మంచిర్యాల అర్బన్, జూలై 15 : జిల్లాలో ఐదు రోజులుగా కురిసిన వర్షాలకు 18 మండలాల్లోని 314 రెవెన్యూ గ్రామాల పరిధిలో 19,889 మంది రైతులకు చెందిన 34,687 ఎకరాల్లో వివిధ పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయాధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ఇందులో 32,285.5 ఎకరాల్లో పత్తి, 1648.48 ఎకరాల్లో వరితో పాటు 753 ఎకరాల్లో పంట పొలాల్లో ఇసుక మేటలు వేసినట్లు అంచనా వేశారు. జన్నారం మండలంలో 2726.2 ఎకరాల్లో వివిధ పంటలకు నష్టం జరిగింది. అలాగే మంచిర్యాల మండలంలో 403.5 ఎకరాలు, నస్పూర్‌లో 452.5, హాజీపూర్‌లో 1212, దండేపల్లిలో 2271, లక్షెట్టిపేటలో 1265.5 ఎకరాల్లో నష్టం వాటిల్లింది. చెన్నూర్ మండలంలో 5400 ఎకరాలు, కోటపల్లిలో 6486.5, మందమర్రిలో 705, జైపూర్‌లో 4125, భీమారంలో 1935 ఎకరాల్లో నష్టం జరిగింది. బెల్లంపల్లి మండలంలో 1346.08 ఎకరాలు, కాసిపేటలో 287.2, భీమినిలో 690, తాండూర్‌లో 753.5, నెన్నెలలో 318, కన్నెపల్లిలో 1810, వేమనపల్లి మండలంలో 2500 ఎకరాల్లో వివిధ పంటలకు నష్టం జరిగినట్లు వ్యవసాయాధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ఇది మరింత పెరిగే అవకాశం కూడా ఉన్నది.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో..
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): అధిక వర్షాల కారణంగా జిల్లాలో జరిగిన నష్టాలపై సర్వే చేపట్టేందుకు అధికార యంత్రాంగం గ్రామాల బాటపట్టింది. వాగులు, నదీ పరీవాహక గ్రామాల్లో అధికంగా పంటలు, రోడ్లు దెబ్బతినడంతో అధికారులు నష్టాలను అంచనా వేస్తున్నారు. జిల్లాలో సుమారు లక్ష ఎకరాల నుంచి లక్ష 50 వేల ఎకరాల్లో పంటల నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. అధికారుల సర్వే అనంతరం ఇంకా స్పష్టమైన అంచనా రానుంది. జిల్లాలో పత్తి, కంది, సోయా, పెసర ఇతర కూరగాయల పంటలకు తీవ్రంగా నష్టం కలిగింది.
పత్తి పంట 50 వేల నుంచి 60 వేల ఎకరాల వరకు కొట్టుకుపోయినట్లు అధికారులు భావిస్తున్నారు. కంది 10 వేల నుంచి 15 వేల ఎకరాలు, సోయా 1000 ఎకరాల వరకు, ఇతర మిరప, కూరగాయల పంటలు సుమారు 50 వేల ఎకరాల వరకు దెబ్బతిన్నట్లు ప్రాథమిక అంచనా వేశారు. పెంచికల్పేట్ మండలంలోని చేడ్వాయి, బొంబాయిగూడ, పెంచికల్పేట్, ఎల్లూరు, బెజ్జూర్ మండలంలోని అంబాగట్, కుకుడ, పాపన్నపేట్, సులుగుపల్లి , సిర్పూర్-(టీ) మండలంలోని వెంకట్రావ్‌పేట్ గ్రామాల్లోని పంటలను వ్యవసాయ అధికారులు పరిశీలించారు. నష్టాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సస్యరక్షణ చర్యలపై రైతులకు సలహాలు, సూచనలు చేశారు.