ఎదులాపురం,జూన్ 27 : వర్షాకాలం దృష్ట్యా ఆదిలాబాద్ పట్టణంలో పరిసరాల శుభ్రతకు అధిక ప్రాధాన్యమిస్తూ పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మున్సిపల్ శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పట్టణ ప్రగతిలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిపై మున్సిపల్, వార్డు ప్రత్యేకాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్షాకాలం ప్రారంభమైనందున పరిసరాల శుభ్రత పా టించాలని తెలిపారు.
ఈ సీజన్లో వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని పట్టణంలోని అన్ని వార్డుల్లో పారిశుధ్య కార్యక్రమాలు నిరంతరం కొనసాగించాలని ఆదేశించారు. పన్ను వసూళ్లలో వేగం పెం చాలని, ఏండ్లుగా పేరుకుపోయిన ఆస్తి పన్నును వందశాతం వసూలు చేయాలని పేర్కొన్నారు. పట్ణణంలోని ఆయా ప్రాంతాల్లో శిథిలావస్థలో ఉన్న భవనాలను గుర్తించాలని తెలిపారు. వాటిని కూల్చి వేసేందుకు తక్షణం చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పట్టణంలో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న కట్టడాలను వెంటనే నిలిపివేయాలన్నారు.
పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్‌ను వంద శాతం నిషేధించాలని పేర్కొన్నారు. ఈ విషయమై ప్రజలు, వ్యాపారులకు అవగాహన కల్పించాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్లాస్టిక్ అమ్మినా, ఉపయోగించినా జరిమానా వసూలు చేయాలని సూచించారు. ఇప్పటి వరకు నల్లా కనెక్షన్లు లేని ఇళ్లను గుర్తించి నీటి సరఫరా అందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, మున్సిపల్ కమిషనర్ శైలజ, తహసీల్దార్లు సతీశ్, వనజ, వార్డు ప్రత్యేకాధికారులు పాల్గొన్నారు.