లతో 27 వంతెనలు నిర్మించారు. దీంతో భారీ వర్షాలు కురిసినా ప్రజలు సాఫీగా రాకపోకలు సాగిస్తున్నారు.
పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో..
వానకాలం వచ్చిందంటే రోడ్లు, వంతెనల పైనుంచి నీరు ప్రవహించేది. గ్రామాలకు రాకపోకలు నిలిచేవి. వర్షం తగ్గిన కొన్ని గంటల తర్వాత వరద ప్రవాహం తగ్గడంతో ప్రజలు ఇబ్బందులు పడుతూ వంతెనలు దాటేవారు. వైద్యం కోసం వెళ్తున్న వారి పరిస్థితి ఎప్పుడు ఏవుతుందో తెలియదు. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం వంతెనలు నిర్మించింది. జిల్లా పంచాయతీరాజ్‌శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో రూ.25.37 కోట్లతో 7 భారీ వంతెనలు నిర్మిస్తున్నారు. నిర్మాణాలు చివరి దశకు చేరుకోగా అధికారులు త్వరలో వీటిని ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, వంతెనల నిర్మాణంతో ప్రజలు అత్యవసర సమయాలతోపాటు వానకాలంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాకపోకలు సాగించవచ్చు.
ఆర్అండ్బీ ఆధ్వర్యంలో 20 వంతెనలు
రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో వర్షం తగ్గిన కొన్ని గంటల తర్వాత వరద ప్రవాహం తగ్గడంతో ప్రజలు ఇబ్బందులు పడుతూ వంతెనలు దాటేవారు. ఈ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం జిల్లాలో వంతెనలు నిర్మించింది. జిల్లాలో రూ.45 కోట్లతో 20 వంతెనలు నిర్మించారు. వీటి నిర్మాణాలతో భారీ వర్షాలు కురిసినా గ్రామాలు పట్టణాలకు ఎలాంటి రవాణాపరమైన ఇబ్బందులు కలుగడం లేదు. వానకాలంలో భారీ వర్షాలు కురిసినా మారుమూల, ఏజెన్సీ గ్రామాల ప్రజలు ఏళ్లుగా ఎదురుచూస్తున్న సమస్యలకు పరిష్కారం దొరికింది.
నిర్మల్ జిల్లాలో..
ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించిన వంతెనలు చిన్నపాటి వరదలకే కొట్టుకుపోయేవి. నిర్మాణ వ్యయం కన్నా వీటి మరమ్మతులకు అయ్యే ఖర్చు తడిసి మోపడయ్యేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వా త బ్రిడ్జిల నిర్మాణ నాణ్యతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా, నిబంధనలు ఉల్లంఘించే కాంట్రాక్టర్లపై చర్యలు కూడా తీసుకుంది. బ్రిడ్జిల నిర్మాణ పనుల్లో నాణ్యతా కోసం క్వాలిటీ కంట్రోల్ విభాగాన్ని క్రియాశీలకం చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నిర్మల్ జిల్లావ్యాప్తంగా 53 వంతెనలు ఉండగా, స్వరాష్ట్రంలో 2014 తర్వాత అదనంగా 38 వంతెనలను నిర్మించారు. వీటిలో ఆర్అండ్బీ శాఖ పరిధిలోనే 36 బ్రిడ్జిలు ఉన్నాయి. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో మరో రెండు ఉన్నాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు రోడ్లు, భవనాల శాఖ పరిధిలో 48 బ్రిడ్జిలు ఉండగా, వీటిలో 36 వంతెనలు శిథిలావస్థకు చేరుకోవడంతో వీటి స్థానంలో తెలంగాణ ప్రభుత్వం కొత్త వంతెనల నిర్మాణం చేపట్టింది.
ఇందుకోసం రూ.130 కోట్లు మంజూరు చేసింది. అలాగే పంచాయతీరాజ్‌శాఖ పరిధిలో రాష్ట్రం ఏర్పడక ముందు జిల్లావ్యాప్తంగా ఐదు వంతెనలు ఉండగా, 2014 తర్వాత రూ.7.20 కోట్లతో రెండు వంతెనల నిర్మించింది. మరో రూ.3.80 కోట్లతో సారంగాపూర్ మండలం బీరవెల్లి వద్ద స్వర్ణనదిపై వంతెన నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇలా ఎక్కడికక్కడ ప్రభుత్వం నిర్మించిన ఈ వంతెనలు ప్రధాన ప్రాంతాల రాకపోకలకు వారధులుగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో గత వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలతో పోటెత్తిన వరదలు జిల్లాను అతలాకుతలం చేశాయి. చాలా చోట్ల రోడ్లు, ఇతర ఆస్తులకు నష్టం వాటిల్లినప్పటికీ, ఎక్కడా కూడా వంతెనలు చెక్కు చెదరలేదు.
