బోథ్, జూలై 9 : బోథ్ మండలంలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం వరకు వర్షం ఎడతెరపిలేకుండా కురిసింది. పెద్దవాగు, ధన్నూర్(బీ), సొనాల, అందూర్, పెద్దగూడ, కండ్రాగు, పట్నాపూర్ వాగులు పొంగిపొర్లుతున్నాయి. వంతెనలపై నుంచి వాగులు ప్రవహించడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. ధన్నూర్ (బీ) వద్ద వాగు మూలంగా గ్రామస్తులతో పాటు నాగాపూర్, జైనూర్పల్లె, దర్బతండా గ్రామాల ప్రజలు ఐదు గంటల పాటు నిరీక్షించారు. పట్నాపూర్ వద్ద వంతెన నిర్మాణంలో పక్కన ఏర్పాటు చేసిన తాత్కాలిక పైపు కల్వర్టు రోడ్డుపై నీరు ప్రవహించడంతో పాటు కొట్టుకుపోవడంతో మర్లపెల్లి, సుర్తాపూర్, నిగిని, కంటెగాం, బాబెర, నక్కలవాడ, కొత్తపల్లె, లక్ష్మీపూర్, రేండ్లపల్లె, చింతగూడ, నేరేడుపల్లె, నేరేడుపల్లెగూడ గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అందూర్ సమీపంలోని వాగు కల్వర్టుపై నుంచి వర్షపు నీరు పారడంతో నారాయణ్‌పూర్, అందూర్ గ్రామాల గిరిజనులు దాటలేక పోయారు. సొనాల వాగుపై కోటా(కే) మార్గంలో లోలెవల్ వంతెనపై నుంచి నీరు ప్రవహించడంతో కోటా(కే), మహాదుపటేల్పల్లె గ్రామాల ప్రజలు అవస్థలు పడ్డారు. మరోవైపు వాగు పరీవాహక, లోతట్టు ప్రాంతాల్లోని పొలాల్లో నీరు నిలిచిపోవడంతో పత్తి, సోయా, కంది పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. వర్షాలతో చెరువులు నిండి అలుగు పోస్తున్నాయి.
నేరడిగొండ, జూలై 9 : కుంటాల జలపాతానికి వెళ్లే రోడ్డు మార్గంలో గల సావర్గాం వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో అటువైపు ఉన్న గ్రామాల ప్రజలకు రాకపోకలు నిలిచిపోయాయి. శనివారం వారసంత కావడంతో వర్షంతో పాటు వరద రోడ్డుపై ప్రవహించడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న విషయాన్ని జడ్పీటీసీ జాదవ్ అనిల్, ఎంపీపీ రాథోడ్ సజన్ తెలుసుకొని వారు అక్కడికి చేరుకొని వరద పరిస్థితిని పరిశీలించారు. అటువైపు ఉన్న గ్రామస్తులు వాగు దాటి రావద్దని సూచించారు. అలాగే వాంకిడి, లఖంపూర్, కడెం వాగు ఉధృతంగా ప్రవహించాయి. పంట చేన్లలోకి వరద చేరి పంటలకు నష్టం వాటిల్లింది. కుంటాల జలపాతం వరదతో పోటెత్తింది. జలపాతం ఎగువ నుంచి భారీ వరద చేరడంతో ఎతైన ప్రాంతం నుంచి నీరు దిగువకు ప్రవహించింది.
ఇంద్రవెల్లి, జూలై 9 : మండలంలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంల్లోకి భారీగా వరద చేరడంతో నీటితో కళకళలాడుతున్నాయి. గ్రామాలకు చెందిన వాగుల్లో ఆదివాసీ గిరిజనులు చేపలు పట్టారు.
ఉట్నూర్ రూరల్, జూలై 9 : మండల కేంద్రంతో పాటు గంగన్నపేట, లక్కారం, దంతన్‌పల్లి, బీర్సాయిపేట, నాగపూర్‌లోని చెరువులు వరదతో నిండుకున్నాయి. వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని చేన్లలో వర్షపు నీరు నిలిచి పంటలు నీట మునిగాయి. మరికొన్ని చోట్ల పంట చేన్లు కోతకు గురుయ్యాయి.
ఉట్నూర్, జూలై 9: ఉట్నూర్ డివిజన్ కేంద్రంతో పాటు ఏజెన్సీ మండలాల్లో భారీ వర్షం కురిసింది. వాగులు, వంకలు నిండు కుండలా మారాయి. ఉట్నూర్, ఇంద్రవెల్లి, నార్నూర్, గాదిగూడ మండలాల్లో కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వర్షంతో మండల అధికారులు, పోలీస్ యంత్రాంగం అప్రమత్తమయ్యారు.
సిరికొండ, జూలై 9 : మండల కేంద్రంతో పాటు మండలంలోని రాంపూర్, పొన్న, రాయిగూడ, కొండాపూర్, రిమ్మ, వాయిపేట, ఫకీర్‌నాయక్‌తండా గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. మురుగు కాల్వలు నీటితో నిండి రోడ్లపై ప్రవహించాయి. చెమ్మాన్ వాగు మత్తడి ప్రవహించింది.
భీంపూర్, జూలై 9 : భీంపూర్ మండలంలోని పెన్‌గంగలోకి వరద వచ్చి చేరుతున్నది. వర్షం కారణంగా చేన్లలో పనులు నిలిచిపోయాయి. ఆదిలాబాద్ – కరంజి(టీ),అందర్‌బంద్ రూట్లలో బస్సుల రాకపోకలకు ఇబ్బంది అయింది.