దండేపల్లి, జూలై15: ఆదివాసులు సంయమనం పాటించాలని ఐటీడీఏ పీవో వరుణ్రెడ్డి సూచించారు. మండలంలోని మాకులపేట జీపీ పరిధిలోని కోయపోషగూడ గిరిజన గ్రామాన్ని శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా గిరిజనులకు అటవీ హక్కులు, చట్టాలపై అవగాహన కల్పించారు. గిరిజనుల భూసమస్యను రాష్ట్ర ఉన్నతాధికారుతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తానన్నారు. ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలన్నారు. గిరిజనులు ఆక్రమించుకున్న స్థలాన్ని పరిశీలించారు. చట్టానికి వ్యతిరేకంగా వెళ్లి, అనవసరంగా కేసుల్లో ఇరుక్కొని ఇబ్బందులు పడొద్దని సూచించారు. తమకు న్యాయం చేయాలని, మహిళలపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని, మూడు ఎకరాల భూమిని కేటాయించాలని గిరిజనులు, ఆదివాసీ సంఘాల నాయకులు పీవోకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో ఆదివాసీ సేనా జిల్లా అధ్యక్షుడు కోట్నాక తిరుపతి, నాయకులు షాదం బాపు, గిరిజనులు ఉన్నారు.