నిర్మల్ టౌన్, జూలై 15: జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో భాగంగా నిర్మల్ జిల్లాలో చేపట్టిన పనులతో ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని కేంద్ర బృందం సభ్యులు ఎస్ఎన్ మిశ్రా, సురేంద్రచంద్ర పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని డీఆర్డీఏ కార్యాలయంలో కేంద్ర బృందం సభ్యులు శుక్రవారం సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం ద్వారా చేపట్టిన పనుల వివరాలను జిల్లా అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో తెలంగాణ హరితహారంలో మొక్కలు నాటి సంరక్షణకు తీసుకుంటున్న జాగ్రత్తలను డీఆర్డీవో విజయలక్ష్మి సభ్యులకు వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో కందకాల తవ్వకం, చెక్‌డ్యాంల నిర్మాణం, నీటి కుంటల నిర్మాణంతో భూగర్భజలాలు పెరిగాయనిన పేర్కొన్నారు. పనుల్లో కేంద్ర మార్గదర్శకాలను పాటించామన్నారు. కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్‌ను కలిసిన కేంద్రబృందం
నిర్మల్ జిల్లాలో నిర్వహించిన జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పనులను పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర బృంద సభ్యులు మిశ్రా, సురేంద్రచంద్ర శుక్రవారం నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. నిర్మల్ జిల్లాలో పరిశీలించనున్న పనుల వివరాలను కలెక్టర్‌కు వివరించారు. జిల్లాలో ఉపాధిహామీ పనులతో చేపట్టిన పనులన్నీ కేంద్ర బృంద సభ్యులకు ప్రజెంటేషన్ రూపంలో వివరించాలని జిల్లా అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ఈజీఎస్ పనుల పరిశీలన
సోన్, జూలై 15: జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద చేపట్టిన పనులను కేంద్ర బృందం సభ్యులు మిశ్రా, సురేంద్రచంద్ర శుక్రవారం పరిశీలించారు. నిర్మల్ మండలంలోని భాగ్యనగర్, మేడిపెల్లి, న్యూపోచంపాడ్ గ్రామాల్లో ఉపాధిహామీ పనులతో చేపట్టిన సీసీ రోడ్లు, మురుగు కాలువలు, తెలంగాణ హరితహారంలో నాటిన మొక్కలు, ఇంకుడుగుంతల నిర్మాణం, మరుగుదొడ్లు తదితర పనులను తనిఖీ చేశారు. ఆయా గ్రామాల్లో చేపట్టిన పనులు, నిధులు, ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ డీఆర్డీవో విజయలక్ష్మి, ఎంపీడీవో శ్రీనివాస్‌రావు, తహసీల్దార్ ప్రభాకర్, సర్పంచులు ఉన్నారు.