ఆసిఫాబాద్,జూలై14 : ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్లు రాజేశం, చాహత్ బాజ్‌పాయి, ఏఎస్పీ అచ్చేశ్వర్రావ్తో కలిసి తీసుకోవాల్సిన రక్షణ చర్యలపై సంబంధితశాఖల అధికారులతో శుక్రవారం సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్షన్ పని ప్లాన్ ఉంటుందని తదనగుణంగా ప్రజల సహాయార్థం అధికార యంత్రాంగం పని చేస్తున్నదన్నారు. రెవెన్యూ , పోలీస్, పంచాయతీరాజ్‌శాఖ, మండల ప్రత్యేకాధికారులతో ప్రతి మండలానికి రవాణాశాఖ ఆధ్వర్యంలో వరదలతో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఎల్లప్పుడు సిద్ధంగా ఉండాలని సూచించారు. జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో వరదలు వచ్చే గ్రామాల్లో నాలుగు నెలల పాటు ప్రజలకు అవసరమైన సరుకులు అందంచడంతో పాటు, పెట్రోల్, డీజిల్ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
గ్రామాల్లో గర్భిణులు , అత్యవసర సేవలు ఉన్న వ్యాధిగ్రస్తులకు వైద్య సేవలు అందించేందుకు 15 రోజుల ముందుగా వారిని గుర్తించి మండల కేంద్రంలో ఉంచాలని పేర్కొన్నారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు స్తంభాలు, సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోతే గ్రామాల్లో త్వరగా చర్యలు చేపట్టాలన్నారు. ప్రజలకు శుద్ధజలం అందేలా చూడాలని కోరారు. జిల్లా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో వరదల సమయంలో రైతులు పొలాల్లోకి వెళ్లకుండా అవగాహన కల్పించాలన్నారు. విద్యార్థులు వాగులు దాటలేని పరిస్థితి ఉంటే ఆయా గ్రామాలు, విద్యార్థుల జాబితా తయారు చేసి దుస్తులు, పుస్తకాలు పంపిణీ చేయాలని సూచించారు.
మత్స్యకారులు , గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలన్నారు. పోలీసులశాఖ అధికారులు అన్ని శాఖలతో సమన్వయం చేస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వరదల సమయంలో అటవీశాఖ పరిధిలో రహదారులు, అంతర్గత రోడ్లు దెబ్బతిన్నప్పుడు ఎలాంటి అనుమతులు లేకుండా పనులు త్వరగా జరిగేందుకు సహకరించాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్వో కదం సురేశ్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.