ఆదిలాబాద్ టౌన్, జూలై15: ఆదిలాబాద్ పట్టణానికి చెందిన సాయి వైకుంఠ ట్రస్టు ప్రధాన కార్యదర్శి కాడిగిరి రఘువీర్‌యాదవ్ తన సభ్యులతో కలిసి బంగారిగూడ పునరావాస కేంద్రం, తలమడుగు మండలం సాయిలింగి వృద్ధాశ్రమంలో 800 మందికి అన్నదానం చేశారు. యువనేస్తం అధ్యక్షుడు నిఖిల్ ప్రతినిధులతో కలిసి పట్టణంలోని పలు కాలనీల్లో సరుకులు అందజేశారు. పేదలు,అభాగ్యులకు ఆహారపొట్లాలు ఇచ్చారు. స్వాస్ సంస్థ అధ్యక్షుడు కారింగుల ప్రణయ్ కేఆర్కే కాలనీలో వృద్ధులు, బస్టాండు ,రైల్వే స్టేషన్లో అభాగ్యులకు బ్లాంకెట్లు, శాలువాలను అందజేశారు. డైనమిక్ యూత్ అధ్యక్షుడు పద్మావార్ రాకేశ్ ఆధ్వర్యంలో యువకులు పట్టణంలోని వరద బాధిత ప్రాంతాల్లో భోజన సౌకర్యం కల్పించారు. అవసరమైన మెడిసిన్ పంపిణీ చేశారు. ఆదిలాబాద్ పట్టణంలోని పలు కాలనీల్లో జోగు ఫౌండేషన్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పేదలకు నిరంతరం అన్నదానం చేశారు.
మంచిర్యాల జిల్లాలో వారం పాటు ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలకు పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లడం, గోదావరి, ప్రాణహితలు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు స్తంభించాయి. శిథిల భవనాలు కూలిపోయాయి. పంటలు నీట మునిగాయి. దీంతో మున్సిపల్, రెవెన్యూ, పోలీస్, విద్యుత్ శాఖలు అప్రమత్తమయ్యాయి. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి విస్తృత సేవలందించాయి. జిల్లాలోని ముంపుగ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి భోజన, వసతి సౌకర్యాలు కల్పించాయి. చెన్నూర్ మండలం సోమన్‌పల్లి గ్రామం వద్ద గోదావరి నదిలో చిక్కుకున్న రైతులు సోదారి సారయ్య, గట్టయ్యను కాపాడేందుకు వివిధ శాఖలు అహర్నిశలు శ్రమించాయి. కలెక్టర్ భారతీ హోళికేరి, ఏసీపీ నరేందర్, తహసీల్దార్ శ్రీనివాస్ రావు దేశ్‌పాండే, రెస్క్యూ టీంతో పాటు పలు శాఖల సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ గోదావరిలో చిక్కుకున్న వారిద్దరిని హెలిక్యాప్టర్ సాయంతో రక్షించారు.
కోటపల్లి మండలం పారుపల్లి గ్రామం వద్ద జిన్నింగ్ మిల్లులో చిక్కుకున్న యువకులను గ్రామస్తులు కాపాడారు. అక్కెపల్లి, చింతలపల్లితో పాటు కోటపల్లి మండలంలో పలువురు వరద బాధితులను బోటులో ఒడ్డుకు చేర్చారు. ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. వరద, ముంపు బాధితులకు వివిధ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు సైతం సేవలందించాయి. భోజనంతో పాటు వసతి సౌకర్యం కల్పించాయి. చెన్నూర్, కోటపల్లి మండలాల్లోని పలు ముంపు గ్రామాల ప్రజలను పట్టణంలోని సంతోషి మాత, హబీబ్, ఎంఆర్ఆర్ ఫంక్షన్ హాల్స్‌లలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. బాల్క ఫౌండేషన్ తరపున ఆర్బీఎస్ నాయకులు వాలా శ్రీనివాసరావుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు భోజన తదితర సేవలందించారు.