వంతెన చెక్కుచెదరలేదు
వరదలకు మా గ్రామం వద్ద నిర్మించిన వంతెన ఏమాత్రం చెక్కుచెదరలేదు. వాగు అవతల చింతపల్లినా యికపుగూడ, బీమారం నాయకపుగూడ, ఇరుకపల్లి గ్రామాల ప్రజలు మండల కేంద్రానికి రావాలంటే తప్పకుండా వంతెన దాటాలి. మూడేళ్ల క్రితం ప్రభుత్వం వంతెన నిర్మాణం చేసింది. మాకు రవాణా ఇబ్బందులు తొలగించింది. ఇందుకు సర్కారుకు రుణపడి ఉంటాం.
– సండ్ర సుధాకర్, నాయకపుగూడ
మెరుగు పడిన రవాణా సౌకర్యం
ఆదిలాబాద్ జిల్లాలోని రోడ్లు భవనాల శాఖల ఆధ్వర్యంలో 28 వంతెనలు నిర్మిస్తుండగా 19 వంతెనలు పూర్తయ్యాయి. మరో తొమ్మిదింటి పనులు వివిధ దశల్లో ఉన్నాయి. గతంలో వంతెనలు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడేవారు. పలు గ్రామాలకు వానకాలంలో రాకపోకలు నిలిచేవి. ఇప్పుడు ఆ సమస్య లేకుండా పోయింది. ఆదిలాబాద్, బేల మీదుగా అంతర్రాష్ట్ర రోడ్డుపై తొమ్మిది వంతెనల నిర్మాణంతో ఇరు రాష్ర్టాల ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడింది. 108 అంబులెన్స్‌లు సకాలంలో గ్రామాలకు చేరుకుంటున్నాయి. తలమడుగు మండలం కజ్జర్ల, దేవాపూర్ మధ్య నిర్మించిన బ్రిడ్జి 25 గ్రామాల ప్రజలకు సౌకర్యంగా ఉంది. బంగారుగూడ వంటి వంతెనలతో విద్యార్థులకు సౌకర్యంగా ఏర్పడింది. ఏజెన్సీ గ్రామాల ప్రజలకు వంతెనలు ఉపయోగపడుతున్నాయి.
– సురేశ్‌రాథోడ్, డిప్యూటీ ఇంజినీర్, ఆర్అండ్బీ
మందపెల్లి వంతెన నిర్మాణంతో పది గ్రామాలకు మేలు
పెంబి మండలంలోని మందపెల్లి గ్రామం వద్ద పలికేరి వాగుపై 2018లో వంతెన నిర్మించడం వల్ల దాదాపు పది గ్రామాలకు మేలు జరుగుతోంది. దాదాపు రూ.2 కోట్లతో రోడ్లు భవనాలశాఖ ఆధ్వర్యంలో నిర్మించిన ఈ వంతెన వల్ల పెంబి, తాటిగూడ, ఇటిక్యాల, అంకెన, రాయదారి, హరిచంద్‌తండా, పోడంపల్లి, కోరకంటి, కర్ణంలోద్ది తదితర గ్రామాలతోపాటు పలు గూడెంల రాకపోకలకు ఇబ్బందులు తొలిగాయి. గతంలో ఈ వంతెన లేనప్పుడు కేవలం లో-లెవల్ వంతెనపై రాకపోకలు సాగేవి. వానకాలం వచ్చిందంటే ఈ పల్లెలకు సంబంధాలు తెగిపోయేవి. చిన్న పాటి వర్షాలకే లోలెవల్ వంతెనపై నుంచి వరద ప్రవహించేది. దీంతో తెలంగాణ ప్రభుత్వం 2017లో ఇక్కడ వంతెన నిర్మించాలని తలపెట్టింది. 1.82 కోట్ల అంచనాలతో పనులను ప్రారంభించి 2018లో పనులు పూర్తి చేసింది.