మంచిర్యాల(నమస్తే తెలంగాణ)/దండేపల్లి, జూలై 9 : జాతీయ స్థాయిలో టైగర్ రిజర్వ్‌గా గుర్తించిన అటవీ ప్రాంతంలో భూ ఆక్రమణ, వ్యవసాయం చేయడం చట్టరీత్యా నేరమని జన్నారం అటవీ డివిజనల్ అధికారి(డీఎఫ్‌వో) మాధవరావు ఓ ప్రకటనలో తెలిపారు. టైగర్ రిజర్వ్ పూర్తిగా అటవీ ప్రాంతమని, ఇందులో సాగు చేయకూడదని, 2009లో కోయపోషగూడ గ్రామస్తులు సాగు చేయడం కోసం యత్నించారని తెలిపారు. 2021 నుంచి మళ్లీ సాగు చేయడం ప్రారంభించారని, ఈ చర్యను విరమించాలని కోరుతూ గ్రామస్తులకు నిరంతరం కౌన్సెలింగ్ చేశామన్నారు. మే 2022లో మహిళలతో ప్రారంభించి భారీ సంఖ్యలో అటవీప్రాంతాన్ని చదును చేశారని, ఈ క్రమంలో ఐటీడీఏ పీవో, అటవీశాఖ ఉన్నతాధికారులు, పోలీస్‌శాఖ ఉన్నతాధికారులతోపాటు వివిధ స్థాయిల్లోని అధికారులు సదరు భూమి ఆర్వోఎఫ్ఆర్ చట్టం పరిధిలోకి రాదని గ్రామస్తులకు నచ్చజెప్పి ఖాళీ చేయాలని కోరారని గుర్తు చేశారు. అయినా వివిధ రాజకీయ పార్టీలు, ఆదివాసీ ఫెడరేషన్లు ఈ సమస్యను సమర్థించడంతో గ్రామస్తులు ఇవేమీ పట్టించుకోకుండా ఆ ప్రాంతాన్ని వదిలివెళ్లే స్థితి లేదని భీష్మించుక కూర్చున్నారని పేర్కొన్నారు.
కోయపోషగూడ గ్రామంలో అందరికీ ఇండ్లు ఉన్నాయని, ఈ ప్రాంతం అడవికి ఆనుకొని ఉండడంతో ఆక్రమణలో భాగంగా కొద్ది రోజుల క్రితం ఇక్కడ గుడిసెలు ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ ప్రాంతం 2012లో నోటిఫై చేసిన కవ్వాల్ టైగర్ జోన్ రిజర్వ్ పరిధిలోని బఫర్ జోన్లో ఉందని, ఈ ప్రాంతం టైగర్ రిజర్వ్‌లో భాగమైనందువల్ల వన్యప్రాణులు, విషపురుగుల నుంచి ముప్పు ఉందని, అటవీ ప్రాంతం ఖాళీ చేయాలని రెవెన్యూ, అటవీశాఖల అధికారులు చాలాసార్లు గ్రామస్తులను కోరారని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలు, చట్టాన్ని అనుసరించి రెండు రోజుల క్రితం పోలీసులు, అటవీ అధికారులతో కలిసి సదరు గుడిసెలను తొలగించారని, ఈ ప్రక్రియలో గ్రామస్తులు సిబ్బందిపై దాడి చేయడంతో చాలా మంది తీవ్రంగా గాయపడ్డారని మాధవరావు పేర్కొన్నారు. ప్రభుత్వ జీపును ధ్వంసం చేశారని, కానీ.. తమ శాఖ నుంచి ఎటువంటి దాడి జరగలేదని స్పష్టం చేశారు. కేవలం గ్రామస్తులు మాత్రమే సిబ్బందిపై దాడి చేశారని డీఎఫ్‌వో తెలిపారు. టైగర్ రిజర్వ్ ప్రాంతంలో భూమిని ఆక్రమించడం చట్టరీత్యా నేరమని, కోయపోషగూడ గ్రామస్తులు అటవీ అధికారులకు సహకరించాలని జన్నారం అటవీ డివిజనల్ అధికారి మాధవరావు కోరారు.
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మాకులపేట జీపీ పరిధిలో గల కోయపోషగూడలో 150 ఎకరాల భూమి కోసం 52 కుటుంబాలు పట్టుబడుతున్నాయి. వారితో ఐటీడీఏ, ఫారెస్టు, పోలీసు, రెవెన్యూ అధికారులు ఎన్నిసార్లు చర్చలు జరిపినా సమస్య పరిష్కారం కావడం లేదు. ఏటా పోడు భూముల్లో సాగుకు ప్రయత్నించి దుక్కిదున్ని, విత్తనాలు చల్లుకోవడం, అటవీ అధికారులు వచ్చి అడ్డుకోవడం పరిపాటిగా మారింది. అటవీ సంరక్షణలో భాగంగా భూములను ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్వాధీనం చేసుకోవడం, కందకాలు తవ్వడం, మొక్కలు నాటడం చేస్తున్నామని అటవీ అధికారులు పేర్కొంటున్నారు. దీంతో అటవీ అధికారులకు, కోయపోషగూడ గ్రామస్తులకు తగాదా జరుగుతున్నది. శుక్రవారం రాత్రి గిరిజనులు అదే స్థానంలో మళ్లీ మూడు గుడిసెలు వేశారు.
అటవీ భూ ముల్లో గిరిజనులు గుడిసెలు వేసుకోవడంతో ఫారెస్టు, పోలీసు అధికారులు సిబ్బందితో కలిసి గుడిసెలను తొలగిస్తున్నారు. గురువారం మూడు గుడిసెలను తొలగించిన అధికారులు, శుక్రవారం ఉదయమే సిబ్బందితో చేరుకున్నారు. మిగతా గుడిసెలను తొలగించారు. కోపోద్రిక్తులైన గిరిజన మహిళలు అధికారులపై ఎదురుదాడికి దిగారు. పోలీసు, ఫారెస్టు సిబ్బందిని కోయపోషగూడ గ్రామస్తులు వారించారు. ఈ నేపథ్యంలో అధికారులు ఆరుగురు గిరిజన మహిళలను అదుపులోకి తీసుకున్నారు. తాళ్లపేట రేంజ్ కార్యాలయానికి తరలించారు. ఆగ్రహంతో గూడెంవాసులు ఫారెస్టు కార్యాలయాన్ని ముట్టడించారు. ఎలాంటి కేసులూ లేకుండా తమ వాళ్లను విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. ఫారెస్టు గేటు ముందు, ఎఫ్ఆర్వో కార్యాలయం ముందు, ప్రధాన రహదారి ముందు బృందాలవారీగా ఆందోళనలు చేశారు. తహసీల్దార్ హన్మంతరావు తన సిబ్బందితో కలిసి ఫారెస్టు కార్యాలయానికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దేందుకు యత్నించారు. కేసులు నమోదు చేయడం లేదని, బైండోవర్ మాత్రమే చేస్తున్నామని, ఆరు నెలలపాటు ఎటువంటి గొడవలకు పాల్పడవద్దని, లేకపోతే జరిమానా విధిస్తామని స్పష్టం చేయడంతో గ్రామస్తులు శాంతించారు.