ఉట్నూర్, జూన్ 22 : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీపీ పంద్ర జైవంత్రావ్ పిలుపునిచ్చారు. మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో బుధవారం ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ గ్రామాల్లోని ప్రతి ఇంటి పరిసరాల్లో, ప్రధాన రోడ్డుకు ఇరువైపులా, ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటి సంరక్షించాల్సిన బాధ్యత పంచాయతీ కార్యదర్శులపై ఉందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో తిరుమల, సర్పంచ్లు, అటవీ శాఖ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
సిరికొండ, జూన్ 22: తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీడీవో సురేశ్ పిలుపునిచ్చారు. మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఉపాధి హామీ, పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో హరితహారం కోసం చేస్తున్న పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ హరితహారం కార్యక్రమానికి పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలని, అందుకు అవసరమైన మొక్కలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధి హామీ ఏపీవో జాదవ్ శేషారావ్, టీఏలు సుభాష్, రవి, మోహన్, ధన్రాజ్, కృష్ణ, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.