బజార్హత్నూర్, జూన్ 26 : ఐదో విడుత పల్లె ప్రగతి పనులు ముగిశాయి. ఈ నెల 3 నుంచి చేపట్టిన పల్లె ప్రగతి పనులు 15 రోజుల పాటు కొనసాగాయి. ప్రధానంగా పారిశుధ్యానికి పెద్దపీట వేశారు. పల్లె ప్రగతిలో చేపట్టాల్సిన పనులపై పంచాయతీల్లో గ్రామసభలు ఏర్పాటు చేసి ప్రజలకు వివరించారు. మండలంలో 30 పంచాయతీలు ఉండగా, ప్రతి గ్రామానికి నోడల్ అధికారిని నియమించి పనులు చేపట్టారు. రెండు, మూడు రోజులకోకసారి జిల్లా స్థాయి అధికారులు పనులను పర్యవేక్షించారు.
చేపట్టిన పనులు..
గ్రామాల్లో రోడ్లు శుభ్రం చేయడం, డ్రైనేజీలో పూడికతీయడం, శిథిలావస్థలో ఉన్న ఇళ్లను కూల్చివేయడం, పిచ్చిమొక్కలు తొలగింపు, గుంతలను పూడ్చడం వంటి పనులు చేపట్టారు. రోడ్లకు ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్ గుర్తించారు. వీధి దీపాలను అమర్చి పాత స్తంభాలను తొలగించారు. కొత్తవి ఏర్పాటు చేశారు. గ్రామాల్లో అంతర్గత సీసీ రోడ్లు వేశారు. అన్ని సమస్యలు పరిష్కరించేందుకు పల్లె ప్రగతిలో పనులు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.
అందరి భాగస్వామ్యంతోనే..
పల్లె ప్రగతిలో భాగంగా పల్లెల్లో పెద్ద ఎత్తున పారిశుధ్య పనులు చేయించాం. వానకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఇబ్బంది కలుగకుండా పనులు చేపట్టాం. ప్రజల భాగస్వామ్యంతోనే పనులు పూర్తి చేశాం -మహేందర్రెడ్డి,ఎంపీడీవో, బజార్హత్నూర్