మంచిర్యాలలోని దాదాపు 150 కుటుంబాలకు మంచిర్యాలకు చెందిన కీర్తి నారీ ఫ్యాషన్ వరల్డ్ వారు ఆహారం, ఇతర సదుపాయాలు ఏర్పాటు చేశారు. హాజీపూర్‌లో సర్పంచ్ ఆధ్వర్యంలో బాధితులకు పులిహోర పొట్లాలు అందించారు. చెన్నూర్‌లోని 20 కుటుంబాలతో పాటు కోటపల్లి మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో పలు బాధిత కుటుంబాలకు బాల్క ఫౌండేషన్ తరపున కౌన్సిలర్ దోమకొండ అనిల్, టీఆర్ఎస్ నాయకులు మాంచెట్టి శ్రీనివాస్, లక్ష్మణ్ సహకారంతో తారాచంద్ దేవుడా నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. జాతీయ రహదారితో పాటు పలు రోడ్లను సంబంధిత ఆర్ అండ్ బీ అధికారులు పునరుద్ధరించారు. రాకపోకలకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు. భారీ నీటి మట్టంతో మంథని నుంచి చెన్నూర్ నియోజకవర్గంలోకి రావాల్సిన విద్యుత్ సరఫరాలో మూడు రోజులుగా అంతరాయం ఏర్పడింది. విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోవడం, కమ్యూనికేషన్ రంగానికి సైతం ఆటంకం ఏర్పడడంతో ఎస్ఈ శేషారావు తన బృందంతో రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. మంచిర్యాల నుంచి తాత్కాలికంగా విద్యుత్ సరఫరా అందించారు.
బాల్క ఫౌండేషన్ ద్వారా అండగా నిలిచాం.
కోటపల్లి, జూలై 15 : ప్రాణహిత, గోదావరి ప్రవాహం వల్ల లక్ష్మీపూర్, దేవులవాడ, కొల్లూరు, బోరంపల్లి గ్రామాల్లోకి వరద వచ్చింది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాం. మూడుచోట్ల సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశాం. ప్రతిరోజూ 1000 నుంచి 1500 మందికి బాల్క ఫౌండేషన్ ద్వారా ఉచితంగా భోజనం అందించాం. అన్ని సౌకర్యాలు కల్పించాం. ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆదేశాలతో వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడకుండా చూశాం. బాల్క ఫౌండేషన్ ద్వారా అండగా నిలిచాం.
– వాల శ్రీనివాస్ రావు, వైస్ ఎంపీపీ (కోటపల్లి)
తోచినంత సాయం
చెన్నూర్, జూలై 15 : విపత్తుల సమయంలో పేదలకు, బాధితులకు తోచినంత సాయం చేస్తున్నాం. ప్రస్తుతం ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలకు ఇబ్బందులు పడ్డ పలు కుటుంబాలకు సాయం చేశాం. బాల్క ఫౌండేషన్ తరపున కౌన్సిలర్ దోమ కొండ అనిల్, టీఆర్ఎస్ నాయ కులు మాంచెట్టి శ్రీనివాస్, లక్ష్మణ్ సహకారంతో చెన్నూర్ పట్టణంలో 20 కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించాం. పట్టణంలోని 9, 11వ వార్డుల్లో, కుమ్మరి బొగుడ, పద్మశాలి వాడ, ఇందిరా కాలనీలతో పాటు రొయ్యలపల్లిలో ప్రజాప్రతినిధుల సూచనల మేరకు అవసరమైన వారికి ఇచ్చాం. కోటపల్లి మండలంలోని ముంపు గ్రామం లక్ష్మీపూర్‌లో బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశాం.
– తారాచంద్ దేవుడా, స్వచ్ఛంద సేవకుడు, చెన్నూర్
సేవా కార్యక్రమాలు నిర్వహించాం
జైపూర్, జూలై 15 : భారీగా కురిసిన వర్షాలకు వాగులు.. వంకలు, గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో ప్రజలను అప్రమత్తం చేశాం. పోలీసు సిబ్బందితో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిం చాం. ఇందారం వద్ద గోదావరి ఉప్పొం గినప్పుడు వాహనాదారులను ఎప్పటిక ప్పుడు దారి మళ్లించాం. రసూల్‌పల్లి వాగు తాత్కాలిక రోడ్డు పైనుంచి ప్రవ హించినప్పుడు పలువురిని రోప్‌లు, జేసీబీ సాయంతో దవాఖాన కు చేర్చాం. ఎల్లంపల్లి, సుందిళ్ల ప్రాజెక్టు గేట్ల ఎత్తివేతతో వేలాల, పౌనూర్, శివ్వా రంతో పాటు పలు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించాం. చెన్నూర్ మండలం, కోట పల్లి మండలంలోని సోమన్‌పల్లి, రొ య్యలపల్లి, పుల్లగామ గ్రామాల్లో విప్ సుమన్‌తో కలిసి పర్యటించాం. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించాం. వరద ప్రాంతాల్లో ప్రజలకు సేవలందించిన జైపూర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సీఐలు, ఎస్ఐలు, సిబ్బందికి అభినందనలు.
– నరేందర్, జైపూర్ ఏసీపీ