ఆదిలాబాద్ ప్రతినిధి/నిర్మల్ (నమస్తే తెలంగాణ), జూలై 15;‘భారీ వర్షాలతో నష్టపోయిన వారిని ప్రభుత్వ పరంగా ఆదుకుంటాం.. ఎవరూ అధైర్య పడవద్దు’ అని ప్రజాప్రతినిధులు, అధికారులు భరోసానిచ్చారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లోని వరద ప్రభావిత గ్రామాల్లో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యేలు జోగురామన్న, రాథోడ్ బాపురావ్, విఠల్ రెడ్డి, రేఖానాయక్, ఇతర అధికారులు పర్యటించి పరిస్థితులపై ఆరా తీశారు. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఆయా ప్రాంతాల్లో కలియదిరుగుతూ నీట మునిగిన పంటలు, దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులు, ఇండ్లను పరిశీలించారు. వీలైనంత త్వరగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని బాధితులకు హామీ ఇచ్చారు. ఇక రెవెన్యూ సిబ్బంది ముంపు గ్రామాల్లో పర్యటిస్తూ పంట నష్టం అంచనాల్లో నిమగ్నమయ్యారు.
భారీ వర్షాలతో నష్టపోయిన ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు శుక్రవారం కూడా పర్యటించారు. బాధితులు, ప్రజలకు అండగా ఉంటామని భరోసానిచ్చారు. మరోవైపు అధికారులు నష్టం అంచనా వేస్తూ గ్రామాల్లో పర్యటించారు. రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వారం రోజుల నుంచి నిర్మల్‌లోనే మకాం వేసి వరద పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. శుక్రవారం ఉదయం సోన్ మండలంలోని స్వర్ణ నదిపై జాఫ్రాపూర్, మాదాపూర్ వంతెనలను ఆయన పరిశీలించారు. దెబ్బతిన్న వంతెనలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం లక్ష్మణచాంద మండలంలోని లోతట్టు ప్రాంతాల్లో పర్యటించి, బాధితులకు భరోసానిచ్చారు. నిర్మల్-మంచిర్యాల ప్రధాన రహదారిపై న్యూసాంగ్వి వద్ద తెగిపోయిన అప్రోచ్‌రోడ్ పునరుధ్ధరణ పనులను మంత్రి పరిశీలించారు.
వేగంగా పనులు పూర్తి చేసి రాకపోకలను పునరుద్ధరించిన కాంట్రాక్ట్ ఏజెన్సీ, ఆర్ అండ్‌బీ అధికారులను మంత్రి అభినందించారు. కుంటాల మండలంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పర్యటించి, బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీనిచ్చారు. ఖానాపూర్ నియోజకవర్గంలోని దస్తూరాబాద్ మండలంలో ఎమ్మెల్యే రేఖానాయక్ పర్యటించారు. కడెం వరదల్లో ముంపునకు గురైన గొడిసెర్యాల, దేవునిగూడెం, రాంపూర్, భూత్కూర్, మున్యాల, రేవాజీపేట్, చెన్నూర్ తదితర గ్రామాలను ఎమ్మెల్యే సందర్శించారు. బాధితులకు జరిగిన నష్టం వివరాలను నమోదు చేసి నివేదికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. బాధితులందరికీ ఉచితంగా బియ్యం పంపిణీ చేపట్టాలని అధికారులకు సూచించారు. వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు తగ్గుముఖం పట్టడంతో జిల్లా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో..
ఆదిలాబాద్ మండలంలోని లింగుగూడ, గుండంలొద్ది, చిచ్‌ధరి , ఖండాల, దాహిగూడ ,లోకారి తదితర గ్రామాల్లో ఎమ్మెల్యే జోగు రామన్న పర్యటించారు. గ్రామస్తులతో మాట్లాడారు. దెబ్బతిన్న రోడ్లు,బ్రిడ్జిలను పరిశీలించారు. అధైర్యపడొద్దని రైతులకు భరోసానిచ్చారు. సీఎం కేసీఆర్ అన్నదాతకు అండగా ఉంటారని, పంటల క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత న్యాయం చేస్తామని హామీనిచ్చారు. బజార్హత్నూర్ మండలంలో ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ పర్యటించారు. ముంపు బాధితులతో మాట్లాడారు. అండగా ఉంటామని భరోసానిచ్చారు.